Vinukonda Raja Rao
-
ఉద్యోగులపై ఇన్ని కుట్రలా..?
సాక్షి, ఒంగోలు సబర్బన్: ‘ప్రభుత్వ ఉద్యోగులు నాలుగేళ్లుగా న్యాయమైన డిమాండ్ల సాధన కోసం పోరాడుతూనే ఉన్నారు. కారుణ్య నియామక ఉద్యోగాలు పూర్తిస్థాయిలో భర్తీచేసిన దాఖలాలు లేవు. ఇతర ఖాళీలు కూడా భర్తీ చేయకపోవడంతో ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులపై పని ఒత్తిడి పెరుగుతోంది. దానికితోడు ప్రభుత్వ ఉద్యోగులతో బలవంతంగా 50 సంవత్సరాలకే పదవీ విరమణ చేయించాలని చూస్తున్నారు. దానికి సంబంధించిన జీవోను కూడా ప్రభుత్వం దొంగచాటుగా రూపొందించింది. కొందరు ఉద్యోగ సంఘాల నాయకులు ఆ జీవోను బయటపెట్టి వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం నివ్వెరబోయింది. జీవో బయటపెట్టారన్న నెపంతో ఇద్దరు అధికారులను సస్పెండ్ కూడా చేసింది. వీటిపై పోరాటాలు జరగకుండా ఉద్యోగ సంఘాల రాష్ట్ర నాయకులను చెప్పుచేతల్లో పెట్టుకుని చివరకు మా హక్కులను కూడా ప్రభుత్వం కాలరాసింది. గడిచిన ఐదేళ్లుగా ఇలాంటి కుట్రలు అనేకం జరిగాయి.. ఇంకా జరుగుతూనే ఉన్నాయి’... అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ జిల్లా అధ్యక్షుడు వినుకొండ రాజారావు ఆవేదన వ్యక్తం చేశారు. ‘సాక్షి’ నిర్వహించిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రభుత్వ విధానాల వలన ఉద్యోగులు పడుతున్న ఇబ్బందులను ఆయన వివరించారు. రాజారావు ఇంటర్వ్యూ విశేషాలు ఈ విధంగా ఉన్నాయి... సాక్షి : చంద్రబాబు పాలనలో ఉద్యోగుల పరిస్థితి ఎలా ఉంది..? రాజారావు : సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ ఉద్యోగులు చేయని పోరాటం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిమీద ఒకరు చెప్పుకుంటూ ఓపీఎస్‌ను రద్దు చేయడం ఉద్యోగులను తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. సీపీఎస్‌ను ప్రవేశపెట్టి ఉద్యోగులకు పెన్షన్ విధానానికి స్వస్తిపలికే పద్ధతి అత్యంత దారుణం. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఐదేళ్లు ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తి జీవితాంతం పెన్షన్ తీసుకుంటుంటే.. 35 సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగం చేసిన వారికి పెన్షన్ లేదంటే ఏమనాలి. అందుకే సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను పునరుద్ధరించాలని ప్రకాశం భవన్ ముందు నెలల తరబడి ఆందోళనలు చేశాం. ఒక్క మాటలో చెప్పాలంటే న్యాయమైన డిమాండ్ల సాధన కోసం రోడ్డెక్కని ప్రభుత్వ విభాగమంటూ లేదు. సాక్షి : ఉద్యోగులకు హెల్త్‌కార్డుల వల్ల ప్రయోజనం ఉంటుందా..? రాజారావు : హెల్త్ కార్డులు పూర్తిగా ఉపయోగంలోకి రాలేదు. కేడర్‌ను బట్టి స్లాబుల వారీగా నెలనెలా రూ.90 నుంచి రూ.120 వరకు ప్రభుత్వం వసూలు చేస్తోంది. కానీ, కార్పొరేట్ వైద్యశాలల్లో అవి పనిచేయడం లేదు. ఏదైనా అనారోగ్యం వస్తే సొంత డబ్బుతో వైద్యం చేయించుకుంటున్నాం. పరోక్ష పద్ధతిలో మంత్రి అయిన వ్యక్తి పంటి ఆపరేషన్ కోసం ప్రభుత్వ ఖర్చులతో విదేశీ వైద్యం చేయించుకున్నాడు. జీవితాంతం ప్రజలకు, ప్రభుత్వానికి సేవచేసే ప్రభుత్వ ఉద్యోగి మాత్రం సొంత డబ్బుతో వైద్యం చేయించుకోవాల్సి వస్తోంది. అది కూడా నెలనెలా హెల్త్ కార్డుకు డబ్బులు కడుతూనే. ఇదెక్కడి న్యాయం..? మేము కట్టే డబ్బులు ఎక్కడ..? సాక్షి : ప్రతి ప్రభుత్వ విభాగంలో ఖాళీలు ఉన్నాయి. ఇప్పటి వరకూ ఎన్ని ఖాళీలు పూర్తి చేశారు..? రాజారావు : కారుణ్య నియామకాలు తప్ప ఈ నాలుగున్నర సంవత్సరాలలో అడపాదడపా కొన్ని ఖాళీలను భర్తీ చేశారు. రాష్ట్రంలో దాదాపు 2 లక్షలకు పైగా వివిధ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. వాటిని భర్తీ చేయకపోవడంతో ప్రస్తుతం పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు పని ఒత్తిడికి గురవుతున్నారు. వారిపై పనిభారం రెట్టింపయింది. తీవ్ర ఒత్తిడి మధ్య విధులు నిర్వర్తిస్తున్నారు. సాక్షి : ఒక్క ఉద్యోగి కూడా డిమాండ్ల సాధనకు రోడ్డెక్కలేదని ఒక సంఘ నేత చెప్పారు. అది ఎంత వరకు వాస్తవం..? రాజారావు : అది పూర్తిగా అవాస్తవం. జనవరి 31, 2019న విజయవాడ కేంద్రంగా సీపీఎస్ ఉద్యోగులు రాష్ట్రవ్యాప్తంగా బంధ్ చేశారు. వారికి మద్దతుగా మా రాష్ట్ర అధ్యక్షుడు కె.ఆర్.సూర్యనారాయణ కూడా బంధ్‌లో పాల్గొన్నారు. గవర్నర్‌పేట పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి మళ్లీ వదిలిపెట్టారు. ఆయనతో పాటు అరెస్టయిన ఉద్యోగులను వదిలిపెట్టేంత వరకు స్టేషన్ నుంచి సూర్యనారాయణ బయటకు రాలేదు. మన జిల్లాలో కూడా నెలల తరబడి ఉద్యోగులు ఆందోళనలు చేశారు. ప్రభుత్వానికి భజన చేసే కొందరు ఉద్యోగ సంఘ నేతలు వాస్తవాలను వక్రీకరిస్తున్నారు. వారి స్వార్థం కోసం ఉద్యోగుల హక్కులను కాలరాయడం మంచి పద్ధతి కాదు. సాక్షి : ఉద్యోగుల సొంతింటి కల నెరవేరిందా..? రాజారావు : జిల్లాలో ఏ ఒక్క ఉద్యోగికీ సొంతింటి కల నెరవేరలేదు. సెంటు భూమిగానీ, సొంత ఇల్లుగానీ ఇచ్చిన దాఖలాలు లేవు. ఇది వాస్తవం. ఒక సంఘ నాయకుడు మాత్రం తన సొంతింటి కల నెరవేరిందని చెప్పడం ఉద్యోగులను మోసం చేయడమే. సాక్షి : మధ్యంతర భృతి (ఐఆర్) 20 శాతం ఇవ్వడంపై ఉద్యోగులు సంతృప్తిగా ఉన్నారా..? రాజారావు : 2009లో 22 శాతం, 2014లో 27 శాతం ఐఆర్ ఇచ్చారు. అప్పుడు ఏ సంఘ నాయకుడూ ప్రభుత్వంలో ఉన్న వారికి సన్మానాలు చేయలేదు. ఇది ఉద్యోగుల హక్కేగానీ, భిక్ష కాదు. అయితే, ప్రస్తుతం 20 శాతం ఇస్తే గొప్పగా ఇచ్చారని భావిస్తున్నారు. కొన్ని భజన సంఘాల నాయకులు ప్రభుత్వానికి బాకా ఊదుతూ అధికారాన్ని అడ్డంపెట్టుకుని ఉద్యోగుల హక్కులను కాలరాస్తున్నారు. వాటి కోసం పోరాడుతున్న వారి గొంతు నొక్కుతున్నారు. ఇది హేయమైన చర్య. సాక్షి : ప్రస్తుత ఎన్నికల్లో ఓటర్లలో చైతన్యానికి, ఓటింగ్ శాతం పెంచడానికి ఉద్యోగులు చేస్తున్న ప్రయత్నాలేంటి..? రాజారావు : ఓటు వేయడం అనేది సామాజిక బాధ్యత. ఈ నినాదంపై ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అనేక చైతన్య కార్యక్రమాలు చేపట్టింది. 2014 సాధారణ ఎన్నికల సంధర్భంగా జిల్లాలో 83.4 శాతం ఓటింగ్ నమోదు కావడానికి ఉద్యోగులే కారణం. కొన్ని పోలింగ్ కేంద్రాలలో కనీస వసతులు కరువైనా మహిళా ఉద్యోగులు ఇబ్బందులకు లోనవుతూ కూడా రాష్ట్రంలోనే ప్రథమంగా జిల్లాని నిలిపారు. అందువలనే గత కలెక్టర్ విజయకుమార్‌కు రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా అవార్డు దక్కింది. ప్రస్తుత ఎన్నికల్లో మునుపటి శాతం కంటే ఎక్కువగా పోలింగ్ నమోదు చేయించి రీ పోలింగ్ జరగని జిల్లాగా చేయడానికి కలెక్టర్ వినయ్‌చంద్‌కు అందరం సహకరిస్తున్నాం. సాక్షి : 50 సంవత్సరాలకే పదవీ విరమణ జీఓ ఏమైంది..? రాజారావు : రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రభుత్వ ఉద్యోగులతో బలవంతంగా 50 సంవత్సరాలకే పదవీ విరమణ చేయించాలని జీఓను రూపొందించింది. దానిని గుట్టుచప్పుడు కాకుండా అమలులోకి తీసుకురావాలని చూసింది. కానీ, కొంతమంది ఉద్యోగ సంఘ నాయకులు దానిని పసిగట్టి ఆందోళనలు చేపట్టారు. దీంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. చివరకు ఆ జీఓను రద్దు చేసుకుంది. అలాంటి జీవోలు అమలు చేస్తే ఉద్యోగుల జీవితాల్లో నిప్పులు పోసినట్లే. జీవోను బయట పెట్టారన్న నెపంతో ఇద్దరు అధికారులను సస్పెండ్ చేశారు. ఈ విధంగా ఉద్యోగుల హక్కులను కాలరాస్తున్నారు. -
దొనకొండే బంగారు కొండ!
ఇటు రాయలసీమ, అటు ఉత్తరాంధ్ర, మరోవైపున కోస్తాంధ్ర ప్రాంతాలకు మధ్యలో ఉన్న ప్రకాశం జిల్లాలోని దొనకొండ ప్రాంతం... రాజధాని, సచివాలయం, శాసనసభ, హైకోర్టు, తదితర ప్రభుత్వ కార్యాలయాలను నిర్మించడానికి ఎంతో అనువుగా ఉంటుంది. పదమూడు జిల్లాలతో కూడిన ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని విషయమై ఇటు ప్రభుత్వం నుంచి, అటు శివరామకృష్ణన్ కమిటీ నుంచి ఇంతవరకు నిర్దిష్ట ప్రతిపాదనలు ఏవీ స్పష్టం కాలేదు. దీంతో నూతన రాజధానిని ఎక్కడ నిర్మిం చబోతున్నారు? అనే విషయంపై అన్ని ప్రాంతాల ప్రజల అంచనాలు పెరిగి పోతున్నాయి. ఇప్పటికే కర్నూలు, తిరుపతి, నెల్లూరు, గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం వంటి పట్టణాలు రాజధాని విషయంలో పోటీ పడుతున్నాయి. అయితే జనాభా కిక్కిరిసి ఉన్న నగరప్రాంతాల్లో రాజ ధాని నిర్మాణానికి తగిన భూమి, ఇతర వనరులు లభించే అవకాశం లేదు. రాజధానిని తమ ప్రాంతంలోనే ఏర్పర్చనున్నారనే పుకార్ల మధ్య ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ప్రాంతాల్లోనూ భూముల విలువ కొండెక్కి కూర్చుంది. ప్రైవేట్ భూములను భారీ విలువ పెట్టి కొని రాజధానిని నిర్మించడం ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా సాధ్యపడదు. ఈ నేపథ్యంలో పైసా ఖర్చు పెట్టనవసరం లేకుండా ప్రభుత్వ భూముల్లోనే కొత్త రాజధానిని నిర్మించుకునే అవకాశాన్ని ప్రకాశం జిల్లా దొనకొండ ప్రాంతం కల్పిస్తోంది. రాష్ట్రంలోని పదమూడు జిల్లాల్లో విస్తారంగా ప్రభుత్వ భూములు, అటవీ భూములు ఉన్న ప్రకాశం జిల్లా దొనకొండ ప్రాంతంలో కొత్త రాజధానిని ఏర్పాటు చేయవచ్చని తొలినుంచి ప్రచారం జరుగుతూ వచ్చింది. రాష్ట్రానికి ప్రజలకు అభివృద్ధి, ఉపాధి కల్పనా కేంద్రం రాజధాని. పాల నాపరంగా, అభివృద్ధి పరంగా రాజధానికి అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది. అందుకే కనీసం వంద సంవత్సరాల వరకు ఇబ్బంది లేని రాజధాని నిర్మాణం చేయాలని రాష్ట్రప్రభుత్వం భావిస్తోంది. ఈ సందర్భంలో ఇరుకైన ప్రదేశా లలో రాజధానిని నిర్మించడం ఇబ్బందికరం. మరోవైపున రాజధాని కోసం ప్రైవేట్ భూములను కోట్ల రూపాయలు వెచ్చించి కొనడం ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో ఆచరణీయం కాదు. అందుకే అత్యంత అనుకూలమైన పరిస్థితు లున్న దొనకొండ ప్రాంతాన్ని రాజధానిగా ఏర్పాటు చేస్తే బాగుంటుందని ప్రకాశం జిల్లావాసుల అభిప్రాయం. దొనకొండ ప్రత్యేకత ఏమిటీ? ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతమైన దొనకొండ, కొనకన మిట్ల, పొదిలి, మార్కాపురం, త్రిపురాంతకం, పెద్దారవీడు, యర్రగొండపాలెం, కంభం, గిద్దలూరు, కనిగిరి, వెలిగండ్ల, హనుమంతుని పాడు మండలాల పరిధిలో కొన్ని వేల ఎకరాల ప్రభుత్వ భూములు, మరికొన్ని వేల ఎకరాల అటవీ భూ ములు ఉన్నాయి. రాజధాని నిర్మాణానికి సరిపోగా మిగిలిన భూమి నుండి ప్రభుత్వానికి ఆదాయం రావడమే కాకుండా అనేక అనుబంధ అవసరాలు కూడా నెరవేరే అవకాశముంది. ఉదాహరణకు మార్కాపురం డివిజన్లో ఉన్న 56 వేల ఎకరాల భూమిలో 20 వేల ఎకరాలను రాజధానికి ఉపయోగించు కోవచ్చు. మిగతా 30 వేల ఎకరాల భూమిని ప్రభుత్వ అవసరాలకు రహదా రులు, భవనాలు, పార్కులు, హాస్పిటల్స్, ఆర్.టి.సి వంటి సంస్థలకు కూడా ఉపయోగించవచ్చు. ఇక్కడ లభించే భూమిలో 70 శాతాన్ని ప్రభుత్వ అవస రాలకు ఉపయోగిస్తే మిగిలిన 30 శాతం భూమిని ప్రైవేట్ అవసరాలకు ఉప యోగించవచ్చు. ప్రైవేట్ భూములను కోట్ల రూపాయలు వెచ్చించి కొను గోలు చేయన వసరం లేకుండా మార్కాపురంలోని ప్రభుత్వ భూములను ఎలాంటి వివాదాలు లేకుండానే రాజధాని కోసం తీసుకోవచ్చు. పైగా, భౌగోళికంగా చిత్తూరు నుండి శ్రీకాకుళం వరకు మధ్యస్థ ప్రాం తంలో ప్రకాశం జిల్లా ఉంది. ఇటు రాయలసీమ, అటు ఉత్తరాంధ్ర, మరోవై పున కోస్తాంధ్ర ప్రాంతాలకు సమాన దూరంలో ఉన్న ప్రకాశం జిల్లాలో రాజ ధాని, సచివాలయం, శాసనసభ, హైకోర్టు, తదితర ప్రభుత్వ కార్యాలయా లను నిర్మించడానికి ఎంతో అనువుగా ఉంటుంది. పైన ప్రస్తావించిన అన్ని మండలాల్లోనూ దొనకొండకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. రాష్ట్ర రాజధానికి అవసరమైన నీరు, రవాణా సౌకర్యాలు వంటి అంశాలలో దొనకొండే మిగతా ప్రాంతాల కంటే ముందంజలో ఉంది. రైలు, రోడ్డు, గగనతలం మూడు రంగాల్లో అభివృద్ధికి దొనకొండ అనుకూలంగా ఉంటోంది. నీరు: ప్రతిరోజూ లక్షలాది లీటర్ల నీరు అవసరమయ్యే రాజధానికి దొనకొండ అత్యంత అనుకూలమైన ప్రాంతం. ఇక్కడికి పది కి.మీ దూరంలో నాగార్జున సాగర్ కుడి కాలువ ఉంది. 30 కి.మీ దూరంలో వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణంలో ఉంది. 80 కి.మీ దూరంలో శ్రీశైలం డ్యాం ఉంది. 100 కి.మీ దూరంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఉంది. పైగా పురాతనమైన కంభం చెరువు ఇక్కడికి 70 కి.మీ దూరంలో ఉంది. కాబట్టి, రాజధానిని ఇక్కడే నిర్మిస్తే నీటి సమస్య ఏ మాత్రం ఉండదు. రోడ్డు మార్గం: ఒంగోలు నుండి నంద్యాలకు ఉన్న హైవే దూరం కేవలం 40 కి.మీ. అలాగే మార్కాపురం నుండి కడప వెళ్లే జాతీయ రహదారి దూరం 25 కి.మీ మాత్రమే. రాజధానిని ఇక్కడే నిర్మిస్తే ఇక్కడినుంచి రాష్ట్రవ్యాప్తంగా రహదారుల అనుసంధానం చాలా సులభం. రైల్వే: దొనకొండలో గతంలో రైల్వేలోకో షెడ్ ఉండేది. ప్రస్తుతం విజయవాడ నుంచి అనంతపురం వరకు రైల్వే లైన్ ఉంది. ఇక్కడికి 80 కి.మీ దూరంలో ఒంగోలు ఉంది. ఇక్కడినుండి కోల్‌కతా-చెన్నై రైల్వే లైన్ ఉంది. దొనకొండ మార్గంలో శ్రీకాళహస్తి-నడికుడి రైల్వే లైను సర్వే గతంలోనే పూర్తయ్యింది. విమానాశ్రయం: దొనకొండలో బ్రిటిష్ వారి హయాంలో 135 ఎకరాలలో నిర్మించిన విమానాశ్రయం ఉంది. అప్పట్లో విమానాల్లో పెట్రోలు నింపడా నికి బ్రిటిష్ వారు దీన్ని ఉపయోగించేవారు. నేటికీ ఈ విమానాశ్రయం అలాగే ఉంది. కాగా, ఒంగోలు దగ్గర బీరంగుంట ప్రాంతంలో విమానాశ్ర యానికి గతంలోనే స్థల పరిశీలన జరిగింది. పంటలు: జిల్లాలో పొగాకు, మిర్చి పంటలు విస్తారంగా పండుతాయి. అలాగే మత్స్య, పాడి పరిశ్రమలతోపాటు ప్రపంచ ప్రఖ్యాతి చెందిన గ్రానైట్, క్వార్జ్, పలకల పరిశ్రమ ఇక్కడే ఉన్నాయి. ప్రపంచమంతటా గుర్తింపు పొందిన ఒంగోలు గిత్త ప్రకాశం జిల్లాదే. వివాద రహితం... ఖర్చు తక్కువ ఇన్ని అనుకూలతలకు తోడుగా, కేంద్రప్రభుత్వం విభజన బిల్లులో రాజధానికోసం భూ సేకరణపై గతంలోనే స్పష్టతనిచ్చింది. రాజధానికోసం ఒక్క ఎకరా భూమిని కూడా కొనుగోలు చేయబోమని, అవసరమైతే అటవీ భూములను డీ - నోటిఫై చేసి భూములను తీసుకుంటామని మునుపటి కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. పైగా అభివృద్ధి చెందిన ప్రదేశాలలో రాజధానిని ఏర్పరిస్తే వెనుకబడిన జిల్లాలు మరింత వెనుకబడే ప్రమాదం ఉంది. వెనుకబడిన ప్రాంతంలో రాజధాని నిర్మాణం జరిగితే ఆ ప్రాంతం, ప్రజలు అభివృద్ధిలోకి పయనిస్తారు. పైగా మౌలిక వసతులు కూడా గణనీయంగా మెరుగుపడతాయి. రాష్ట్రంలో రాజధాని ఏర్పాటు సరైన ప్రాంతంలో జరిగితే మరో వేర్పాటు ఉద్యమం జరిగే అవకాశం ఉండదు. విభజన అనంతరం మళ్లీ కర్నూలును రాజధాని చేయాలని డిమాండ్ చేస్తున్న రాయలసీమ వాసులు కూడా ప్రకాశం జిల్లాలో రాజధాని ఏర్పాటుకు అభ్యంతరం వ్యక్తం చేయడం లేదు. రాజధాని ప్రకాశం జిల్లాలో పెడితే అందరికీ సముచితంగా ఉంటుందన్న వాదనతో సీమవాసులు ఏకీభవించే అవకాశం కనబడుతోంది. ఈ లక్ష్యం తోటే గత సంవత్సరం ఆగస్టున ప్రకాశం జిల్లాలో రాజధాని సాధన సమితిని స్థాపించాము. రాష్ట్ర రాజధానిని ప్రకాశం జిల్లాలోనే ఏర్పాటు చేయాలని, ఆ విధంగానే జిల్లా అభివృద్ధి పథంలో పయనిస్తుందని భావిస్తూ ప్రచారం చేస్తున్నాము. వెనుకబడిన ప్రకాశం జిల్లా అభివృద్ధిలో పయనించా లంటే రాజధాని నిర్మాణం ఒక సువర్ణావకాశం. రాజధాని సాధన సమితి వాదం అభివృద్ధి వాదమే తప్ప మరొకటి కాదు. ఎలాంటి వ్యక్తిగత ప్రయోజ నాలు, రాజకీయ పార్టీలకు తావు లేకుండా జిల్లా అభివృద్ధి లక్ష్యంగా రాజ ధాని సాధన సమితి కృషి చేస్తోంది. మేధావులు, రాజకీయ నాయకులు, అధి కారులు, అనధికారులు, పారిశ్రామికవేత్తలు, లాయర్లు, డాక్టర్లు, విద్యా ర్థులు... సహా వివిధ వర్గాల ప్రజలు ఇక్కడే రాజధాని నిర్మాణం కోసం తమ వంతు బాధ్యతగా ప్రయత్నాలు చేపట్టాలి. ఒక్క ఎకరా భూమి కూడా కొను గోలు చేయనవసరం లేకుండా విస్తారంగా ప్రభుత్వ భూమి లభ్యమవుతున్న ప్రకాశం జిల్లాలోనే రాజధానిని నిర్మించడం సముచితం కూడా. (వ్యాసకర్త ‘రాజధాని సాధన సమితి’ వ్యవస్థాపక అధ్యక్షులు) వినుకొండ రాజారావు -
ఒంగోలు అయితే ఒకే!
నూతన ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏర్పాటుపై సందిగ్దత కొనసాగుతోంది. రాజధానికి నిర్మాణానికి అనువైన స్థలం గుర్తించేందుకు ఏర్పాటైన నిపుణుల కమిటీ ఇంకా ఏ నిర్ణయం ప్రకటించలేదు. అటు ఏపీ ప్రభుత్వం కూడా రాజధానిపై స్పష్టమైన ప్రకటన చేయలేదు. విజయవాడ-గుంటూరులో నూతన రాజధాని ఆవిష్కృతమవుతుందని ప్రచారం చేస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారులు భూముల ధరలు రోజురోజుకీ పెంచేస్తున్నారు. మరోవైపు తమ ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేయాలని రాయలసీమ నాయకులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మళ్లీ ఒంగోలు పేరు ముందుకు వచ్చింది. సీమ నాయకులు కూడా ఒంగోలులో రాజధాని ఏర్పాటుకు అభ్యంతరం వ్యక్తం చేయకపోవడం దీనికి సానుకూల అంశంగా మారింది. అటు ప్రకాశం జిల్లా మేధావుల వేదిక కూడా తమ ప్రాంతంలోనే రాజధాని నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా రాజధాని నిర్మాణం కోరుతూ తీర్మానాలు ఆమోదించాలని జిల్లా పరిషత్ చైర్మన్ తో పాటు మండలాధ్యక్షులు, సర్పంచ్ లకు విజ్ఞప్తి చేసింది. తీర్మానాలను శివరామకృష్ణన్ కమిటీకి పంపాలని కోరారు. వెనుకబడిన తమ జిల్లాలో రాజధాని ఏర్పాటు చేస్తే తమకు మేలు జరుగుతుందని ప్రకాశం జిల్లా మేధావుల ఫోరం అధ్యక్షుడు వినుకొండ రాజారావు పేర్కొన్నారు. కాగా, శివరామకృష్ణన్ కమిటీ ప్రకాశం జిల్లాలో పర్యటించకపోవడం దురదృష్టకరమని హైకోర్టు మాజీ న్యాయమూర్తి పి. లక్ష్మణ్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాయలసీమ నాయకులు కూడా ఒంగోలు వైపు మొగ్గుచూపుతున్న నేపథ్యంలో రాజధాని రాజకీయాలు రంజుగా మారాయి.