కరీంనగర్ సిటీ, న్యూస్‌లైన్ : తెలంగాణ రాష్ట్ర సాధనలో జరిగిన ఆత్మబలిదానాలకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తీరే కారణమని కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ ధ్వజమెత్తారు. కరీంనగర్‌లో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆత్మబలిదానాలకు సోనియా కారణమన్న టీటీడీపీ ఫోరం ఆరోపణలను ఖండించారు. బీజేపీ మూడు కొత్త రాష్ట్రాలను ఇచ్చినప్పుడు తెలంగాణను చంద్రబాబు అడ్డుకున్నారని, అద్వానీ ఈ విషయం చెప్పారని గుర్తుచేశారు. అప్పుడే తెలంగాణ ఇచ్చి ఉంటే వేలాది మంది ప్రాణత్యాగాలు చేయాల్సిన అవసరం ఉండేది కాదన్నారు.
ఇప్పుడు సైతం తెలంగాణపై పూటకో మాట మాట్లాడుతున్న చంద్రబాబును నిలువరించకపోతే టీడీపీ నాయకులు ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర విభజన జరుగుతున్నా ఇంకా ఆగుతుందనడం మూర్ఖత్వమని పేర్కొన్నారు. టీడీపీ ప్లీనరీలో కనీసం అమరులకు సంతాపం ప్రకటించలేదని, ఏనాడూ అమరుల కుటుంబాలను పరామర్శించలేదని విమర్శించారు. 18 వేల మెయిల్స్‌ను పరిశీలించి జీవోఎం తెలంగాణపై నిర్ణయం తీసుకుందని గుర్తు చేశారు. కేంద్ర మంత్రివర్గ నిర్ణయం హర్షణీయమని, యావత్ జిల్లా ప్రజానీకం తరఫున సోనియా, మన్మోహన్, రాహుల్, మంత్రులకు ధన్యవాదాలు తెలిపారు. నాలుగు రాష్ట్రాల ఫలితాలు సాధారణ ఎన్నికలపై ప్రభావం చూపవని తెలిపారు. వెంకయ్యనాయుడు కుట్రలు చేస్తున్నా సుష్మాస్వరాజ్ తెలంగాణ బిల్లుకు మద్దతు పలుకుతారనే విశ్వాసం ఆయన వ్యక్తం చేశారు.
సీఎం అయ్యేందుకు మంత్రి శ్రీధర్‌బాబు అర్హుడేనని, ఆయన మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారని చెప్పారు. ఎన్నికల వేళ డీసీసీ అధ్యక్షుడిని మారుస్తారని తాననుకోవడం లేదన్నారు. ఓట్లు తొలగించడమే లక్ష్యంగా అధికారులు పనిచేయరాదని సూచించారు. అర్హుల ఓట్లు తొలగిస్తే అధికారులదే బాధ్యత అని హెచ్చరించారు. చేర్పులు, తొలగింపులపై కాంగ్రెస్ పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో పర్యవే క్షించాలని పిలుపునిచ్చారు. ఆయన వెంట డీసీసీ అధ్యక్షుడు కొండూరి రవీందర్‌రావు, నగర అధ్యక్షుడు కన్న కృష్ణ, డి.శంకర్, వై.సునీల్‌రావు, అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్, ఏఎంసీ చైర్మన్ ఆకారపు భాస్కర్‌రెడ్డి, గుగ్గిళ్ల జయశ్రీ తదితరులు ఉన్నారు.
ఆత్మబలిదానాలకు చంద్రబాబే కారణం
Published Mon, Dec 9 2013 6:20 AM | Last Updated on Sat, Sep 2 2017 1:25 AM
Advertisement
Advertisement