వినుకొండ రాజారావు
సాక్షి, ఒంగోలు సబర్బన్: ‘ప్రభుత్వ ఉద్యోగులు నాలుగేళ్లుగా న్యాయమైన డిమాండ్ల సాధన కోసం పోరాడుతూనే ఉన్నారు. కారుణ్య నియామక ఉద్యోగాలు పూర్తిస్థాయిలో భర్తీచేసిన దాఖలాలు లేవు. ఇతర ఖాళీలు కూడా భర్తీ చేయకపోవడంతో ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులపై పని ఒత్తిడి పెరుగుతోంది. దానికితోడు ప్రభుత్వ ఉద్యోగులతో బలవంతంగా 50 సంవత్సరాలకే పదవీ విరమణ చేయించాలని చూస్తున్నారు. దానికి సంబంధించిన జీవోను కూడా ప్రభుత్వం దొంగచాటుగా రూపొందించింది. కొందరు ఉద్యోగ సంఘాల నాయకులు ఆ జీవోను బయటపెట్టి వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం నివ్వెరబోయింది.
జీవో బయటపెట్టారన్న నెపంతో ఇద్దరు అధికారులను సస్పెండ్ కూడా చేసింది. వీటిపై పోరాటాలు జరగకుండా ఉద్యోగ సంఘాల రాష్ట్ర నాయకులను చెప్పుచేతల్లో పెట్టుకుని చివరకు మా హక్కులను కూడా ప్రభుత్వం కాలరాసింది. గడిచిన ఐదేళ్లుగా ఇలాంటి కుట్రలు అనేకం జరిగాయి.. ఇంకా జరుగుతూనే ఉన్నాయి’... అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ జిల్లా అధ్యక్షుడు వినుకొండ రాజారావు ఆవేదన వ్యక్తం చేశారు. ‘సాక్షి’ నిర్వహించిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రభుత్వ విధానాల వలన ఉద్యోగులు పడుతున్న ఇబ్బందులను ఆయన వివరించారు. రాజారావు ఇంటర్వ్యూ విశేషాలు ఈ విధంగా ఉన్నాయి...
సాక్షి : చంద్రబాబు పాలనలో ఉద్యోగుల పరిస్థితి ఎలా ఉంది..?
రాజారావు : సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ ఉద్యోగులు చేయని పోరాటం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిమీద ఒకరు చెప్పుకుంటూ ఓపీఎస్‌ను రద్దు చేయడం ఉద్యోగులను తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. సీపీఎస్‌ను ప్రవేశపెట్టి ఉద్యోగులకు పెన్షన్ విధానానికి స్వస్తిపలికే పద్ధతి అత్యంత దారుణం. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఐదేళ్లు ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తి జీవితాంతం పెన్షన్ తీసుకుంటుంటే.. 35 సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగం చేసిన వారికి పెన్షన్ లేదంటే ఏమనాలి. అందుకే సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను పునరుద్ధరించాలని ప్రకాశం భవన్ ముందు నెలల తరబడి ఆందోళనలు చేశాం. ఒక్క మాటలో చెప్పాలంటే న్యాయమైన డిమాండ్ల సాధన కోసం రోడ్డెక్కని ప్రభుత్వ విభాగమంటూ లేదు.
సాక్షి : ఉద్యోగులకు హెల్త్‌కార్డుల వల్ల ప్రయోజనం ఉంటుందా..?
రాజారావు : హెల్త్ కార్డులు పూర్తిగా ఉపయోగంలోకి రాలేదు. కేడర్‌ను బట్టి స్లాబుల వారీగా నెలనెలా రూ.90 నుంచి రూ.120 వరకు ప్రభుత్వం వసూలు చేస్తోంది. కానీ, కార్పొరేట్ వైద్యశాలల్లో అవి పనిచేయడం లేదు. ఏదైనా అనారోగ్యం వస్తే సొంత డబ్బుతో వైద్యం చేయించుకుంటున్నాం. పరోక్ష పద్ధతిలో మంత్రి అయిన వ్యక్తి పంటి ఆపరేషన్ కోసం ప్రభుత్వ ఖర్చులతో విదేశీ వైద్యం చేయించుకున్నాడు. జీవితాంతం ప్రజలకు, ప్రభుత్వానికి సేవచేసే ప్రభుత్వ ఉద్యోగి మాత్రం సొంత డబ్బుతో వైద్యం చేయించుకోవాల్సి వస్తోంది. అది కూడా నెలనెలా హెల్త్ కార్డుకు డబ్బులు కడుతూనే. ఇదెక్కడి న్యాయం..? మేము కట్టే డబ్బులు ఎక్కడ..?
సాక్షి : ప్రతి ప్రభుత్వ విభాగంలో ఖాళీలు ఉన్నాయి. ఇప్పటి వరకూ ఎన్ని ఖాళీలు పూర్తి చేశారు..?
రాజారావు : కారుణ్య నియామకాలు తప్ప ఈ నాలుగున్నర సంవత్సరాలలో అడపాదడపా కొన్ని ఖాళీలను భర్తీ చేశారు. రాష్ట్రంలో దాదాపు 2 లక్షలకు పైగా వివిధ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. వాటిని భర్తీ చేయకపోవడంతో ప్రస్తుతం పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు పని ఒత్తిడికి గురవుతున్నారు. వారిపై పనిభారం రెట్టింపయింది. తీవ్ర ఒత్తిడి మధ్య విధులు నిర్వర్తిస్తున్నారు.
సాక్షి : ఒక్క ఉద్యోగి కూడా డిమాండ్ల సాధనకు రోడ్డెక్కలేదని ఒక సంఘ నేత చెప్పారు. అది ఎంత వరకు వాస్తవం..?
రాజారావు : అది పూర్తిగా అవాస్తవం. జనవరి 31, 2019న విజయవాడ కేంద్రంగా సీపీఎస్ ఉద్యోగులు రాష్ట్రవ్యాప్తంగా బంధ్ చేశారు. వారికి మద్దతుగా మా రాష్ట్ర అధ్యక్షుడు కె.ఆర్.సూర్యనారాయణ కూడా బంధ్‌లో పాల్గొన్నారు. గవర్నర్‌పేట పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి మళ్లీ వదిలిపెట్టారు. ఆయనతో పాటు అరెస్టయిన ఉద్యోగులను వదిలిపెట్టేంత వరకు స్టేషన్ నుంచి సూర్యనారాయణ బయటకు రాలేదు. మన జిల్లాలో కూడా నెలల తరబడి ఉద్యోగులు ఆందోళనలు చేశారు. ప్రభుత్వానికి భజన చేసే కొందరు ఉద్యోగ సంఘ నేతలు వాస్తవాలను వక్రీకరిస్తున్నారు. వారి స్వార్థం కోసం ఉద్యోగుల హక్కులను కాలరాయడం మంచి పద్ధతి కాదు.
సాక్షి : ఉద్యోగుల సొంతింటి కల నెరవేరిందా..?
రాజారావు : జిల్లాలో ఏ ఒక్క ఉద్యోగికీ సొంతింటి కల నెరవేరలేదు. సెంటు భూమిగానీ, సొంత ఇల్లుగానీ ఇచ్చిన దాఖలాలు లేవు. ఇది వాస్తవం. ఒక సంఘ నాయకుడు మాత్రం తన సొంతింటి కల నెరవేరిందని చెప్పడం ఉద్యోగులను మోసం చేయడమే.
సాక్షి : మధ్యంతర భృతి (ఐఆర్) 20 శాతం ఇవ్వడంపై ఉద్యోగులు సంతృప్తిగా ఉన్నారా..?
రాజారావు : 2009లో 22 శాతం, 2014లో 27 శాతం ఐఆర్ ఇచ్చారు. అప్పుడు ఏ సంఘ నాయకుడూ ప్రభుత్వంలో ఉన్న వారికి సన్మానాలు చేయలేదు. ఇది ఉద్యోగుల హక్కేగానీ, భిక్ష కాదు. అయితే, ప్రస్తుతం 20 శాతం ఇస్తే గొప్పగా ఇచ్చారని భావిస్తున్నారు. కొన్ని భజన సంఘాల నాయకులు ప్రభుత్వానికి బాకా ఊదుతూ అధికారాన్ని అడ్డంపెట్టుకుని ఉద్యోగుల హక్కులను కాలరాస్తున్నారు. వాటి కోసం పోరాడుతున్న వారి గొంతు నొక్కుతున్నారు. ఇది హేయమైన చర్య.
సాక్షి : ప్రస్తుత ఎన్నికల్లో ఓటర్లలో చైతన్యానికి, ఓటింగ్ శాతం పెంచడానికి ఉద్యోగులు చేస్తున్న ప్రయత్నాలేంటి..?
రాజారావు : ఓటు వేయడం అనేది సామాజిక బాధ్యత. ఈ నినాదంపై ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అనేక చైతన్య కార్యక్రమాలు చేపట్టింది. 2014 సాధారణ ఎన్నికల సంధర్భంగా జిల్లాలో 83.4 శాతం ఓటింగ్ నమోదు కావడానికి ఉద్యోగులే కారణం. కొన్ని పోలింగ్ కేంద్రాలలో కనీస వసతులు కరువైనా మహిళా ఉద్యోగులు ఇబ్బందులకు లోనవుతూ కూడా రాష్ట్రంలోనే ప్రథమంగా జిల్లాని నిలిపారు. అందువలనే గత కలెక్టర్ విజయకుమార్‌కు రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా అవార్డు దక్కింది. ప్రస్తుత ఎన్నికల్లో మునుపటి శాతం కంటే ఎక్కువగా పోలింగ్ నమోదు చేయించి రీ పోలింగ్ జరగని జిల్లాగా చేయడానికి కలెక్టర్ వినయ్‌చంద్‌కు అందరం సహకరిస్తున్నాం.
సాక్షి : 50 సంవత్సరాలకే పదవీ విరమణ జీఓ ఏమైంది..?
రాజారావు : రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రభుత్వ ఉద్యోగులతో బలవంతంగా 50 సంవత్సరాలకే పదవీ విరమణ చేయించాలని జీఓను రూపొందించింది. దానిని గుట్టుచప్పుడు కాకుండా అమలులోకి తీసుకురావాలని చూసింది. కానీ, కొంతమంది ఉద్యోగ సంఘ నాయకులు దానిని పసిగట్టి ఆందోళనలు చేపట్టారు. దీంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. చివరకు ఆ జీఓను రద్దు చేసుకుంది. అలాంటి జీవోలు అమలు చేస్తే ఉద్యోగుల జీవితాల్లో నిప్పులు పోసినట్లే. జీవోను బయట పెట్టారన్న నెపంతో ఇద్దరు అధికారులను సస్పెండ్ చేశారు. ఈ విధంగా ఉద్యోగుల హక్కులను కాలరాస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment