సాక్షి ప్రతినిధి, కడప: ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేయడం అసాధ్యమేనా? ముందు వచ్చిన చెవుల కంటే వెనుక వచ్చిన కొమ్ములు వాడి అన్నట్లుగా టీడీపీ అధినేత చంద్రబాబు వ్యవహరించడమే ఇందుకు కారణమా? పార్టీ ఆవిర్భావం నుంచి అంటి పెట్టుకుని ఉన్న తెలుగుతమ్ముళ్లను వేదనకు గురిచేస్తున్నారా? అనే ప్రశ్నలకు ఔను అనే విశ్లేషకులు సమాధానం ఇస్తున్నారు. విధేయతతో నిమిత్తం లేకుండా స్థాయిని బట్టి ఆపైనున్న నేతలు అణచివేస్తున్నారని పలువురు చెప్పుకొస్తున్నారు. వెరసి జిల్లాలో టీడీపీ కూసాలు కదులుతున్నాయి.
అధినేత వైఖరిపై మండిపడుతూ జిల్లా నేతలు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ జెండా మోసిన కార్యకర్తకు అదే జెండా అండగా ఉంటుందన్నది పాత మాట. కార్యకర్తల ఉన్నతి కాంక్షించే ఆ పార్టీలో ఇపుడు ‘పొడుగు చేతుల పందేరం’గా వ్యవహారం నడుస్తోందని సీనియర్ నేతలు వాపోతున్నారు. విధేయులు, అవకాశవాదులను ఓకే గాటన కట్టేస్తున్నారనే ఆవేదనతో రగలిపోతున్నారు. కష్టపడ్డ వారికి గుర్తింపు అటుంచితే ఏకంగా పార్టీ నుంచి వెళ్లగొట్టే చర్యలకు పాల్పడుతున్నారు. ఆవిర్భావం నుంచి టీడీపీని అంటిపెట్టుకున్న నేతలు సైతం పార్టీ మారే యోచనలో ఉన్నట్లు సమాచారం.
గరం గరంగా మాజీ ఎమ్మెల్యే రమేష్‌రెడ్డి
పదేళ్ల పాటు రాయచోటి నియోజకవర్గ ఇన్‌చార్జిగా, ఇరవై ఐదేళ్లు టీడీపీ నేతగా మాజీ ఎమ్మెల్యే రమేష్‌కుమార్‌రెడ్డి ఆ పార్టీలో సేవలందిస్తున్నారు. తాజాగా ఈమారు టికెట్ ఇచ్చేది లేదని తేల్చి చెప్పడంతో తీవ్ర ఆవేదనకు గురయ్యారు. వ్యక్తిగతంగా అధినేత చంద్రబాబుతో సమావేశపర్చమని రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడును కోరినా ఫలితం లేకుండా పోయింది. దాంతో తీవ్ర ఆక్రోశానికి గురయ్యారని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. పార్టీ కోసం ఇంతకాలం సేవలు పొంది ఎన్నికలు సమీపించినపుడు మొండిచేయి చూపుతారా? కనీసం పర్సనల్‌గా మాట్లాడే అవకాశం కూడా ఇవ్వరా? ఇలాంటి పార్టీ కోసం తాను ఇంకా పనిచేయాలా అంటూ రమేష్‌రెడ్డి రగిలిపోతున్నట్లు సమాచారం.
ఆ మేరకే మండలాలవారీగా నాయకులు, కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. వాస్తవ పరిస్థితులను వివరిస్తూ వారి మద్దతు కోరుతున్నారు. ఆయనకు లక్కిరెడ్డిపల్లె మండల టీడీపీ నాయకులు మూకుమ్మడిగా మద్దతు తెలిపారు. ఇన్‌చార్జి రమేష్‌రెడ్డి అభ్యర్థిత్వం ఖరారు చేయాలని అలా చేయని పక్షంలో తమ రాజీనామాలు స్వీకరించాలని ఆల్టిమేటం జారీ చేశారు. రాయచోటి నియోజకవర్గ వ్యాప్తంగా నాయకుల మద్దతు కోరుతున్న రమేష్‌రెడ్డి సైతం ఇక ఉపేక్షించరాదనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అవసరమైతే జిల్లాలో టీడీపీ భూస్థాపితానికి శాయశక్తులా కృషి చేయాలనే దిశగా సన్నిహితులతో మంతనాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.
లింగారెడ్డిని కనుమరుగు చేసిన అధిష్టానం
ప్రొద్దుటూరు అసెంబ్లీ టీడీపీ అభ్యర్థిగా నాలుగుసార్లు పోటీచేసిన మల్లెల లింగారెడ్డి ఒక్కసారి విజయం సాధించారు. అప్పటి ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డితో తలపడుతూనే జిల్లా అధ్యక్షుడిగా పలుమార్లు సేవలందించారు. 2009లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఈమారు ఆశావహుల్లో ఒకరైన నంద్యాల వరదరాజులరెడ్డి అభ్యర్థిత్వంపై ఆయన ఆక్షేపణ వ్యక్తం చేశారు.
పార్టీలో చేరకుండానే టీడీపీ టికెట్ ఎలా అడుగుతారని నిలదీస్తూనే, ఆయనకే టికెట్ ఇస్తే పార్టీని నమ్ముకున్న తమలాంటి వారు సన్యాసం స్వీకరించాల్సి ఉంటుందని పరోక్ష హెచ్చరిక చేశారు. అంతే, ఏకంగా జిల్లా అధ్యక్ష పదవి నుంచి సైతం తప్పించారు. ఆ స్థానంలో పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డిని కూర్చోబెట్టారు. కష్టకాలంలో టీడీపీకి సేవలందించిన తనను తప్పించడాన్ని మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి జీర్ణించుకోలేకున్నారు. సరైన సమయంలో స్పందించాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
పుత్తాకు వీరశివా సెగలు
కమలాపురం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జిగా పుత్తా నరసింహారెడ్డి పదహారేళ్లుగా కొనసాగుతున్నారు. మూడు పర్యాయాలు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. మరోమారు ప్రజాతీర్పు కోరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అప్పటి నుంచి పుత్తాకు వీరశివా సెగలు తాకుతున్నాయి. తాజాగా మరోమారు కమలాపురం అభ్యర్థిత్వంపై ఐవీఆర్ ఫోన్ కాల్స్ రూపంలో ఇరువురు పేర్లపై టీడీపీ నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టడం విశేషం.
ఈ వ్యవహారం వెనుక జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి ప్రమేయం ఉన్నట్లు పుత్తా వర్గీయులు విశ్వసిస్తున్నారు. మూడు సార్లు పోటీ చేసి పార్టీ ఉన్నతి కోసం పనిచేస్తున్న తనని కాదని, అవకాశవాదుల్ని తెరపైకి తెస్తారా? అని పుత్తా మండిపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రొద్దుటూరు, కడప, కమలాపురం నియోజకవర్గాల్లో శ్రీనివాసులరెడ్డి ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తున్నారనే ఆవేదనను తెలుగుతమ్ముళ్లు వ్యక్తం చేస్తున్నారు. కడప పార్లమెంటు, అసెంబ్లీ ఎక్కడి నుంచైనా సరే శ్రీనివాసులరెడ్డి కుటుంబం పోటీ చేస్తే, ఓడించాలనే దిశగా స్వంత అన్న రమేష్‌రెడ్డి సైతం మండిపడుతోన్నట్లు పలువురు చెప్పుకొస్తుండటం విశేషం.
రెడ్యంకు దక్కని ప్రాధాన్యత
మైదుకూరు నియోజకవర్గంలో రాష్ట్ర కార్యనిర్వాహక మాజీ కార్యదర్శి రెడ్యం సోదరుల పరిస్థితి కూడా పై వారికి భిన్నంగా ఏమీ లేదు. ఇన్‌చార్జి పుట్టా సుధాకర్ యాదవ్ పార్టీలో సీనియారిటీ ఉన్న నాయకుల్ని కనుమరుగు చేయాలనే ఎత్తుగడల్లో భాగంగా వారిని పక్కకు తప్పిస్తున్నట్లు సమాచారం. టీడీపీ ఆవిర్భావం నుంచి పనిచేసిన రెడ్యం సోదరులకు పార్టీలో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడిందని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment