సమాన దూరమే సరిపోదు | Not considered equal - sivaramakrishnan committee | Sakshi
Sakshi News home page

సమాన దూరమే సరిపోదు

Published Sun, Jul 27 2014 2:41 AM | Last Updated on Sat, Aug 18 2018 8:49 PM

సమాన దూరమే సరిపోదు - Sakshi

సమాన దూరమే సరిపోదు

రాజధాని అంటే చాలా కావాలి.. ఎంపిక తేలిక కాదు
 
శివరామకృష్ణన్ కమిటీ వ్యాఖ్య
మధ్యలో ఉండటం ఒక్కటే ప్రధానం కాదు
ఫలానా ప్రాంతంలో రాజధాని ఏర్పాటు
చేయాలనే కోరిక ప్రభుత్వానికి ఉండొచ్చు
రాజధానికి చౌకగా భూములు లభించాలి.. భూముల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి
‘ల్యాండ్ పూలింగ్’పై ప్రభుత్వమే చెప్పాలి
అనుకూలమైన నేల, వాతావరణం, నీరుండాలి
అన్ని ప్రధాన కార్యాలయాలూ రాజధానిలోనే ఉండాల్సిన పనిలేదు..
సచివాలయం, అసెంబ్లీ, ఎమ్మెల్యే, మంత్రుల ఇళ్ల్లు, ఉద్యోగుల గృహాలు ఒక చోట ఉండాలి
సూపర్ రాజధాని నిర్మాణం పరిష్కారం కాదు
{పకాశం, నెల్లూరు, కడప, శ్రీకాకుళం జిల్లాల్లో కూడా త్వరలో పర్యటిస్తాం
 వచ్చే నెల నివేదిక .. నిర్ణయం ప్రభుత్వాలదే

 

‘‘రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సమాన దూరంలో ఉండటం ఒక్కటే రాజధాని ఎంపికకు ప్రధాన అర్హత కాదు. చౌకగా భూమి లభించడం, అనువైన నేల, అనుకూలమైన వాతావరణం, నీటి లభ్యత వంటి చాలా అంశాలు చూడాలి’’ అని ఏపీ రాజధాని ఎంపికపై కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ తెలిపింది. శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో భేటీ అనంతరం ‘ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ హ్యూమన్ సెటిల్‌మెంట్స్’ డెరైక్టర్ అరోమర్ రెవితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజధాని ఎక్కడ ఉంటే బాగుంటుం దనే విషయంలో తాము సిఫార్సులు మాత్రమే చేస్తామని, ఒక ప్రాంతాన్ని నిర్ధారించి చెప్పబోమని చెప్పారు. తాము నివేదిక ఇచ్చిన తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్చించుకుని రాజధానిపై తుది నిర్ణయం తీసుకుంటాయని తెలిపారు. విలేకరుల సమావేశంలో శివరామకృష్ణన్, రెవి వెల్లడించిన ముఖ్యాంశాలు..

 దేశంలో ఇంతకు ముందెప్పుడూ ఇట్లాంటి విభజన జరగలేదు. గతంలో మూడు కొత్త రాష్ట్రాలు ఏర్పాటైనప్పుడు కూడా రాజధానిని పూర్తిగా తరలించాల్సిన అవసరం రాలేదు. ఇక్కడ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌కు కొత్త రాజధాని ఎంపిక సంక్లిష్టమైన వ్యవహారం.
రాష్ట్రంలో ఏ ఒక్క ప్రాంతమో రాజధాని ఏర్పాటుకు అనుకూలంగా ఉందని చెప్పలేం. కొన్ని ప్రాంతాల్లో కొన్ని సానుకూల అంశాలున్నాయి.
రాష్ట్రంలో 3, 4 ప్రధాన అభివృద్ధి కేంద్రాలు ఉండాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. వైజాగ్, తిరుపతి, అనంతపురం, కర్నూలు ప్రాంతాల్లో ఈ కేంద్రాలుండాలనే యోచనలో ఉన్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, నీటి నిర్వహణ గురించి సీఎంతో చర్చించాం. రాయలసీమలో సగటు వర్షపాతం కూడా పడని విషయాన్ని, ఆ ప్రాంతవాసులు నీటి కోసం పడుతున్న ఆరాటాన్ని వివరించాం.
 ► రాజధానికి అనువైన ప్రాంతాన్ని గుర్తించడానికి ముఖ్యమంత్రి కార్యాలయం కూడా ప్రయత్నిస్తోంది. కానీ ఆంధ్రప్రదేశ్‌లో రాజధానికి అనువైన ప్రాంతాన్ని ఎంపిక చేయడం అంత సులభం కాదు. రాష్ట్రానికి మధ్యలో ఉండటం కూడా రాజధానికి ముఖ్యమే. కానీ అదొక్కటే రాజధాని ఏర్పాటుకు ప్రధానం కాదు. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా భూముల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ‘లాండ్ పూలింగ్’ గురించి ముఖ్యమంత్రి చెబుతున్నారు. అది కొత్త విధానం. విజయవంతమైతే మంచిదే. ఇప్పటికిప్పుడే ‘లాండ్ పూలింగ్’ చేసి రమ్మని ప్రభుత్వానికి చెప్పలేం. కొత్త విధానం అమల్లో సాధ్యాసాధ్యాలను ప్రభుత్వమే చెప్పాలి.
ఫలానా ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేయాలనే కోరిక ప్రభుత్వానికి ఉండొచ్చు. కోరిక ఉండటం ఒక్కటే భూమిని తయారు చేయలేదు. చౌకగా భూమి లభించాలి. భూసేకరణకే భారీగా నిధులు వెచ్చించాల్సిన పరిస్థితి కొత్త రాజధాని నిర్మాణంలో ఉండకూడదు. భూమితో పాటు అవసరమైన నీటి సౌకర్యం కూడా ఉండాలి. వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని రాజధాని ప్రాంతాన్ని ఎంపిక చేయాలి.
అసెంబ్లీ భవనం, ఎమ్మెల్యేల క్వార్టర్లు, అసెంబ్లీ ఉద్యోగులకు నివాసాల నిర్మాణానికి ఒకే ప్రాంతంలో 60 నుంచి 70 ఎకరాలు కావాలి. ముఖ్యమంత్రి కార్యాలయం, సచివాలయానికి 15 నుంచి 20 ఎకరాలు సరిపోతుంది. కానీ మంత్రులు, సెక్రటేరియట్ ఉద్యోగుల నివాసాలు, ఇతర అవసరాల కోసం కనీసం మరో 120 ఎకరాల భూమి అవసరమవుతుంది. ఈ స్థాయిలో భూమి లభ్యత ఉందని నిర్ధారించిన తర్వాతే.. ఆ ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేయాలి. కేవలం రవాణా అనుసంధానం ఉందనో, రాష్ట్రం మధ్యలో ఉందనో రాజధానిగా ఎంపిక చేయకూడదు.
 ► రాజధాని ఏర్పాటుకు ఏ ప్రాంతం ఎక్కువ అనుకూలమనే విషయాన్ని నిర్ణయించలేం. అన్ని రకాల ప్రభుత్వ కార్యాలయాలను ఒకే ప్రాంతంలో ఏర్పాటు చేయాలనే యోచన మంచిది కాదు. సచివాలయం, అసెంబ్లీ, ఎమ్మెల్యే, మంత్రుల నివాసాలు, ఉద్యోగులకు గృహాలు ఒక చోట ఉండాలి. మిగతా కార్యాలయూలను వేర్వేరు చోట్ల వాటికి అనుకూలమైన ప్రాంతాల్లో ఏర్పాటు చేయొచ్చు. హైదరాబాద్‌లో 192 ప్రభుత్వ కార్యాలయాలున్నాయి. ఏపీలో వాటన్నింటినీ ఒకే ప్రాంతంలో ఏర్పాటు చేయడం అవసరమా? ఏపీలో 89 ప్రభుత్వరంగ సంస్థలున్నాయి. వాటిని ఎక్కడ ఏర్పాటు చేయాలనేది కూడా ముఖ్యమే. పశుగణాభివృద్ధి, భూగర్భ గనుల డెరైక్టరేట్లను ఒకే చోట ఏర్పాటు చేయడంలో ప్రత్యేక ప్రయోజనం ఏమీ ఉండదు. అదేవిధంగా పోర్టుల డెరైక్టరేట్ అనంతపురంలో ఏర్పాటు చేయడంలో అర్థం లేదు. రవాణా అనుసంధానం బాగా ఉన్న కొన్ని ప్రాంతాలను కమిటీ గుర్తించింది.
ఏపీలో అభివృద్ధికి అవకాశం ఉన్న 13, 14 ప్రాంతాలను కమిటీ గుర్తించింది. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే విశ్వవిద్యాలయాలు, ఇతర సంస్థల ఏర్పాటుకు అనువుగా ఉంటాయి. కనీసం మూడు, నాలుగు పట్టణాల విస్తరణకు అవకాశం వస్తుంది.
బాబు ఉద్యోగాలను సృష్టించలేడు. ఏటా 3 నుంచి 4 లక్షల ఉద్యోగాలు సృష్టించాలి. ఇన్ని ఉద్యోగాలను ప్రభుత్వం ఇవ్వలేదు. పారిశ్రామిక, సేవా రంగాలు అభివృద్ధి చెందితేనే ఉద్యోగాలు వస్తాయి.
రాజధాని కమిటీ అనే పేరు ఉండవచ్చు. కానీ మా బాధ్యత కేవలం రాజధానిని ఎంపిక చేయడమే కాదు. దానికి ప్రజా పనుల శాఖ (పీడబ్ల్యూడీ) కమిటీ సరిపోతుంది. రాష్ట్ర సమగ్రాభివృద్ధి గురించి నివేదిక ఇవ్వడం మా కమిటీ విధి.
కొత్త రాజధాని అన్ని ప్రాంతాల ప్రజల మనోభావాలను ప్రతిబింబించాలి.
ఏదో ఒక ప్రధాన నగరాన్ని ఆసరా చేసుకొని రాజధాని నిర్మాణం జరగాలి. ప్రపంచంలో ప్రఖ్యాత రాజధానుల నిర్మాణం నుంచి మనం పాఠాలు నేర్చుకోవాలి. నా దృష్టిలో భువనేశ్వర్ ఉత్తమ రాజధాని. రాజధాని అంటే భారీ భవంతులనే భావన వదిలేయాలి. విజయవాడకు మేం వ్యతిరేకం కాదు. రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సూపర్ రాజధాని నిర్మాణం పరిష్కారం కాదు. పెద్ద సంఖ్యలో జనం వస్తే సేవల విషయంలో ఇబ్బంది ఉంటుంది. సమగ్రాభివృద్ధి దిశగా ప్రణాళికలు ఉండాలి.
గుంటూరు-విజయవాడ చుట్టూ విస్తరించిన ప్రాంతం సారవంతమైన సాగు భూములతో నిండి ఉంది. ఆహార భద్రతనూ దృష్టిలో పెట్టుకోవాలి. ప్రజలు ఎక్కువ మంది వ్యవసాయం మీదే ఆధారపడి ఉన్నారు. వారి జీవనోపాధినీ పరిగణనలోనికి తీసుకోవాలి. ఎక్కువ మంది జీవనోపాధిని దెబ్బతీసే ప్రణాళికలు ఫలితాన్నివ్వలేవు. కేంద్రీకృత అభివృద్ధి బ్రిటిష్ ఆలోచనా ధోరణి. ఇప్పుడు వికేంద్రీకరణ అవసరం.
కమిటీ త్వరలో ప్రకాశం, నెల్లూరు, కడప, శ్రీకాకుళం జిల్లాల్లో కూడా పర్యటిస్తుంది.
సెప్టెంబర్ వరకు కమిటీకి గడువు ఉంది. కానీ ఆగస్టు మధ్యలో నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. ఏపీ కొత్త రాజధాని ఏర్పాటుకు ప్రత్యేక సహాయం అవసరమని కేంద్రానికి చెప్పనున్నాం.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement