
నెరవేరనున్న పేదల సొంతింటి కల
- గజ్వేల్‌లో ‘డబుల్ బెడ్‌రూమ్’ పథకానికి శ్రీకారం
- నేడు మంత్రి హరీశ్‌రావుచే భూమిపూజ
- ఏర్పాట్లు చేసిన యంత్రాంగం
- 1,689 ఇళ్ల నిర్మాణానికి రూ.90కోట్ల నిధులు
- కేంద్ర సాయం రూ.27 కోట్లపైనే
గజ్వేల్: పేదల సొంతింటి కల నెరవేరబోతోంది. గజ్వేల్-ప్రజ్ఞాపూర్ నగర పంచాయతీ పరిధిలోని పేదల కోసం డబుల్ బెడ్‌రూమ్ పథకానికి శ్రీకారం చుట్టనున్నారు. పట్టణంలోని సంగాపూర్ రోడ్డు వైపు ‘డబుల్ బెడ్‌రూమ్ మోడల్ కాలనీ’కి రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు శనివారం భూమిపూజ చేయనున్నారు. ఈ మేరకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది.
ఎంతో కాలంగా ఎదురుచూస్తోన్న పేదల సొంతింటి కల నిజం చేస్తామని ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తోన్న సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారం గతేడాది మే నెలలో పనులకు శంకుస్థాపన సైతం చేశారు. ఈ క్రమంలో టెండర్ ప్రక్రియలో జాప్యం జరిగింది. ఎట్టకేలకు టెండర్‌ను జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లి-నర్సన్నపేట గ్రామాల్లో నిర్మాణ బాధ్యతలు చేపడుతున్న సంస్థే దక్కించుకుని పనులకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే ప్రముఖ అర్కిటెక్ట్స్ సంస్థచే మోడల్ కాలనీకి సంబంధించిన లే-అవుట్ ప్రక్రియ దాదాపు పూర్తి చేసింది.
కేంద్రం ఇటీవల గజ్వేల్‌లో చేపట్టనున్న మోడల్ కాలనీ నిర్మాణ డీపీఆర్ (డిటేయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్) కోరగా మున్సిపల్ శాఖ డైరెక్టర్ కార్యాలయం నుంచి పంపారు. ఈ డీపీఆర్‌కు గతంలోనే ఆమోదం లభించింది. ఇకపోతే కాలనీ వాసులకు రోడ్లు, మంచినీరు, షాపింగ్ కాంప్లెక్స్, ప్రార్థనా మందిరాలు, ఫంక‌్షన హాళ్లు వంటి సదుపాయాలు, అదే విధంగా గ్రీన్ ఫీల్డ్ యాక్టివిటీ కింద గార్డెనింగ్, కాలనీకి రింగ్ రోడ్డు, ఫోర్‌లేన్ రోడ్ల నిర్మాణాలతో అనుసంధానం చేయనున్నారు. ప్రస్తుతం ఈ కాలనీలో ఒక్కో ఇల్లు 570 చదరపు గజాల విస్తీర్ణంలో నిర్మాణం జరగబోతున్నది. జీ ప్లస్ వన్ కలుపుకొని 1,140 చదరపు గజాల స్థలంలో ప్రపంచంలోనే అత్యంత మేలైన ‘షేర్ వాల్’ విధానంలో వీటి నిర్మాణాలు జరగబోతున్నాయి. ఒక్కో ఇంటి కోసం రూ.5.3 లక్షలకుపైగా వెచ్చించనున్నారు.
రూ.90 కోట్లతో ప్రాజెక్టు..
పాలీటెక్నిక్ వెనుక భాగంలోని 68 సర్వే నంబర్‌లో మొత్తం 64ఎకరాల భూమి అందుబాటులో ఉన్నది. విడతల వారీగా మొత్తం ఇక్కడ 2500 ఇళ్లను నిర్మించనున్నారు. మొదటి దశలో ఇక్కడ 1,689 ఇళ్లు నిర్మిస్తారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.90కోట్లు వెచ్చిస్తుండగా కేంద్ర సాయంగా రూ.27కోట్లపైనే అందుతున్నట్టు తెలుస్తోంది. ఇతర సౌకర్యాల కల్పనకు మరో రూ.50 కోట్లకుపైగా వెచ్చిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు శనివారం రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు భూమిపూజ చేయనున్నారు.