దొనకొండే బంగారు కొండ! | Donakonda wanted the new capital of Andhra Pradesh | Sakshi
Sakshi News home page

దొనకొండే బంగారు కొండ!

Published Tue, Jul 22 2014 12:03 AM | Last Updated on Wed, Oct 17 2018 3:49 PM

దొనకొండే బంగారు కొండ! - Sakshi

దొనకొండే బంగారు కొండ!

ఇటు రాయలసీమ, అటు ఉత్తరాంధ్ర, మరోవైపున కోస్తాంధ్ర ప్రాంతాలకు మధ్యలో ఉన్న  ప్రకాశం జిల్లాలోని దొనకొండ ప్రాంతం... రాజధాని, సచివాలయం, శాసనసభ, హైకోర్టు, తదితర ప్రభుత్వ కార్యాలయాలను నిర్మించడానికి ఎంతో అనువుగా ఉంటుంది.
 
పదమూడు జిల్లాలతో కూడిన ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని విషయమై ఇటు ప్రభుత్వం నుంచి, అటు శివరామకృష్ణన్ కమిటీ నుంచి ఇంతవరకు నిర్దిష్ట ప్రతిపాదనలు ఏవీ స్పష్టం కాలేదు. దీంతో నూతన రాజధానిని ఎక్కడ నిర్మిం చబోతున్నారు? అనే విషయంపై అన్ని ప్రాంతాల ప్రజల అంచనాలు పెరిగి పోతున్నాయి. ఇప్పటికే కర్నూలు, తిరుపతి, నెల్లూరు, గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం వంటి పట్టణాలు రాజధాని విషయంలో పోటీ పడుతున్నాయి. అయితే జనాభా కిక్కిరిసి ఉన్న నగరప్రాంతాల్లో రాజ ధాని నిర్మాణానికి తగిన భూమి, ఇతర వనరులు లభించే అవకాశం లేదు.

రాజధానిని తమ ప్రాంతంలోనే ఏర్పర్చనున్నారనే పుకార్ల మధ్య ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ప్రాంతాల్లోనూ భూముల విలువ కొండెక్కి కూర్చుంది. ప్రైవేట్ భూములను భారీ విలువ పెట్టి కొని రాజధానిని నిర్మించడం ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా సాధ్యపడదు. ఈ నేపథ్యంలో పైసా ఖర్చు పెట్టనవసరం లేకుండా ప్రభుత్వ భూముల్లోనే కొత్త రాజధానిని నిర్మించుకునే అవకాశాన్ని ప్రకాశం జిల్లా దొనకొండ ప్రాంతం కల్పిస్తోంది. రాష్ట్రంలోని పదమూడు జిల్లాల్లో విస్తారంగా ప్రభుత్వ భూములు, అటవీ భూములు ఉన్న ప్రకాశం జిల్లా దొనకొండ ప్రాంతంలో కొత్త రాజధానిని ఏర్పాటు చేయవచ్చని తొలినుంచి ప్రచారం జరుగుతూ వచ్చింది.

రాష్ట్రానికి ప్రజలకు అభివృద్ధి, ఉపాధి కల్పనా కేంద్రం రాజధాని. పాల నాపరంగా, అభివృద్ధి పరంగా రాజధానికి అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది. అందుకే కనీసం వంద సంవత్సరాల వరకు ఇబ్బంది లేని రాజధాని నిర్మాణం చేయాలని రాష్ట్రప్రభుత్వం భావిస్తోంది. ఈ సందర్భంలో ఇరుకైన ప్రదేశా లలో రాజధానిని నిర్మించడం ఇబ్బందికరం. మరోవైపున రాజధాని కోసం ప్రైవేట్ భూములను కోట్ల రూపాయలు వెచ్చించి కొనడం ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో ఆచరణీయం కాదు. అందుకే అత్యంత అనుకూలమైన పరిస్థితు లున్న  దొనకొండ ప్రాంతాన్ని రాజధానిగా ఏర్పాటు చేస్తే బాగుంటుందని ప్రకాశం జిల్లావాసుల అభిప్రాయం.

దొనకొండ ప్రత్యేకత ఏమిటీ?

ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతమైన దొనకొండ, కొనకన మిట్ల, పొదిలి, మార్కాపురం, త్రిపురాంతకం, పెద్దారవీడు, యర్రగొండపాలెం, కంభం, గిద్దలూరు, కనిగిరి, వెలిగండ్ల, హనుమంతుని పాడు మండలాల పరిధిలో కొన్ని వేల ఎకరాల ప్రభుత్వ భూములు, మరికొన్ని వేల ఎకరాల అటవీ భూ ములు ఉన్నాయి. రాజధాని నిర్మాణానికి సరిపోగా మిగిలిన భూమి నుండి ప్రభుత్వానికి ఆదాయం రావడమే కాకుండా అనేక అనుబంధ అవసరాలు కూడా నెరవేరే అవకాశముంది. ఉదాహరణకు మార్కాపురం డివిజన్‌లో ఉన్న 56 వేల ఎకరాల భూమిలో 20 వేల ఎకరాలను రాజధానికి ఉపయోగించు కోవచ్చు. మిగతా 30 వేల ఎకరాల భూమిని ప్రభుత్వ అవసరాలకు రహదా రులు, భవనాలు, పార్కులు, హాస్పిటల్స్, ఆర్.టి.సి వంటి సంస్థలకు కూడా ఉపయోగించవచ్చు. ఇక్కడ లభించే భూమిలో 70 శాతాన్ని ప్రభుత్వ అవస రాలకు ఉపయోగిస్తే మిగిలిన 30 శాతం భూమిని ప్రైవేట్ అవసరాలకు ఉప యోగించవచ్చు. ప్రైవేట్ భూములను కోట్ల రూపాయలు వెచ్చించి కొను గోలు చేయన వసరం లేకుండా మార్కాపురంలోని ప్రభుత్వ భూములను ఎలాంటి వివాదాలు లేకుండానే రాజధాని కోసం తీసుకోవచ్చు.

పైగా, భౌగోళికంగా చిత్తూరు నుండి శ్రీకాకుళం వరకు మధ్యస్థ ప్రాం తంలో ప్రకాశం జిల్లా ఉంది. ఇటు రాయలసీమ, అటు ఉత్తరాంధ్ర, మరోవై పున కోస్తాంధ్ర ప్రాంతాలకు సమాన దూరంలో ఉన్న  ప్రకాశం జిల్లాలో రాజ ధాని, సచివాలయం, శాసనసభ, హైకోర్టు, తదితర ప్రభుత్వ కార్యాలయా లను నిర్మించడానికి ఎంతో అనువుగా ఉంటుంది. పైన ప్రస్తావించిన అన్ని  మండలాల్లోనూ దొనకొండకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. రాష్ట్ర రాజధానికి అవసరమైన నీరు, రవాణా సౌకర్యాలు వంటి అంశాలలో దొనకొండే మిగతా ప్రాంతాల కంటే ముందంజలో ఉంది. రైలు, రోడ్డు, గగనతలం మూడు రంగాల్లో అభివృద్ధికి దొనకొండ అనుకూలంగా ఉంటోంది.

నీరు: ప్రతిరోజూ లక్షలాది లీటర్ల నీరు అవసరమయ్యే రాజధానికి దొనకొండ అత్యంత అనుకూలమైన ప్రాంతం. ఇక్కడికి పది కి.మీ దూరంలో నాగార్జున సాగర్ కుడి కాలువ ఉంది. 30 కి.మీ దూరంలో వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణంలో ఉంది. 80 కి.మీ దూరంలో శ్రీశైలం డ్యాం ఉంది. 100 కి.మీ దూరంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఉంది. పైగా పురాతనమైన కంభం చెరువు ఇక్కడికి 70 కి.మీ దూరంలో ఉంది. కాబట్టి, రాజధానిని ఇక్కడే నిర్మిస్తే నీటి సమస్య ఏ మాత్రం ఉండదు.

రోడ్డు మార్గం: ఒంగోలు నుండి నంద్యాలకు ఉన్న హైవే దూరం కేవలం 40 కి.మీ. అలాగే మార్కాపురం నుండి కడప వెళ్లే జాతీయ రహదారి దూరం 25 కి.మీ మాత్రమే. రాజధానిని ఇక్కడే నిర్మిస్తే ఇక్కడినుంచి రాష్ట్రవ్యాప్తంగా రహదారుల అనుసంధానం చాలా సులభం.
 రైల్వే: దొనకొండలో గతంలో రైల్వేలోకో షెడ్ ఉండేది. ప్రస్తుతం విజయవాడ నుంచి అనంతపురం వరకు రైల్వే లైన్ ఉంది. ఇక్కడికి 80 కి.మీ దూరంలో ఒంగోలు ఉంది. ఇక్కడినుండి కోల్‌కతా-చెన్నై రైల్వే లైన్ ఉంది. దొనకొండ మార్గంలో శ్రీకాళహస్తి-నడికుడి రైల్వే లైను సర్వే గతంలోనే పూర్తయ్యింది.

విమానాశ్రయం: దొనకొండలో బ్రిటిష్ వారి హయాంలో 135 ఎకరాలలో నిర్మించిన విమానాశ్రయం ఉంది. అప్పట్లో విమానాల్లో పెట్రోలు నింపడా నికి బ్రిటిష్ వారు దీన్ని ఉపయోగించేవారు. నేటికీ ఈ విమానాశ్రయం అలాగే ఉంది. కాగా, ఒంగోలు దగ్గర బీరంగుంట ప్రాంతంలో విమానాశ్ర యానికి గతంలోనే స్థల పరిశీలన జరిగింది.

పంటలు: జిల్లాలో పొగాకు, మిర్చి పంటలు విస్తారంగా పండుతాయి. అలాగే మత్స్య, పాడి పరిశ్రమలతోపాటు ప్రపంచ ప్రఖ్యాతి చెందిన గ్రానైట్, క్వార్జ్, పలకల పరిశ్రమ ఇక్కడే ఉన్నాయి. ప్రపంచమంతటా గుర్తింపు పొందిన ఒంగోలు గిత్త ప్రకాశం జిల్లాదే.
 వివాద రహితం... ఖర్చు తక్కువ

ఇన్ని అనుకూలతలకు తోడుగా, కేంద్రప్రభుత్వం విభజన బిల్లులో రాజధానికోసం భూ సేకరణపై గతంలోనే స్పష్టతనిచ్చింది. రాజధానికోసం ఒక్క ఎకరా భూమిని కూడా కొనుగోలు చేయబోమని, అవసరమైతే అటవీ భూములను డీ - నోటిఫై చేసి భూములను తీసుకుంటామని మునుపటి కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. పైగా అభివృద్ధి చెందిన ప్రదేశాలలో రాజధానిని ఏర్పరిస్తే వెనుకబడిన జిల్లాలు మరింత వెనుకబడే ప్రమాదం ఉంది. వెనుకబడిన ప్రాంతంలో రాజధాని నిర్మాణం జరిగితే ఆ ప్రాంతం, ప్రజలు అభివృద్ధిలోకి పయనిస్తారు. పైగా మౌలిక వసతులు కూడా గణనీయంగా మెరుగుపడతాయి.

రాష్ట్రంలో రాజధాని ఏర్పాటు సరైన ప్రాంతంలో జరిగితే మరో వేర్పాటు ఉద్యమం జరిగే అవకాశం ఉండదు. విభజన అనంతరం మళ్లీ కర్నూలును రాజధాని చేయాలని డిమాండ్ చేస్తున్న రాయలసీమ వాసులు కూడా ప్రకాశం జిల్లాలో రాజధాని ఏర్పాటుకు అభ్యంతరం వ్యక్తం చేయడం లేదు. రాజధాని ప్రకాశం జిల్లాలో పెడితే అందరికీ సముచితంగా ఉంటుందన్న వాదనతో సీమవాసులు ఏకీభవించే అవకాశం కనబడుతోంది.

ఈ లక్ష్యం తోటే గత సంవత్సరం ఆగస్టున ప్రకాశం జిల్లాలో రాజధాని సాధన సమితిని స్థాపించాము. రాష్ట్ర రాజధానిని ప్రకాశం జిల్లాలోనే ఏర్పాటు చేయాలని, ఆ విధంగానే జిల్లా అభివృద్ధి పథంలో పయనిస్తుందని భావిస్తూ ప్రచారం చేస్తున్నాము. వెనుకబడిన ప్రకాశం జిల్లా అభివృద్ధిలో పయనించా లంటే రాజధాని నిర్మాణం ఒక సువర్ణావకాశం. రాజధాని సాధన సమితి వాదం అభివృద్ధి వాదమే తప్ప మరొకటి కాదు. ఎలాంటి వ్యక్తిగత ప్రయోజ నాలు, రాజకీయ పార్టీలకు తావు లేకుండా జిల్లా అభివృద్ధి లక్ష్యంగా రాజ ధాని సాధన సమితి కృషి చేస్తోంది. మేధావులు, రాజకీయ నాయకులు, అధి కారులు, అనధికారులు, పారిశ్రామికవేత్తలు, లాయర్లు, డాక్టర్లు, విద్యా ర్థులు... సహా వివిధ వర్గాల ప్రజలు ఇక్కడే రాజధాని నిర్మాణం కోసం తమ వంతు బాధ్యతగా ప్రయత్నాలు చేపట్టాలి. ఒక్క ఎకరా భూమి కూడా కొను గోలు చేయనవసరం లేకుండా విస్తారంగా ప్రభుత్వ భూమి లభ్యమవుతున్న ప్రకాశం జిల్లాలోనే రాజధానిని నిర్మించడం సముచితం కూడా.

(వ్యాసకర్త ‘రాజధాని సాధన సమితి’ వ్యవస్థాపక అధ్యక్షులు)  వినుకొండ రాజారావు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement