
‘బంగారు’ రుణమాఫీపై నీలినీడలు
ఉదయగిరి: రుణమాఫీ పేరుతో సార్వత్రిక ఎన్నికల్లో ఓట్లు కొల్లగొట్టి అధికారం దక్కించుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు హామీ అమలు విషయంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. రకరకాల షరతుల పేరుతో మాఫీకి తూట్లు పొడిచే ప్రయత్నం చేస్తున్నారు. అన్ని రకాల వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తానని చెప్పిన బాబు.. ఇప్పుడు కమిటీల పేరుతో కాలయాపన చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు తీరుకు నిరసనగా రైతులు ఆందోళనలకు సిద్ధమౌతున్నారు.
మరోవైపు వ్యవసాయం కోసం బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టి తీసుకున్న రుణాల విషయంలో కిరికిరిపెట్టే ప్రయత్నం ఆరంభమైంది. అయితే ఎన్నికల సమయంలో మాత్రం మహిళలు, పురుషులు అనే ప్రస్తావన లేకుండా బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టిన రుణాలన్నింటిని రద్దు చేస్తామని టీడీపీ నేతలు ప్రచారం హోరెత్తించారు. ఇప్పుడు మాత్రం మహిళలు వ్యవసాయం కోసం బంగారం కుదువపెట్టి తీసుకున్న రుణాలు ఎన్ని ఉన్నాయో తేల్చాలని కమిటీకి ఆదేశాలిచ్చారు. ఈ క్రమంలో మహిళ పేరుతో నగలు కుదువపెట్టి తీసుకున్న పంటరుణాలకు మాత్రమే మాఫీని వర్తింపచేసే అవకాశముంద ని రైతులు ఆందోళన చెందుతున్నారు. సాధారణంగా రైతు కుటుంబాల్లో కుటుంబ యజమానులు మాత్రమే బ్యాంకుల్లో బంగారం కుదువపెట్టి రుణాలు తీసుకుంటారు. మహిళలు తీసుకోవడం చాలా అరుదుగా ఉంటుంది. దీనిని పరిగణలోకి తీసుకొని కిరికిరి చేసే ప్రయత్నం చేస్తున్నారని రైతులు అనుమానిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలల్లోనే రైతు కుటుంబాల మహిళలు ఎక్కువగా కుటుంబ పనుల్లో నిమగ్నమై ఉంటారు. బ్యాంకులకు వెళ్లి బంగారం తనఖాపెట్టి రుణాలు తీసుకునే పరిస్థితి చాలా తక్కువగా ఉంటుంది.
ఈ విషయం ప్రభుత్వానికి స్పష్టంగా తెలిసినప్పటికీ.. రుణభారాన్ని తగ్గించుకునే ప్రయత్నంలో భాగంగా ఇలాంటి కుతంత్రాలకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తొలి కేబినెట్ సమావేశంలో బంగారంపై తీసుకున్న పంటు రుణాలను మాఫీ చేయాలని కొంతమంది మంత్రులు పట్టుబట్టగా, మరికొంతమంది దానిని వ్యతిరేకించారు. ఎన్నికల మేనిఫెస్టోలో బంగారంపై తీసుకున్న పంట రుణాలను రద్దుచేస్తామని స్పష్టంగా చెప్పినప్పటికీ...కేబినెట్‌లో ఈ డ్రామా నడవడంపై పలు అనుమానాలకు తావిస్తోంది.
చంద్రబాబు కూడా ఈ అంశంపై స్పష్టమైన వివరణ ఇవ్వకుండా కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత చూద్దాంలే.. అనే రీతిలో వ్యవహరించడం పలు అనుమానాలకు తావి స్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా రూ.1 లక్ష లోపు తీసుకున్న రుణాలను మాఫీ చేయడంతో పాటు బంగారంపై తీసుకున్న రుణాలను కూడా మాఫీ చేస్తామని శుక్రవారం శాసనసభలో ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా చంద్రబాబు ప్రభుత్వం కమిటీ అంటూ కాలయాపన చేయకుండా మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా అన్ని రకాల షరతులు లేని రుణమాఫీని అమలుచేయాలని రైతులు కోరుతున్నారు.