Debit waiver
-
ఈ కాపలాదారు దొంగల్ని వదిలిపెట్టడు
ధర్మశాల/సిమ్లా: రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ రైతులను మోసం చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. రైతుల రుణమాఫీ విషయంలో గతంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నిలబెట్టుకోలేదని వెల్లడించారు. ‘కాపలాదారు దొంగగా మారాడు’ అంటూ కాంగ్రెస్ చీఫ్ రాహుల్ చేస్తున్న విమర్శలపై స్పందిస్తూ.. ‘ఈ కాపలాదారు దొంగల్ని వదిలిపెట్టడానికి సిద్ధంగా లేడు’ అని వ్యాఖ్యానించారు. హిమాచల్‌ప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా ధర్మశాలలో గురువారం నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న మోదీ, కాంగ్రెస్శైలిపై విమర్శలు గుప్పించారు. రుణమాఫీపై మాట తప్పారు: దేశంలో రైతుల రుణాలన్నింటిని మాఫీ చేసేంతవరకూ ప్రధానిని నిద్రపోనివ్వబోమని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ధర్మశాల సభలో మోదీ మాట్లాడుతూ..‘2009 లోక్‌సభ ఎన్నికల్లో గెలిస్తే ఏకంగా రూ.6 లక్షల కోట్ల రైతుల రుణాలను మాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. కానీ అధికారంలోకి వచ్చాక కేవలం రూ.60,000 కోట్లు మాత్రమే మాఫీ చేసి చేతులు దులుపుకుంది. విచిత్రం ఏంటంటే రైతులు కాని లక్షలాదిమంది ఈ రుణమాఫీతో లబ్ధి పొందారని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) తన నివేదికలో బయటపెట్టింది. రుణమాఫీపై ఇదే తరహా హామీలను పంజాబ్, హరియాణా ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. అయితే ఎన్నికలు అయ్యాక పంజాబ్‌లో రైతులకు ఏమీ దక్కకపోగా, కర్ణాటకలో మాత్రం ఓ 800 మంది రైతులకు ఏదో నామమాత్రంగా మాఫీ చేశారు’ అని అన్నారు. రూ.90,000 కోట్లను ఆదా చేశాం భారత సాయుధ బలగాలు, మాజీ జవాన్లు చాలాకాలంగా డిమాండ్ చేస్తున్న వన్ ర్యాంక్–వన్ పెన్షన్ (ఓఆర్ఓపీ) విధానంపై మోదీ మాట్లాడుతూ.. ‘అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం రుణమాఫీ తరహాలోనే ఓఆర్ఓపీపై దేశాన్ని తప్పుదోవ పట్టించింది. ఈ పథకం కోసం కొద్దిపాటి నిధులను మాత్రమే కేటాయించింది. కానీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఓఆర్ఓపీని పూర్తిస్థాయిలో అమలుచేశాం. యూపీఏ హయాంలో వేర్వేరు ప్రభుత్వ పథకాల కింద బోగస్ లబ్ధిదారుల పేరుతో దుర్వినియోగం అవుతున్న రూ.90,000 కోట్లను మేం ఆదా చేయగలిగాం’ అని తెలిపారు. బస్సు పల్టీ.. 35 మందికి గాయాలు ధర్మశాలలో ప్రధాని ర్యాలీకి వెళుతున్న ఓ స్కూలు బస్సు కాంగ్రా జిల్లా జవాలీ ప్రాంతంలో అదుపు తప్పి పల్టీ కొట్టింది. ఈ ఘటనలో బస్సు నుజ్జునుజ్జు కావడంతో అందులోని 35 మంది కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ విద్యార్థులు గాయపడ్డారు. దీంతో అధికారులు వీరిని హుటాహుటిన సమీపం లోని ఆసుపత్రికి తరలించారు. కాగా, వీరిలో ఐదుగురు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
ఒడిశాలో ‘రైతుబంధు’
భువనేశ్వర్: రైతులకు అండగా నిలిచేందుకు ఒడిశా ప్రభుత్వం ఓ భారీ పథకాన్ని ప్రారంభించింది. రైతులకు పెట్టుబడి వ్యయం, భూముల్లేని వారికి వ్యవసాయ అనుబంధ రంగాల్లో ప్రోత్సాహం, వృద్ధాప్యం, అంగవైకల్యం తదితర కారణాలతో వ్యవసాయం చేయలేని స్థితిలో ఉన్న రైతులకు ఆర్థిక సహాయం తదితరాలు ఈ పథకంలో ఉన్నాయి. కలియా (కృషక్ అసిస్టెన్స్ ఫర్ లైవ్లీహుడ్ అండ్ ఇన్‌కం ఆగ్మెంటేషన్) పేరుతో కొత్త పథకాన్ని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ శుక్రవారం మంత్రివర్గ సమావేశం అనంతరం ప్రకటించారు. ఈ పథకం కింద 2020–21 ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి రూ. 10,180 కోట్లను ఒడిశా ప్రభుత్వం ఖర్చు చేయనుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న రుణమాఫీ హామీలు అర్థరహితమని నవీన్ పట్నాయక్ అన్నారు. రుణమాఫీ కన్నా తమ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకంతోనే రైతులకు ఎక్కువ లబ్ధి చేకూరుతుందనీ, అధిక శాతం మందికి ప్రయోజనాలు చేకూరుతాయని ఆయన తెలిపారు. ఒడిశాలో దాదాపు 32 లక్షల మంది రైతులుంటే కేవలం 20 లక్షల మందే పంటరుణాలను తీసుకున్నారనీ, రుణమాఫీ ప్రకటిస్తే మిగిలిన 12 లక్షల మందికి ప్రయోజనం ఉండదనీ, తమ కలియా పథకం మాత్రం 30 లక్షల మంది రైతులకు ప్రయోజనం కలిగిస్తుందని పట్నాయక్ వివరించారు. ఇవీ పథకం ప్రయోజనాలు ► భూ విస్తీర్ణంతో నిమిత్తం లేకుండా వ్యవసాయం చేసే ప్రతీ కుటుంబానికి ఒక్కో సీజన్లో (ఖరీఫ్, రబీ) పెట్టుబడి కోసం రూ. 5,000 ఆర్థిక సాయం. కౌలు రైతులు కూడా ఈ మొత్తం పొందడానికి అర్హులే. ► గొర్రెలు, కోళ్లు, బాతులు, తేనెటీగల పెంపకం దార్లకు, చేపలు పట్టే వారికి అవసరమైన సామగ్రిని సమకూర్చుకునేందుకు రూ. 12,500 ఆర్థిక సాయం. భూమి లేని వారే ఇందుకు అర్హులు. వీటిలో ఏదో ఒక దాన్నే ఎంచుకోవాలి. ► వృద్ధాప్యం, అంగవైకల్యం, రోగాలు తదితర కారణాల వల్ల వ్యవసాయం చేయలేకపోతున్న రైతులకు ఒక్కో ఇంటికి ఏడాదికి రూ. 10 వేల ఆర్థిక సాయం. లబ్ధిదారులను గ్రామ పంచాయతీలు ఎంపిక చేస్తాయి. ► భూమి ఉన్న, లేని రైతులనే భేదం లేకుండా అందరికీ రూ. 2 లక్షల జీవిత బీమా, మరో రూ. 2 లక్షల ప్రమాద బీమా ► 50 వేల వరకు రుణాలపై వడ్డీ ఉండదు. జార్ఖండ్‌లోనూ కొత్త పథకం ఒడిశా తరహాలోనే జార్ఖండ్‌లోనూ ఓ పథకాన్ని రైతుల కోసం సీఎం రఘుబర్‌దాస్ శుక్రవారం ప్రారంభించారు. ఈ పథకం కింద రూ. 2,250 కోట్లను ఖర్చు చేయనుండగా, 22.76 లక్షల మంది చిన్న, సన్నకారు రైతులు లబ్ధి పొందనున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి రైతులకు ప్రభుత్వం ఏడాదికి రూ. 5,000 ఆర్థిక సాయం అందజేయనుంది. గరిష్టంగా ఐదెకరాల వరకు భూమి ఉన్న రైతులు ఈ సాయం పొందేందుకు అర్హులు. రైతులు విత్తనాలు, ఎరువులు, తదితరాలను సమకూర్చుకునేందుకు ఈ పథకం సాయపడుతుంది. -
10 రోజుల్లో రైతు రుణమాఫీ
పఖన్‌జోర్/రాజ్‌నందన్‌గావ్: ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ అధికారంలోకొస్తే 10 రోజుల్లోనే రైతుల రుణాలను మాఫీ చేస్తుందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించారు. రైతులకు బోనస్ ఇస్తామన్నారు. త్వరలో ఎన్నికలు జరగనున్న చత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లా పఖన్‌జోర్, సీఎం సొంత నియోజకవర్గం రాజ్‌నందన్‌గావ్‌లలో శుక్రవారం జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో రాహుల్ ఈ హామీలిచ్చారు. ప్రధాని మోదీ, రాష్ట్ర సీఎం రమణ్ సింగ్‌కు పారిశ్రామిక వేత్తలే దగ్గరి స్నేహితులంటూ రాహుల్∙విమర్శించారు. ‘ ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌లకు స్నేహితులైన బడా పారిశ్రామిక వేత్తలు, వ్యాపారవేత్తలే ఈ ప్రాంతంలోని అపార సహజ వనరులతో లాభపడుతున్నారు’ అని ఆరోపించారు. ‘జీఎస్టీ(వస్తు, సేవల పన్ను) అమలుతో బీజేపీ ప్రభుత్వం దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేసింది. నల్లధనం వెలికి తీస్తామంటూ పెద్ద నోట్లను రద్దు చేయడంతో సామాన్యులు కష్టాలకు గురయ్యారు’ అని పేర్కొన్నారు. నరేంద్ర మోదీ, రమణ్‌సింగ్ ఇద్దరూ బహిరంగంగానే అవినీతిలో కూరుకుపోయారన్నారు. నానమ్మ ఎన్నో నేర్పారు ఈ సందర్భంగా రాహుల్ తన నానమ్మ, మాజీ ప్రధాని ఇందిరాగాంధీని గుర్తుకు తెచ్చుకున్నారు. ‘ఇందిరాగాంధీజీ నాకు ఎన్నో విషయాలు నేర్పారు. సమాజంలోని పేదలు, బలహీన వర్గాల కోసం కృషి చేయాలనేది ఆమె కోరిక. ఆ మేరకు అణగారిన, బలహీన వర్గాల పక్షాన నిలబడతా. వారి హక్కుల కోసం పోరాడుతా. గిరిజనుల సంక్షేమం కోసం ఆమె ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. ఆమె కృషి వల్లనే బెంగాలీలు బస్తర్ ప్రాంతానికి వలస వచ్చారు’ అని తెలిపారు. ‘రాష్ట్రంలో జరిగిన రూ.5వేల కోట్ల చిట్‌ఫండ్ కుంభకోణం ఫలితంగా ఎందరో సామాన్యులు తీవ్రంగా నష్టపోయారు. అయినప్పటికీ, ఏ ఒక్కరిపైనా ప్రభుత్వం చర్య తీసుకోలేదు. ఎందుకు? ఆ చిట్‌ఫండ్ కంపెనీలన్నీ రమణ్‌సింగ్ స్నేహితులవి’ అని రాహుల్ ఆరోపించారు. పనామా పత్రాల కుంభకోణంతో సంబంధమున్న పాక్ మాజీ ప్రధాని షరీఫ్ జైలు శిక్ష అనుభవిస్తుండగా, అదే కేసులో ఆరోపణలున్న సీఎం కొడుకు అభిషేక్‌పై ఎలాంటి చర్యలు లేవు’ అని అన్నారు. మరోవైపు, రాహుల్ కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో ‘జన్ ఘోషణా పత్ర’ విడుదల చేశారు. ఇందులో రైతు రుణమాఫీతోపాటు స్వామినాథన్ కమిషన్ ప్రతిపాదనల ప్రకారం పంటలకు కనీస మద్దతు ధర కల్పిస్తామని హామీ ఇచ్చారు. -
‘రుణమాఫీ శాశ్వత పరిష్కారం కాదు’
న్యూఢిల్లీ: వ్యవసాయ రంగంలో ఎదురవుతున్న సంక్షోభాలకు రుణమాఫీ శాశ్వత పరిష్కారం కాదని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. 2019లో కేంద్రంలో అధికారంలోకి వస్తే వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామని కాంగ్రెస్ ప్రకటించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వ్యవసాయ రంగంలో విశేష సేవలు అందించినందుకుగాను ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎమ్మెస్ స్వామినాథన్‌కు ప్రైవేట్ సంస్థ ఐసీఎఫ్ఏ అగ్రికల్చర్ ప్రైజ్ ప్రకటించింది. శుక్రవారం ఇక్కడ జరిగిన కార్యక్రమంలో వెంకయ్య చేతుల మీదుగా అగ్రికల్చర్ ప్రైజ్ కింద లక్ష డాలర్ల బహుమతిని స్వామినాథన్‌కు అందజేశారు. అగ్రికల్చర్ ప్రైజ్‌ను మొదటిసారి అందుకున్న వ్యక్తి స్వామినాథన్ కావడం విశేషం. రైతుల సమస్యలపై పార్లమెంటు, రాజకీయ పార్టీలు, నీతి ఆయోగ్, మీడియా దృష్టి కేంద్రీకరించాలని వెంకయ్య సూచించారు. రుణ మాఫీ, ఉచిత విద్యుత్ వంటి పథకాలను తీసుకురావడం సరికాదన్నారు. ఒకసారి రైతుల రుణాలు మాఫీ చేయడం శాశ్వత పరిష్కారం కాదని పేర్కొన్నారు. రుణాలు ఇచ్చి తిరిగి కట్టవద్దని చెప్పే బ్యాంకులు ఉన్నాయా? అని ప్రశ్నించారు. శాశ్వత పరిష్కారాల కోసం శాస్త్రవేత్తలు, పాలసీ రూపకర్తలు దృష్టి కేంద్రీకరించాలని అన్నారు. -
జిల్లాలో నరకాసుర వధ
సాక్షి, నెల్లూరు: ఎన్నికల హామీని తుంగలో తొక్కి ముఖ్యమంత్రి చంద్రబాబు రుణమాఫీని సక్రమంగా అమలుచేయనందుకు నిరసనగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపుమేరకు పార్టీ శ్రేణులు గురువారం జిల్లాలో చంద్రబాబు దిష్టిబొమ్మలను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. సర్వేపల్లి నియోజకవర్గంలోని పొదలకూరు, టీపీ గూడూరు, ముత్తుకూరు మండలాల్లో కార్యకర్తలు చంద్రబాబు దిష్టిబొమ్మలు దహనం చేశారు. రైతులను వంచించిన బాబు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రైతులను, డ్వాక్రా మహిళలను మోసం చేసిన బాబుపై చీటింగ్ కేసులు నమోదుచేయాలని డిమాండ్ చేశారు. రుణ మోసంపై ఆగ్రహం మహ్మదాపురం(పొదలకూరు): మండలంలోని మహ్మదాపురం గ్రామంలో రైతులు గురువారం పంట, బంగారు రుణాలను పూర్తిగా మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. నరకాసురవధ పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దిష్టిబొమ్మను దహనం చేశారు. సూరాయపాళెంలో సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తాటిపర్తి లో రుణమాఫీపై ప్రభుత్వం ప్రకటించిన నిర్ణయాన్ని రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు. జాతీయ రహదారి దిగ్బంధం మనుబోలు: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీని సక్రమంగా అమలు చేయాలంటూ వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ పచ్చిపాల జయరామరెడ్డి ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు. వాహనాల రాకపోకలను అడ్డుకోవడంతో కొద్దిసేపు వాహనాలు బారులు తీరాయి. ముఖ్యమంత్రి చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పార్టీ నాయకుడు ఉపసర్పంచ్ దండు చంద్రశేఖర్‌రెడ్డి, నాయకులు చిట్టమూరు పద్మనాభరెడ్డి, అజయ్‌కుమార్‌రెడ్డి, కడివేటి చంద్రశేఖర్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి, రఘురామిరెడ్డి, సురేందర్‌రెడ్డి, ప్రవీణ్‌రెడ్డి, ప్రసాద్ గౌడ్, బాలకృష్ణారెడ్డి, అంకయ్యగౌడ్, శ్రీనివాసులురెడ్డి, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. సీఎం దిష్టిబొమ్మ దహనం ముత్తుకూరు:పిడతాపోలూరు వడ్డిపాళెం వద్ద వైఎస్సార్సీపీకి చెందిన రైతులు, డ్వాక్రా మహిళలు సీఎం దిష్టిబొమ్మను ఊరేగించి, దహనం చేశారు. సీఎం దిష్టిబొమ్మలను దహనం చేస్తే నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేస్తామని ఎస్సై మారుతీకృష్ణ హెచ్చరించారు. పిడతాపోలూరు, బ్రహ్మదేవి పంచాయతీకి చెందిన రైతులు, మహిళలు పాల్గొన్నారు. వంచించిన బాబు తోటపల్లిగూడూరు: ఎన్నికల ముందు ఓ మాట ఎన్నికల అనంతరం ఓ మరో మాట మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రైతులను నమ్మించి వంచించాడని ఈదూరుకి చెందిన పలువురు రైతులు వాపోయారు. చంద్రబాబునాయుడి రుణమాఫీ విధానాన్ని నీరసిస్తూ వైఎస్సార్సీపీ నాయకులు, రైతుల ఆధ్వర్యంలో మండలంలోని పలు గ్రామాల్లో నిరసన కార్యక్రమాలు జరి గాయి. ఈదూరులో భారీ ఎత్తున రైతులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టి సీఎం దిష్టి బొమ్మను దహనం చేశారు. రైతులు మాట్లాడుతూ ఎన్నికల ముందు రైతులందరి రుణాలను రద్దుచేస్తామని ప్రకటించిన చంద్రబాబు అధికారంలోకి రాగానే మాట మార్చాడన్నారు. కుటుంబంలో ఒక్కరికే రుణమాఫీ అంటే బ్యాంక్‌రుణాలు తీసుకున్న మిగిలిన కుటుంబ సభ్యులు ఆత్మహత్యలకు పాల్పడక తప్పదన్నారు. చంద్రబాబు హామీలు బూటకం వెంకటాచలం: చంద్రబాబు ఎన్నికల సందర్భంగా చేసిన రుణమాఫీ హామీలు బూటకమని జెడ్పీటీసీ సభ్యుడు వెంకటశేషయ్య అన్నారు. రైతులతో కలిసి మండల పరిషత్ కార్యాలయం వద్ద విలేకరులతో మాట్లాడారు. రైతురుణాల పేరుతో గద్దె ఎక్కిన చంద్రబాబు పూర్తి రుణమాఫీ నుంచి తప్పించుకునేందు శత విధాలా ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. కుటుంబానికి ఒకరికి రూ.1.5 లక్షలు, పొదుపు మహిళలకు గ్రూపులకు లక్ష ప్రకటించారని ఆయన ప్రకటనే మాఫీగా భావించి టీడీపీ నాయకులు గొప్పలు చెప్పు కోవడం సిగ్గు చేటన్నారు. ప్రజల పక్షాన వైఎస్సార్సీపీ నిలుస్తుందని చెప్పారు. శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి పాల్గొంటారన్నారు. మండల పరిషత్ ఉపాధ్యక్షుడు శ్రీధర్‌నాయుడు, వెంకటాచలం సర్పంచ్ మణెమ్మ, నాయకులు మందల పెంచలయ్య, తూమాటి వెంకటరామయ్య, ఆలూరు రామయ్య, పాశం రామయ్య పాల్గొన్నారు. -
రుణమా(ఫీ)య
కడప అగ్రికల్చర్ : చంద్రబాబునాయుడు ప్రకటించిన రుణమాఫీ రైతులకు శాపంగా మారింది. అధికారంలోకి వచ్చిన తర్వాత రుణమాఫీపై ఎటూతేల్చక పోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఏర్పడింది. ప్రభుత్వం తీరుతో జిల్లాలోని రైతులంతా అన్ని అర్హతలు కోల్పోయారు. ప్రతి యేటా ఎలాగోలా తిప్పలు పడి బ్యాంకుల నుంచి తీసుకున్న పంట రుణాలను తిరిగి చెల్లించే వారమని, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు వ్యవసాయ రుణాలు చెల్లించవద్దని పదేపదే చేసిన ప్రకటనలతో ఆశపడి అప్పులు చెల్లించకపోయే సరికి ఎన్నో రకాల అర్హతలు ఉండి కూడా వాటన్నింటిని కోల్పోయామని మదనపడుతున్నారు. గత ఏడాది తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించే వరకు కొత్త రుణాలు ఇచ్చేది లేదని బ్యాంకర్లు తెగేసి చెబుతున్నారు. దీంతో రైతులు పంటల సాగుకు కొత్త రుణాలు అందక, బయట కూడా దొరకక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం రుణమాఫీపై కమిటీ వేయడంతో ఇప్పట్లో రుణాలు ఇచ్చే అవకాశాలు లేకపోవడం, కమిటీ కూడా అందుకు తగ్గ నివేదికలు ఇవ్వకపోవడంతో రైతుల పరిస్థితి రెంటికి చెడ్డరేవడిలా తయారైంది. రైతులు తీసుకున్న రుణాలను ప్రభుత్వం రీషెడ్యూలు చేస్తామని చెబుతోంది. ఆ రీషెడ్యూలు చేసిన రుణాలకు సంబందించి కంతులను ఎవరు చెల్లించాలో ప్రభుత్వం భరోసా ఇవ్వకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రైతులకు గుదిబండగా రీ షెడ్యూలు : రైతులు తీసుకున్న పంట రుణాలను రీ షెడ్యూలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇది రైతులకు గుదబండగా మారనుంది. ఈ విధానంతో రైతులు బెంబేలెత్తుతున్నారు. రీ షెడ్యూలు అంటే తీసుకున్న అప్పును వాయిదాల పద్దతిలో చెల్లిస్తామని బ్యాంకుకు పత్రం రాయించడం. అదే విధంగా మారటోరియం అంటే మా పరిస్థితులు బాగలేవని, తీసుకున్న అప్పును ఒక ఏడాదిపాటు వాయిదా వేసుకుంటున్నట్లు బ్యాంకులకు రైతులు లిఖితపూరకంగా రిజిష్టర్ స్టాంపు పత్రాలలో రాసి ఇవ్వాల్సి ఉంటుందని బ్యాంకర్లు చెబుతున్నారు. ఇది రైతులకు శాపంగా మారనుంది. అన్ని అర్హతలు కోల్పోయారు : జిల్లాలోని రైతులు గత ఏడాది ఏప్రిల్ నెల నుంచి రుణాలను బ్యాంకుల నుంచి తీసుకున్నారు. ఆ ఏడాది నుంచి ఈ ఏడాది ఏప్పిల్ నెల వరకు తీసుకున్న రుణానికి గడువు ముగిసింది. అలాగే మరి కొందరు రైతులు మే, జూన్, జూలై నెలల్లో కూడా రుణం పొందారు. వారందరు ఇప్పుడు వడ్డీలేని రుణాలకు, పావలా వడ్డీకి, ఏడాది లోపల చెల్లించే రుణాలకు ఉన్న 7 శాతం రాయితీలను కోల్పోయారు. ఇప్పుడు రైతులు బ్యాంకుల్లో తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించాలంటే 11.25 శాతం వడ్డీతో అప్పులు చెల్లించాల్సిందే. జిల్లాలో గత ఖరీఫ్‌లో 5,59,493 మంది రైతులు రూ.4422.09 కోట్ల రుణాలు తీసుకున్నారు. ఈ రుణానికి రైతులు 7 శాతం వడ్డీతో ఈ మొత్తానికి నెలకు రూ. 26.29 కోట్లు, అదే 11.25 శాతం వడ్డీతో నెలకు రైతులు రూ. 42.25 కోట్లు చెల్లించాలని బ్యాంకర్లు చెబుతున్నారు. దీనికి అదనంగా సర్వీసు ట్యాక్సు, ఇతరత్రాలు కలుపుకుని మరో 2 శాతం వడ్డీ భారం పడుతుందని అంటున్నారు. బ్యాంకు గడప తొక్కలేని రైతన్నలు.. నోటీసులు సిద్ధం చేస్తున్న బ్యాంకర్లు : ఖరీఫ్ సీజను ప్రారంభమై నెల రోజలు గడచినా రుణమాఫీపై స్పష్టత రాకపోవడంతో రైతులు బ్యాంకుల నుంచి మళ్లీ రుణం తీసుకోలేని పరిస్థితులు నెలకొన్నాయి. మండల కేంద్రాలకు వెళ్లే రైతన్నలు బ్యాంకుల వైపు తొంగి చూడాలంటేనే జంకుతున్నారు. బ్యాంకర్లు రైతులు తీసుకున్న రుణాలకు నెలనెలా ఎంత వడ్డీ అవుతుంది, దానికి ఇతర ట్యాక్సులు ఎంత, అసలు వడ్డీ కలిపి మొత్తం ఎంత అవుతుందనే వివరాల చిట్టా తయారీలో అన్ని బ్యాంకుల సిబ్బంది నిమగ్నమయ్యారు. మరో వారం రోజుల్లో స్పష్టత రాకపోతే రుణం తీసుకున్న రైతులకు తాకట్టుపెట్టిన భూములను, బంగారాన్ని వేలం వేసేందుకు నోటీసులు సిద్ధం చేస్తున్నారు. -
మాఫీపై పిల్లిమొగ్గలు
వెంకటగిరిటౌన్: రైతుల రుణమాఫీపై సీఎం చంద్రబాబునాయుడు రోజుకో మాట మాట్లాడుతున్నారు. దీంతో అన్నదాతల్లో అయోమయం నెలకొంది. ఒకే ఒక్క సంతకంతో రైతుల తలరాతలు మార్చేలా రుణమాఫీ చేసి వారిని అప్పుల ఊబి నుంచి బయట పడేస్తానని సార్వత్రిక ఎన్నికల సందర్భంగా నిర్వహించిన ప్రచారంలో చంద్రబాబు గొప్పలు చెప్పారు. తీరా అధికారంలోకి వచ్చాక చంద్రబాబు పూటకో మాట మారుస్తున్నారు. తొలుత రుణమాఫీపై కమిటీ వేసి 45 రోజుల్లో నివేదిక రాగానే రుణమాఫీ చేస్తామనడం, ఆ తర్వాత రుణాల రీషెడ్యూల్ పల్లవి అందుకోవడం, ఇప్పుడు ఇంటికి ఒక రుణం మాత్రమే మాఫీ చేస్తామని చెబుతుండటంతో అన్నదాతలు లబోదిబోమంటున్నారు. బంగారు రుణాలమాఫీ ఊసే ఎత్తడం లేదు. దీంతో సేద్యం పెట్టుబడులకు ఎక్కడి నుంచి తేవాలో అన్నదాతలకు దిక్కుతోచడం లేదు. ఈ నేపథ్యంలో అధిక వడ్డీలకు అప్పులు చేయాల్సిన దుస్థితి నెలకొంది. రీషెడ్యూల్కు సానుకూలం రీషెడ్యూల్‌పై బుధవారం ఆర్బీఐ సంకేతాలు ఇవ్వడంతో తాజాగా రుణమాఫీ ప్రక్రియను వాయిదా వేసేందుకు వ్యవసాయానికి ఖర్చుపెట్టిన రుణాలను మాత్రమే మాఫీ అంటూ కొత్తపల్లవిని ప్రభుత్వం అందుకుందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరువు, వరదల ప్రభావం ఉన్న మండలాల్లో మాత్రమే రీషెడ్యూల్ చేసే అవకాశం ఉండటంతో తమ మండలం ఆ జాబితాలో ఉంటుందో లేదోననే అనుమానాలు నియోజకవర్గంలోని వెంకటగిరి, డక్కిలి, బాలాయపల్లి, సైదాపురం, కలువాయి, రాపూరు మండలాల రైతుల్లో తలెత్తాయి. అయినా రీషెడ్యూల్ చేసే రుణాలను దశలవారీగా తామే చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించకపోవడంపైనా చర్చ సాగుతోంది. ఇక వాయిదాలు మీద వాయిదాలు వేస్తూ ఆధార్‌కార్డులు, రేషన్‌కార్డులు, ఓటరు కార్డులు అంటూ పలు ధ్రువీకరణ పత్రాలను సేకరించి వాటిలో ఇంటినంబర్ ఆధారంగా ఇంటికో అప్పు మాత్రమే మాఫీ చేస్తారనే అనుమానాలను రైతులు వ్యక్తం చేస్తున్నారు. ఇక బంగారంపై తెచ్చుకున్న వ్యవసాయరుణాలపై ప్రభుత్వ చేతులేత్తేసినట్టేనని చంద్రబాబు బుధవారం వెల్లడించిన వివరాలతో రైతులు దిగాలు చెందుతున్నారు. -
‘బంగారు’ రుణమాఫీపై నీలినీడలు
ఉదయగిరి: రుణమాఫీ పేరుతో సార్వత్రిక ఎన్నికల్లో ఓట్లు కొల్లగొట్టి అధికారం దక్కించుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు హామీ అమలు విషయంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. రకరకాల షరతుల పేరుతో మాఫీకి తూట్లు పొడిచే ప్రయత్నం చేస్తున్నారు. అన్ని రకాల వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తానని చెప్పిన బాబు.. ఇప్పుడు కమిటీల పేరుతో కాలయాపన చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు తీరుకు నిరసనగా రైతులు ఆందోళనలకు సిద్ధమౌతున్నారు. మరోవైపు వ్యవసాయం కోసం బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టి తీసుకున్న రుణాల విషయంలో కిరికిరిపెట్టే ప్రయత్నం ఆరంభమైంది. అయితే ఎన్నికల సమయంలో మాత్రం మహిళలు, పురుషులు అనే ప్రస్తావన లేకుండా బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టిన రుణాలన్నింటిని రద్దు చేస్తామని టీడీపీ నేతలు ప్రచారం హోరెత్తించారు. ఇప్పుడు మాత్రం మహిళలు వ్యవసాయం కోసం బంగారం కుదువపెట్టి తీసుకున్న రుణాలు ఎన్ని ఉన్నాయో తేల్చాలని కమిటీకి ఆదేశాలిచ్చారు. ఈ క్రమంలో మహిళ పేరుతో నగలు కుదువపెట్టి తీసుకున్న పంటరుణాలకు మాత్రమే మాఫీని వర్తింపచేసే అవకాశముంద ని రైతులు ఆందోళన చెందుతున్నారు. సాధారణంగా రైతు కుటుంబాల్లో కుటుంబ యజమానులు మాత్రమే బ్యాంకుల్లో బంగారం కుదువపెట్టి రుణాలు తీసుకుంటారు. మహిళలు తీసుకోవడం చాలా అరుదుగా ఉంటుంది. దీనిని పరిగణలోకి తీసుకొని కిరికిరి చేసే ప్రయత్నం చేస్తున్నారని రైతులు అనుమానిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలల్లోనే రైతు కుటుంబాల మహిళలు ఎక్కువగా కుటుంబ పనుల్లో నిమగ్నమై ఉంటారు. బ్యాంకులకు వెళ్లి బంగారం తనఖాపెట్టి రుణాలు తీసుకునే పరిస్థితి చాలా తక్కువగా ఉంటుంది. ఈ విషయం ప్రభుత్వానికి స్పష్టంగా తెలిసినప్పటికీ.. రుణభారాన్ని తగ్గించుకునే ప్రయత్నంలో భాగంగా ఇలాంటి కుతంత్రాలకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తొలి కేబినెట్ సమావేశంలో బంగారంపై తీసుకున్న పంటు రుణాలను మాఫీ చేయాలని కొంతమంది మంత్రులు పట్టుబట్టగా, మరికొంతమంది దానిని వ్యతిరేకించారు. ఎన్నికల మేనిఫెస్టోలో బంగారంపై తీసుకున్న పంట రుణాలను రద్దుచేస్తామని స్పష్టంగా చెప్పినప్పటికీ...కేబినెట్లో ఈ డ్రామా నడవడంపై పలు అనుమానాలకు తావిస్తోంది. చంద్రబాబు కూడా ఈ అంశంపై స్పష్టమైన వివరణ ఇవ్వకుండా కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత చూద్దాంలే.. అనే రీతిలో వ్యవహరించడం పలు అనుమానాలకు తావి స్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా రూ.1 లక్ష లోపు తీసుకున్న రుణాలను మాఫీ చేయడంతో పాటు బంగారంపై తీసుకున్న రుణాలను కూడా మాఫీ చేస్తామని శుక్రవారం శాసనసభలో ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా చంద్రబాబు ప్రభుత్వం కమిటీ అంటూ కాలయాపన చేయకుండా మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా అన్ని రకాల షరతులు లేని రుణమాఫీని అమలుచేయాలని రైతులు కోరుతున్నారు. -
ఇంత మోసం చేస్తారనుకోలేదు
అనంతపురం రూరల్: ‘మాకు డ్వాక్రా సంఘాలే వద్దు. రుణాలు మాఫీ అని చెబితే మేము కట్టకుండా ఉన్నాము. రుణాలు మాఫీకి చంద్రబాబు నాయుడు, జగన్ ఇద్దరు మాట ఇచ్చారు. కచ్చితంగా మా రుణాలు మాఫీ అవుతాయి అనుకున్నాము కానీ ప్రభుత్వం, బ్యాంకు అధికారులు ఇంత మోసం చేస్తారని అనుకోలేదు. మాకు సంఘాలు వద్దు, మీ సలహాలు వద్దు, మా డబ్బులు మాకు వెనక్కి ఇచ్చేయండి’ అని చియ్యేడు స్వయం సహాయక సంఘాల మహిళలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాల్లోకెళితే... చియ్యేడు గ్రామంలోని ఉన్న సిండికేట్ బ్యాంకు వారు 45 డ్వాక్రా సంఘాల మహిళలు రుణాలు కంతు చెల్లించలేదని వారి పొదుపు సొమ్మును రుణ ఖాతాకు మళ్లించుకున్నారు. విషయం తెలుసుకున్న మహిళలు గురువారం మధ్యాహ్నం నుంచి రాత్రి ఏడున్నర వరకు దాదాపు ఐదు గంటలపాటు బ్యాంకు మేనేజర్ సుధాకర్‌రాజును నిర్బంధించారు. ఉదయాన్నే సమస్య పరిష్కరిస్తామని చెప్పి మహిళలను శాంతపరిచారు. బ్యాంకు మేనేజర్ సుధాకర్‌రాజు, ఇటులకపల్లి ఎస్ఐ శివగంగాధర్‌రెడ్డిల హామీ మేరకు శుక్రవారం మూడు గంటల వరకు మహిళలు సిండికేట్ బ్యాంకు వద్దే వేచి చూశారు. సిండికేట్ బ్యాంకు జిల్లా డిప్యూటీ మేనేజర్ రావాల్సి ఉండగా ఆయన స్థానంలో సీనియర్ మేనేజర్ రామ్‌ప్రసాద్‌రెడ్డి వచ్చారు. ఐదు గంటలు గడుస్తున్నా అధికారుల నుంచి ఏలాంటి హామీ రాకపోవడంతో మహిళ సంఘాల సభ్యులు మరింత రెచ్చిపోయారు. బ్యాంకు ముందే బైఠాయించి అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారకుండా ఉండేందుకు మహిళలను చెదరగొట్టేందుకు పోలీసులు చేసిన ప్రయత్నం ఫలించలేదు. దీంతో బ్యాంకు అధికారులు జిల్లా అధికారులను సంప్రదించారు. వారి సూచన మేరకు రుణాలకు మళ్లించిన పొదుపు సొమ్మును డ్వాక్రా సంఘాల ఖాతాకు వీలైనంత త్వరగా జమ చేస్తామని, ఎవరికీ అన్యాయం చేయబోమని హామీ ఇవ్వడంతో మహిళలు శాంతించి ఆందోళన విరమించారు. -
బాబుకు ఎల్లో మీడియా వంత
-
బాబుకు ఎల్లో మీడియా వంత
* బాబు హామీలను మైమరిపించడమే లక్ష్యం * హామీలను అమలు చేయలేడంటూ ఇప్పట్నుంచే రంగం సిద్ధం చేస్తున్న ‘ఈనాడు’ సాక్షి, హైదరాబాద్: ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక చంద్రబాబు ప్రజల్లో చులక కాకుండా చూసేందుకు ఎల్లో మీడియా అప్పుడే రంగంలోకి దిగింది. బాబు త్వరలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో, ఆచరణ సాధ్యం కానీ హామీల అమలు నుంచి ప్రజల దృష్టి మళ్లిస్తూ, చుట్టుముట్టబోయే అపకీర్తి బారి నుంచి ఆయనను కాపాడటానికి తనదైన రీతిలో వంచనకు తెర తీసింది. ఒక మీడియాగా ఎన్నికల హామీలను నిలుపుకోవాలంటూ ప్రజల పక్షాన నిలబడాల్సింది పోయి బాబును కాపాడే ప్రయత్నంలో నిమగ్నమైంది. బలమైన ప్రతిపక్షంగా ఆవిర్భవించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేయడానికి ప్రజాస్వామ్యాన్నే ఖూనీ చేస్తూ బాబు కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతుంటే... ఈ ఎల్లో మీడియా అందుకు వంత పాడుతుండటం పక్కా వ్యూహంలో భాగమేనని తెలుస్తోంది. చంద్రబాబు తానిచ్చిన హామీలను ఎప్పుడు అమలు చేస్తారా అని ఎదురు చూస్తున్న ప్రజలను ఏమార్చడమే తక్షణ కర్తవ్యంగా ఎల్లో మీడియా వ్యవహరిస్తోంది. టీడీపీకి వంతపాడుతున్న ‘ఈనాడు’ సరిగ్గా 1997లో సంపూర్ణ మద్యనిషేధం ఎత్తివేత సందర్భంలో చేసిన మాదిరిగానే ఇప్పుడూ కథ నడుపుతోంది. మద్య నిషేధం ఎత్తివేత తరహాలోనే.. 1995లో దూబగుంటలో ఒక మహిళ ప్రారంభించిన సంపూర్ణ మద్య నిషేధ సామాజిక ఉద్యమాన్ని తన భుజానికెత్తుకున్న ‘ఈనాడు’ రాష్ట్రంలో ఒక ఉద్యమాన్నే కొనసాగించింది. ఎన్టీఆర్ సంపూర్ణ మద్య నిషేధాన్ని అమలు చేసేదాకా దాన్ని కొనసాగించింది. తీరా ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి చంద్రబాబు అధికారాన్ని చేజిక్కించుకోగానే అదే ‘ఈనాడు’ కొత్త పాట మొదలుపెట్టింది. సంపూర్ణ మద్య నిషేధంతో రాష్ట్రం ఆర్థికంగా దివాళా తీసిందంటూ నాలుక మడతేసింది. ఆ మేరకు రోజూ పుంఖానుపుంఖాలుగా కథనాలను వండి వార్చింది. మద్య నిషేధాన్ని ఎత్తేస్తే తప్ప రాష్ట్రానికి దిక్కు లేదంటూ దిక్కుమాలిన ప్రచారంతో బాబు పనిని సులభతరంచేసింది. ‘విధిలేకే చంద్రబాబు మద్య నిషేధాన్ని ఎత్తేస్తున్నారు’ అన్న దశకు తీసుకొచ్చింది. సంపూర్ణ మద్య నిషేధం వల్ల ఖజానాకు రూ.1,400 కోట్ల లోటు ఏర్పడుతోందని, ఆ డబ్బే ఉంటే ఎంతో అభివృద్ధి చేయొచ్చని నానా కథలూ అల్లింది. అలా సంపూర్ణ మద్య నిషేధాన్ని ఎత్తేసేదాకా తనరాతలను కొనసాగించింది. ఇప్పుడు కూడా సరిగ్గా అదే మాదిరి కథ మొదలుపెట్టింది. ఇటీవలి ఎన్నికల్లో బాబు అలవికాని హామీలెన్నో ఇచ్చినా వాటన్నింటికీ ‘ఈనాడు’ పూర్తిగా వత్తాసు పలికింది. బాబు సీఎం అయితేనే ఆ హామీలు సాధ్యమవుతాయంటూ పేజీలకు పేజీలు రాతలు రాసింది. ఆయన చెబుతున్న రైతుల రుణాల మాఫీ సాధ్యమేనంటూ రోజూ రాస్తూ వచ్చింది. అవేగాక డ్వాక్రా మహిళల రుణాల రద్దు, నిరుద్యోగ భృతి, ఇంటింటికో ఉద్యోగం, పెన్షన్ల వంటివన్నీ బాబు అమలు చేస్తారంటూ కథనాలు వండివార్చింది. అవిఆచరణ సాధ్యం కావని ఎవరైనా అంటే అంతెత్తున లేచింది. ఏం చేసైనా సరే, బాబును అధికార పీఠం ఎక్కించడమే ఏకైక అజెండాగా, ఫక్తు టీడీపీ పత్రిక స్థాయిలో బాకా ఊదింది. ఇప్పుడు బాబు అధికారంలోకి వస్తున్న నేపథ్యంలో ఇదే ‘ఈనాడు’ మరోసారి అచ్చం ఆనాటి తరహాలోనే ఆయనను హామీల గండం నుంచి గట్టెక్కించే పనిలో పడింది. ‘తొలి అడుగులు ఇబ్బందే...’ అంటూ ఒక రోజు, ‘బాబు ముందు ఎన్నో ఇబ్బందులున్నాయి’ అంటూ మరో రోజు... ఇలా రోజుకోటి చొప్పున కథనాలను వండి వారుస్తోంది. అలా తన వ్యూహాన్ని మెల్లిగా తెరపైకి తీసుకొస్తోంది. బాబు ఎటూ తానిచ్చిన హామీలనూ నెరవేర్చలేరు గనుక అనేకానేక సమస్యలే అందుకు కారణమంటూ ఇప్పటి నుంచే పాఠకుల మెదళ్లకు ఎక్కించేందుకు ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే వైఎస్సార్సీపీ నుంచి ఫిరాయింపులను ప్రోత్సహించేందుకు టీడీపీ చేస్తున్న నిస్సిగ్గు కుట్రలను కూడా అడ్డంగా సమర్థిస్తోంది. ‘వైఎస్సార్సీపీ నుంచి నేతలు జారుకుంటున్నారు’ అంటూ వాస్తవాలకు పచ్చ ముసుగేసి ఈనాడు సారథ్యంలోని ఎల్లో మీడియా ప్రచురిస్తోంది, చూపిస్తోంది. ఎన్నికల ఫలితాలు వెలువడిన తొమ్మిదో రోజునే ప్రజాస్వామ్యాన్ని నిలువునా ఖూనీ చేస్తూ ఇలా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న బాబు తలవంపుల వ్యవహారాన్ని అదేదో గొప్ప విజయమన్నట్టుగా అభివర్ణిస్తున్నాయి. టీడీపీలోకి మరికొందరు వెళ్లనున్నారన్న ఆ పార్టీ నేతల మైండ్‌గేమ్‌కు కూడా తెగ ప్రచారం కల్పిస్తున్నాయి. హామీల అమలులో విఫలమయ్యే వేళ బాబుకు పలుగురాళ్లతో నలుగు పెట్టడానికి వైఎస్సార్సీపీ బలమైన ప్రతిపక్షంగా ఉండకూడదనే కుటిలత్వంతో, ప్రజలను నట్టేట ముంచి మరీ బాబుకు వంతపాడుతున్న ఎల్లో మీడియా తీరు అందరికీ రోత పుట్టిస్తోంది.