
రుణమా(ఫీ)య
కడప అగ్రికల్చర్ : చంద్రబాబునాయుడు ప్రకటించిన రుణమాఫీ రైతులకు శాపంగా మారింది. అధికారంలోకి వచ్చిన తర్వాత రుణమాఫీపై ఎటూతేల్చక పోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఏర్పడింది.
ప్రభుత్వం తీరుతో జిల్లాలోని రైతులంతా అన్ని అర్హతలు కోల్పోయారు. ప్రతి యేటా ఎలాగోలా తిప్పలు పడి బ్యాంకుల నుంచి తీసుకున్న పంట రుణాలను తిరిగి చెల్లించే వారమని, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు వ్యవసాయ రుణాలు చెల్లించవద్దని పదేపదే చేసిన ప్రకటనలతో ఆశపడి అప్పులు చెల్లించకపోయే సరికి ఎన్నో రకాల అర్హతలు ఉండి కూడా వాటన్నింటిని కోల్పోయామని మదనపడుతున్నారు.
గత ఏడాది తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించే వరకు కొత్త రుణాలు ఇచ్చేది లేదని బ్యాంకర్లు తెగేసి చెబుతున్నారు. దీంతో రైతులు పంటల సాగుకు కొత్త రుణాలు అందక, బయట కూడా దొరకక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం రుణమాఫీపై కమిటీ వేయడంతో ఇప్పట్లో రుణాలు ఇచ్చే అవకాశాలు లేకపోవడం, కమిటీ కూడా అందుకు తగ్గ నివేదికలు ఇవ్వకపోవడంతో రైతుల పరిస్థితి రెంటికి చెడ్డరేవడిలా తయారైంది. రైతులు తీసుకున్న రుణాలను ప్రభుత్వం రీషెడ్యూలు చేస్తామని చెబుతోంది. ఆ రీషెడ్యూలు చేసిన రుణాలకు సంబందించి కంతులను ఎవరు చెల్లించాలో ప్రభుత్వం భరోసా ఇవ్వకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
రైతులకు గుదిబండగా రీ షెడ్యూలు :
రైతులు తీసుకున్న పంట రుణాలను రీ షెడ్యూలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇది రైతులకు గుదబండగా మారనుంది. ఈ విధానంతో రైతులు బెంబేలెత్తుతున్నారు. రీ షెడ్యూలు అంటే తీసుకున్న అప్పును వాయిదాల పద్దతిలో చెల్లిస్తామని బ్యాంకుకు పత్రం రాయించడం. అదే విధంగా మారటోరియం అంటే మా పరిస్థితులు బాగలేవని, తీసుకున్న అప్పును ఒక ఏడాదిపాటు వాయిదా వేసుకుంటున్నట్లు బ్యాంకులకు రైతులు లిఖితపూరకంగా రిజిష్టర్ స్టాంపు పత్రాలలో రాసి ఇవ్వాల్సి ఉంటుందని బ్యాంకర్లు చెబుతున్నారు. ఇది రైతులకు శాపంగా మారనుంది.
అన్ని అర్హతలు కోల్పోయారు :
జిల్లాలోని రైతులు గత ఏడాది ఏప్రిల్ నెల నుంచి రుణాలను బ్యాంకుల నుంచి తీసుకున్నారు. ఆ ఏడాది నుంచి ఈ ఏడాది ఏప్పిల్ నెల వరకు తీసుకున్న రుణానికి గడువు ముగిసింది. అలాగే మరి కొందరు రైతులు మే, జూన్, జూలై నెలల్లో కూడా రుణం పొందారు. వారందరు ఇప్పుడు వడ్డీలేని రుణాలకు, పావలా వడ్డీకి, ఏడాది లోపల చెల్లించే రుణాలకు ఉన్న 7 శాతం రాయితీలను కోల్పోయారు. ఇప్పుడు రైతులు బ్యాంకుల్లో తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించాలంటే 11.25 శాతం వడ్డీతో అప్పులు చెల్లించాల్సిందే. జిల్లాలో గత ఖరీఫ్‌లో 5,59,493 మంది రైతులు రూ.4422.09 కోట్ల రుణాలు తీసుకున్నారు. ఈ రుణానికి రైతులు 7 శాతం వడ్డీతో ఈ మొత్తానికి నెలకు రూ. 26.29 కోట్లు, అదే 11.25 శాతం వడ్డీతో నెలకు రైతులు రూ. 42.25 కోట్లు చెల్లించాలని బ్యాంకర్లు చెబుతున్నారు. దీనికి అదనంగా సర్వీసు ట్యాక్సు, ఇతరత్రాలు కలుపుకుని మరో 2 శాతం వడ్డీ భారం పడుతుందని అంటున్నారు.
బ్యాంకు గడప తొక్కలేని రైతన్నలు.. నోటీసులు సిద్ధం చేస్తున్న బ్యాంకర్లు :
ఖరీఫ్ సీజను ప్రారంభమై నెల రోజలు గడచినా రుణమాఫీపై స్పష్టత రాకపోవడంతో రైతులు బ్యాంకుల నుంచి మళ్లీ రుణం తీసుకోలేని పరిస్థితులు నెలకొన్నాయి. మండల కేంద్రాలకు వెళ్లే రైతన్నలు బ్యాంకుల వైపు తొంగి చూడాలంటేనే జంకుతున్నారు. బ్యాంకర్లు రైతులు తీసుకున్న రుణాలకు నెలనెలా ఎంత వడ్డీ అవుతుంది, దానికి ఇతర ట్యాక్సులు ఎంత, అసలు వడ్డీ కలిపి మొత్తం ఎంత అవుతుందనే వివరాల చిట్టా తయారీలో అన్ని బ్యాంకుల సిబ్బంది నిమగ్నమయ్యారు. మరో వారం రోజుల్లో స్పష్టత రాకపోతే రుణం తీసుకున్న రైతులకు తాకట్టుపెట్టిన భూములను, బంగారాన్ని వేలం వేసేందుకు నోటీసులు సిద్ధం చేస్తున్నారు.