బాలిక హత్య కేసు కొలిక్కి!
కీలక ఆధారాలు సేకరించిన పోలీసులు
దేవరాపల్లి: దేవరాపల్లికి చెందిన ఏడేళ్ల బాలిక దివ్య హత్య కేసు దర్యాప్తులో పోలీసులు శుక్రవారం కీలక ఆధారాలు సేకరించిట్లు తెలిసింది. దీంతో హత్య కేసు దాదాపుగా కొలిక్కి వచ్చినట్లు సమాచారం. ఈ కేసులో నిందితులను పక్కా ఆధారాలతో పట్టుకునేందుకు ప్రణాళిక వేసినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా నిందితులను శుక్రవారం సాయంత్రమే పట్టుకున్నారని, సాయంత్రం చీకటి పడటంతో పాటు క్రిస్మస్ సెలవు దినం కావడంతో అరెస్టు చేయలేదని విశ్వనీయంగా తెలిసింది. వీరిని శనివారం అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. దేవరాపల్లి ఎస్‌ఐ జీఎన్.అప్పన్న కేసు దర్యాప్తు చేస్తున్నారు. దివ్యను ఎవరు హత్య చేశారు, ఎందుకు చేసినట్టు, ఇందులో ఎవరెవరి పాత్ర ఉంది అనేదానిపై కూపీ లాగుతున్నట్టు తెలిసింది. క్రైం కేసులను ఛేదించడంలో దిట్టగా పేరున్న ఎస్‌ఐ అప్పన్న ఆది నుంచి చాలెంజింగ్ తీసుకొని ఈ ఘటనపై దర్యాప్తు సాగిస్తున్నారు. బాలిక అదృశ్యం అయినట్లు ఫిర్యాదు అందిన మరుక్షణమే గ్రామంలో దండోరా ద్వారా ప్రచారం చేయడమే దీనికి నిదర్శనం. దండోరా వేయించడమే నిందితులను పట్టుకోవడంలో కీలకమైనట్లు తెలుస్తోంది. అనుమానితుడిగా పోలీస్‌లు అదుపులో ఉన్న దివ్యకు వరుసకు మేనమామ అయిన గుణశేఖర్‌ను శుక్రవారం లోతుగా విచారించినట్లు సమాచారం.
బాలిక తల్లిదండ్రులతో మాట్లాడినట్టు తెలిసింది. ఇది ఇలా ఉండగా ముక్కు పచ్చలారని చిన్నారి దివ్యను హత్య చేయడంపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. హత్య చేసిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి. అల్లారి ముద్దుగా పెంచుకున్న కుమార్తె హత్యకు గురికావడంపై బాలిక తల్లిదండ్రులు మాత్రం తీవ్ర మనోవేదనతో అల్లాడుతున్నారు.