
బిల్లు రాదు..ఇల్లు లేదు
ప్రొద్దుటూరు టౌన్: ఏడాదిగా ఒక్క బిల్లు మంజూరు కాకపోవడం, గృహాల కేటాయింపు జరగకపోవడంతో హౌసింగ్ శాఖ నిస్తేజంగా మారింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రతి పేదోడికి సొంతింటి కలను నిజం చేసేందుకు ఇందిరమ్మ గృహాల పేరిట హౌసింగ్ శాఖను పరుగులు తీయించారు. ఈ సమయంలో ప్రొద్దుటూరు మండల పరిధిలో 365 ఎకరాలు ప్రభుత్వం కొనుగోలు చేసి ప్రతి పేదోడికి రెండు సెంట్ల స్థలాన్ని ఇచ్చింది.
అలాగే గృహ నిర్మాణాలను చేయడంతోపాటు సొంతంగా గృహాలు నిర్మించుకునేవారికి రూ.70వేలు దాకా నిధులు ఇచ్చింది. ఈ దశలో ఫేజ్-1, 2, 3 లలో 6641 గృహాలు మంజూరయ్యాయి. వీటిలో 5984 గృహాలు పూర్తికాగా బేస్‌మట్టం లెవెల్‌లో 390 గృహాలు, లెంటిన్ లెవెల్‌లో 54 గృహాలు, రూఫ్ లెవెల్‌లో 107 గృహాలు ఉన్నాయి. 6641 గృహాల్లో 2240 గృహాల లబ్ధిదారులను వారి ఇంటి వద్ద జియో ఫాగింగ్ పూర్తి చేశారు.
తర్వాత వచ్చిన ప్రభుత్వాల హయాంలో హౌసింగ్ శాఖకు నిధులు మంజూరు కాకపోవడంతో లబ్ధిదారులు కార్యాలయాల చుట్టు ప్రదక్షిణలు చేయడానికే సమయం సరిపోయింది. బిల్లులు రాకపోవడం, కొందరు డబ్బులు లేక పునాదుల నుంచి పై స్థాయికి గృహాన్ని నిర్మించుకోలేకపోవడం చోటు చేసుకున్నాయి. ఇలాంటి సందర్భంలోనే ఇందిరమ్మ కాలనీలో కోట్ల రూపాయల అవినీతి జరిగిందంటూ జిల్లా స్థాయి అధికారి ప్రభుత్వానికి నివేదిక పంపడంతో ఇందిరమ్మ కాలనీ అభివృద్ధి మరింత కుంటు పడింది.
ఈ విధంగా పలు దఫాలుగా విచారణల పేరుతో ప్రభుత్వాలు కాలయాపన చేశాయి. ఈ దశలో దాదాపు రూ.60లక్షలు దాకా గృహాలకు మంజూరైన నిధులు స్వాహా చేశారంటూ కొందరు హౌసింగ్ అధికారులపై కేసులు నమోదు కావడం, అరెస్టులు కావడం జరిగింది. ఖాళీగా ఉన్న గృహాల్లో వాటిని కేటాయించిన లబ్ధిదారులు వచ్చి చేరాలంటూ గత కలెక్టర్ హెచ్చరికలు జారీ చేశారు. లబ్ధిదారులు చేరని గృహాలను రద్దు చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో 64 గృహాలకు హౌసింగ్ శాఖ తాళాలు వేసి సీజ్ చేసింది. ఇందులో ప్రభుత్వం నిర్మించిన గృహాలతోపాటు లక్షల రూపాయలు వెచ్చించి ప్రజలు నిర్మించుకున్న గృహాలు కూడా ఉన్నాయి.
ఏడాదిగా నిస్తేజంగా
గత ఏడాది మార్చి నెలలో ఎన్నికల కోడ్ రావడంతో హౌసింగ్ శాఖకు బిల్లులు నిలుపుదల చేశారు. ఈ విధంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు 252 గృహాలకు 47 లక్షల 50 వేల 600 రూపాలు బిల్లులు రావాల్సి ఉంది. 145 ఇళ్లకు డబ్బులు వచ్చినా ప్రభుత్వం నుంచి విడుదల కాలేదు. ఇవి వివిధ దశలలో అలేగా నిలిచిపోయి ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో ఎస్సీ, ఎస్టీలకు ఒక్కో గృహానికి రూ.లక్షా 50వేలు, ఓసీ, బీసీలకు లక్ష రూపాయలు ఇస్తామంటూ పెద్దపెద్ద ప్రకటనలు చేశారు.
అంతే తప్ప అధికారంలోకి వచ్చి 7 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఒక్క గృహానికి కూడా నిధులు మంజూరు చేయడం కానీ, స్థల కేటాయింపులు, నిధుల కేటాయింపులు జరగలేదు. గత ప్రభుత్వ హయాంలో మధ్యలో నిలిచిపోయిన గృహాలకు బిల్లులు ఏ విధంగా చెల్లిస్తారన్న విషయంపై హౌసింగ్ శాఖలో తీవ్ర గందరగోళం ఉంది. ప్రస్తుతం గృహాల కేటాయింపునకు సంబంధించి మున్సిపాలిటీ, మండల పరిధిలో ఎక్కడా స్థలాలు లేకపోవడం చూస్తుంటే హౌసింగ్ శాఖ నిస్తేజంగా ఉండటం తప్ప మరేమీ చేయలేకపోతోంది. గత ప్రభుత్వ హయాంలో ఉన్న హౌసింగ్ వర్క్ ఇన్‌స్పెక్టర్లను తొలగించిన టీడీపీ ప్రభుత్వం తిరిగి ఆరు నెలల తర్వాత వారిని విధుల్లోకి తీసుకుంది. ఏదిఏమైనా హౌసింగ్ శాఖ