రూపాయి పతనానికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం’
Published Thu, Aug 29 2013 2:36 AM | Last Updated on Fri, Sep 1 2017 10:12 PM
మోపాల్(నిజామాబాద్‌రూరల్),న్యూస్‌లైన్ :మన దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం కావడానికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని, రోజురోజుకు రూపాయి విలువ పతనమైతున్నా ఎలాంటి దిద్దుబాటు చర్యలు చేపట్టడం లేదని బీజేపీ రాష్ట్ర నాయకుడు కేశ్‌పల్లి ఆనంద్‌రెడ్డి ఆరోపించారు. బుధవారం నిజామాబాద్ మండలంలోని మోపాల్ గ్రామంలో బీజేపీ జెండాను ఆయన ఆవిష్కరించారు. అనంతరం మోపాల్ చౌరస్తాలో ఆయన కార్యకర్తల నుద్దేశించి మాట్లాడారు. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు రూపాయికి ఒక డాలర్ ఉండేదన్నారు. 67 ఏళ్ల తరువాత దాని విలువ 67 రూపాయలకు ఒక డాలర్ చేరుకుందని అన్నారు. ఇందుకు ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానాలే కారణమన్నా రు.
ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ప్రజల ను మభ్యపెట్టి ఆనేక లోపభూయిష్ట పథకాలను అమలుచేస్తోందని విమర్శించారు. ఆ రోజుల్లో సబ్సిడీలు లేవని, నేడు అనేక సబ్సిడీలు అందిస్తూ ప్రభుత్వం ఆర్థికవ్యవస్థను దివాలా తీయించిందన్నారు. దేశభవిష్యత్తు కోసం బీజేపీ ప్రచార సారథి నరేంద్రమోడి కృషిచేస్తున్నారని అన్నారు. ఆయన నాయకత్వం కోసం దేశ ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు. అనంతరం పలువురు యువకులు ఆయన సమక్షంలో బీజేపీలో చేరారు.
Advertisement