దినదినాభివృద్ధి చెందుతున్న బెజవాడ
- జోరందుకున్న రియల్ ఎస్టేట్ వ్యాపారం
- తరలి వస్తున్న కంపెనీలు
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డున కొత్త రాజధాని బెజవాడలో ఏర్పాటు కాబోతోంది. దీంతో విజయవాడ నగరానికి నలువైపులా దినదినాభివృది ధచెందుతోంది. శివారు ప్రాంతాలు కూడా అతి వేగంగా అబివృద్ధి పథంలో పరుగులు తీస్తున్నాయి. కొత్త రాజధానిలో వ్యాపారాలు చేయటానికి ప్రముఖ కంపెనీలు తరలి వస్తున్నాయి.
ఈ క్రమంలో నగరంలో శివారు ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరందుకుంది. నగరం మీదుగా రెండు జాతీయ రహదారులు, అతిపెద్ద రైల్వే జంక్షన్, అంతర్జాతీయ స్థాయికి అభివృద్ధి చెందనున్న విమానాశ్రయం, అధునాతన స్టార్ హోటల్స్, విద్యా, వైద్య సంస్థలు తదితర వసతులున్నాయి. బందరు రోడ్డు విస్తరణ, దుర్గగుడి వద్ద ఫ్లైఓవర్, విజయవాడ-గుంటూరు మధ్య రెండు బైపాస్‌రోడ్ల నిర్మాణాలు తదితర ప్రతిపాదనలతో నగరం అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుపోతోంది.
బంజారాహిల్స్‌ను తలపిస్తున్న బందరు రోడ్డు..
బందరురోడ్డు హైదరబాబాద్‌లో బంజారాహిల్స్ ప్రాంతాన్ని తలపిస్తోంది. విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు అబివృద్ధి శరవేగంతో సాగుతోంది. విజయవాడ నుంచి కంకిపాడు వరకు బందరురోడ్డు కిరువైపులా వెంచర్లు వెలిశాయి. స్థిరాస్తి అమ్మకాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ ప్రాంతంలో ఆస్తుల విలువలు హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ ప్రాంతాన్ని తలపిస్తు న్నాయి. విజయవాడ-బందరు మధ్య 60 కిలోమీటర్ల మేర రోడ్డు విస్తరణ ప్రతిపాదనలతో ఇక్కడ రియల్ ఎస్టేట్ రంగం దూకుడుగా సాగుతోంది.
దూసుకుపోతున్న ఏలూరు రోడ్డు
విజయవాడ నుంచి ఏలూరు వైపుకు వెళ్లే రోడ్డులో స్థిరాస్తి వ్యాపారం దూసుకుపోతోంది. ఈ మార్గంలో అనేక కార్ల కంపెనీలు ఏర్పాటయ్యాయి. రామవరప్పాడు రింగ్ సెంటర్ నుంచి గన్నవరం వరకు నగరంలో కలిసిపోయింది. ఈ మార్గంలో హనుమాన్ జంక్షన్ వరకు రియల్ ఎస్టేట్ సంస్థలు తమ వ్యాపారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. గన్నవరంలో ఎయిర్‌పోర్టు, దానికి దగ్గర్లో ఐటీ పార్కు ఉండటంతో జనం ఆ ప్రాంతంలో కొనుగోళ్లకు ఎగబడుతున్నారు.
విజయవాడ-గుంటూరు రూట్‌లో..
విజయవాడ-గుంటూరు రూట్‌లో ఆరులైన్ల జాతీయ రహదారి అభివృద్ధి చెందటంతో ఈ ప్రాంతంలో సొంత ఇంటి నిర్మాణానికి ఎక్కువ మంది మొగ్గుచూపుతున్నారు. ఈ ప్రాంతంలో తాగునీటికి కూడా ఇబ్బంది లేకపోవటంతో అపార్టుమెంట్ల నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. అదేవిధంగా హైదరాబాద్ రూట్‌లో కూడా చిన్న పట్టణాలు అభివృద్ధి చెందాయి. జగ్గయ్యపేట వరకు జాతీయ రహదారికి ఇరువైపులా వందలాది ఎకరాల్లో వెంచర్లు వెలిశాయి.
అన్ని సౌకర్యాలతో వెంచర్లు..
మధ్యతరగతి వారికి సైతం అందుబాటులో ఉండేలా స్థిరాస్తి వెంచర్లు ఏర్పాటు చేస్తున్నారు. విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(వీజీటీఎం, ఉడా) నిబంధనలకు అణుగుణంగా 40 అడుగుల రోడ్లు నిర్మిస్తున్నారు. వెంచర్ల చుట్టూ ప్రహరీ, భూగర్బ డ్రె యినేజీ, విద్యుత్ సౌకర్యాలతో మధ్య తరగతి వారికి సైతం అందుబాటులో ఉంటున్నాయి. 100 శాతం వాస్తుతో ఉడా లే అవుట్ నిబంధనలకు అనుగుణంగా పార్కులు, కామన్ సైట్‌లు విడిచిపెట్టడంతో ఆయా వెంచర్ల వివరాలు తెలుసుకుని ప్లాట్లను కొనుగోలు చేసుకుంటున్నారు. కొన్ని సంస్థలు బ్యాంకు రుణ సదుపాయం కూడా అందిస్తున్నాయి. బ్యాంకర్లు కూడా ప్లాట్ల కొనుగోలుదారులకు రుణాలు విరివిగా ఇస్తున్నారు.