
5 నుంచి బడ్జెట్ సమావేశాలు
రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు మార్చి 5 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇవి అదే నెల 31 వరకూ జరగుతాయి.
అదే రోజు గవర్నర్ ప్రసంగం
12న బడ్జెట్, 14న వ్యవసాయ బడ్జెట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు మార్చి 5 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇవి అదే నెల 31 వరకూ జరగుతాయి. 18 రోజుల పాటు అసెంబ్లీ సమావేశం అవుతుంది. శాసనసభాపతి కోడెల శివ ప్రసాదరావు విదేశీ పర్యటన నేపథ్యంలో మొదట మార్చి 1న బడ్జెట్ సమావేశాలు ప్రారంభించి 23న ముగించాలని ప్రభుత్వం భావించింది. స్పీకర్ పర్యటన వాయిదా పడటంతో సమావేశాల తేదీలను మార్చింది.
ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, చీఫ్ విప్ కాలువ శ్రీనివాసులు తదితరులతో సమావేశమై బడ్జెట్ సమావేశాల తేదీలను సీఎం చంద్రబాబు ఖరారు చేశారు. అసెంబ్లీ సమావేశాలకు అవసరమైన ఏర్పాట్లు చేయాల్సిందిగా శాసనసభ ఇన్‌చార్జి కార్యదర్శి కె.సత్యనారాయణకు ఆదేశాలు జారీ చేశారు. మార్చి 5నమండలి, శాసనసభలను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగిస్తారు. 2016-17కు బడ్జెట్‌ను 12న ఆర్థిక మంత్రి యనమల శాసనసభలో ప్రవేశ పెట్టనున్నారు. మరుచటి రోజు అసెంబ్లీకి సెలవు ఇస్తారు.దీంతో 14న అసెంబ్లీలో వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆ శాఖకు ప్రత్యేక బడ్జెట్ ప్రవేశ పెడతారు. ఈ రెండు బడ్జెట్‌లను ఆయా రోజుల్లో ముందుగా ఎంపిక చేసిన మంత్రులు మండలిలో ప్రవేశ పెడతారు.