
ప్లకార్డులు, నల్ల బెలూన్లతో స్థానికుల నిరసన
ఉండ్రాజవరం: అమరావతి రైతు పాదయాత్రకు తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరంలో నిరసన సెగ తగిలింది. గురువారం ఉండ్రాజవరం నుంచి ప్రారంభమైన పాదయాత్రకు స్థానిక జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ బూరుగుపల్లి సుబ్బారావు ఆధ్వర్యంలో ఆయన నివాసం వద్ద వైఎస్సార్‌సీపీ శ్రేణులు, స్థానికులు ప్లకార్డులతో, నల్ల బెలూన్లతో నిరసన వ్యక్తం చేశారు.
వారు బయటకు రాకుండా గేట్లు వేశారు. రియల్ ఎస్టేట్ రాజధాని వద్దు.. మూడు రాజధానులే ముద్దు.. వికేంద్రీకరణతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం.. అంటూ నినాదాలు చేస్తూ నల్ల బెలూన్లను గాల్లోకి వదిలారు. పాదయాత్రలో ఒక మహిళ జై అమరావతి.. అంటూ రెచ్చగొట్టేలా నినాదాలు చేయడంతో వైఎస్సార్‌సీపీ నాయకులు, స్థానికులు ఒక్కసారిగా రోడ్డుపైకొచ్చారు. దీంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది.
పోలీసులు రంగ ప్రవేశం చేసి వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలను, స్థానికులను సుబ్బారావు నివాసంలోకి పంపేశారు. జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ బూరుగుపల్లి సుబ్బారావు మీడియాతో మాట్లాడుతూ పాదయాత్రలో రైతుల ముసుగులో టీడీపీ నాయకులు, కార్యకర్తలే ఉన్నారని విమర్శించారు.