ఒంగోలు అయితే ఒకే!
నూతన ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏర్పాటుపై సందిగ్దత కొనసాగుతోంది. రాజధానికి నిర్మాణానికి అనువైన స్థలం గుర్తించేందుకు ఏర్పాటైన నిపుణుల కమిటీ ఇంకా ఏ నిర్ణయం ప్రకటించలేదు. అటు ఏపీ ప్రభుత్వం కూడా రాజధానిపై స్పష్టమైన ప్రకటన చేయలేదు. విజయవాడ-గుంటూరులో నూతన రాజధాని ఆవిష్కృతమవుతుందని ప్రచారం చేస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారులు భూముల ధరలు రోజురోజుకీ పెంచేస్తున్నారు.
మరోవైపు తమ ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేయాలని రాయలసీమ నాయకులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మళ్లీ ఒంగోలు పేరు ముందుకు వచ్చింది. సీమ నాయకులు కూడా ఒంగోలులో రాజధాని ఏర్పాటుకు అభ్యంతరం వ్యక్తం చేయకపోవడం దీనికి సానుకూల అంశంగా మారింది. అటు ప్రకాశం జిల్లా మేధావుల వేదిక కూడా తమ ప్రాంతంలోనే రాజధాని నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా రాజధాని నిర్మాణం కోరుతూ తీర్మానాలు ఆమోదించాలని జిల్లా పరిషత్ చైర్మన్ తో పాటు మండలాధ్యక్షులు, సర్పంచ్ లకు విజ్ఞప్తి చేసింది. తీర్మానాలను శివరామకృష్ణన్ కమిటీకి పంపాలని కోరారు.
వెనుకబడిన తమ జిల్లాలో రాజధాని ఏర్పాటు చేస్తే తమకు మేలు జరుగుతుందని ప్రకాశం జిల్లా మేధావుల ఫోరం అధ్యక్షుడు వినుకొండ రాజారావు పేర్కొన్నారు. కాగా, శివరామకృష్ణన్ కమిటీ ప్రకాశం జిల్లాలో పర్యటించకపోవడం దురదృష్టకరమని హైకోర్టు మాజీ న్యాయమూర్తి పి. లక్ష్మణ్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాయలసీమ నాయకులు కూడా ఒంగోలు వైపు మొగ్గుచూపుతున్న నేపథ్యంలో రాజధాని రాజకీయాలు రంజుగా మారాయి.