
ఇంత మోసం చేస్తారనుకోలేదు
అనంతపురం రూరల్: ‘మాకు డ్వాక్రా సంఘాలే వద్దు. రుణాలు మాఫీ అని చెబితే మేము కట్టకుండా ఉన్నాము. రుణాలు మాఫీకి చంద్రబాబు నాయుడు, జగన్ ఇద్దరు మాట ఇచ్చారు. కచ్చితంగా మా రుణాలు మాఫీ అవుతాయి అనుకున్నాము కానీ ప్రభుత్వం, బ్యాంకు అధికారులు ఇంత మోసం చేస్తారని అనుకోలేదు. మాకు సంఘాలు వద్దు, మీ సలహాలు వద్దు, మా డబ్బులు మాకు వెనక్కి ఇచ్చేయండి’ అని చియ్యేడు స్వయం సహాయక సంఘాల మహిళలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాల్లోకెళితే... చియ్యేడు గ్రామంలోని ఉన్న సిండికేట్ బ్యాంకు వారు 45 డ్వాక్రా సంఘాల మహిళలు రుణాలు కంతు చెల్లించలేదని వారి పొదుపు సొమ్మును రుణ ఖాతాకు మళ్లించుకున్నారు. విషయం తెలుసుకున్న మహిళలు గురువారం మధ్యాహ్నం నుంచి రాత్రి ఏడున్నర వరకు దాదాపు ఐదు గంటలపాటు బ్యాంకు మేనేజర్ సుధాకర్‌రాజును నిర్బంధించారు.
ఉదయాన్నే సమస్య పరిష్కరిస్తామని చెప్పి మహిళలను శాంతపరిచారు. బ్యాంకు మేనేజర్ సుధాకర్‌రాజు, ఇటులకపల్లి ఎస్‌ఐ శివగంగాధర్‌రెడ్డిల హామీ మేరకు శుక్రవారం మూడు గంటల వరకు మహిళలు సిండికేట్ బ్యాంకు వద్దే వేచి చూశారు. సిండికేట్ బ్యాంకు జిల్లా డిప్యూటీ మేనేజర్ రావాల్సి ఉండగా ఆయన స్థానంలో సీనియర్ మేనేజర్ రామ్‌ప్రసాద్‌రెడ్డి వచ్చారు. ఐదు గంటలు గడుస్తున్నా అధికారుల నుంచి ఏలాంటి హామీ రాకపోవడంతో మహిళ సంఘాల సభ్యులు మరింత రెచ్చిపోయారు. బ్యాంకు ముందే బైఠాయించి అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారకుండా ఉండేందుకు మహిళలను చెదరగొట్టేందుకు పోలీసులు చేసిన ప్రయత్నం ఫలించలేదు.
దీంతో బ్యాంకు అధికారులు జిల్లా అధికారులను సంప్రదించారు. వారి సూచన మేరకు రుణాలకు మళ్లించిన పొదుపు సొమ్మును డ్వాక్రా సంఘాల ఖాతాకు వీలైనంత త్వరగా జమ చేస్తామని, ఎవరికీ అన్యాయం చేయబోమని హామీ ఇవ్వడంతో మహిళలు శాంతించి ఆందోళన విరమించారు.