Mallela Lingareddy
-
పార్టీ కోసం ఇంత కష్టపడితే.. మాకిచ్చే గౌరవం ఇదేనా!
సాక్షి ప్రతినిధి, కడప: ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేయడం అసాధ్యమేనా? ముందు వచ్చిన చెవుల కంటే వెనుక వచ్చిన కొమ్ములు వాడి అన్నట్లుగా టీడీపీ అధినేత చంద్రబాబు వ్యవహరించడమే ఇందుకు కారణమా? పార్టీ ఆవిర్భావం నుంచి అంటి పెట్టుకుని ఉన్న తెలుగుతమ్ముళ్లను వేదనకు గురిచేస్తున్నారా? అనే ప్రశ్నలకు ఔను అనే విశ్లేషకులు సమాధానం ఇస్తున్నారు. విధేయతతో నిమిత్తం లేకుండా స్థాయిని బట్టి ఆపైనున్న నేతలు అణచివేస్తున్నారని పలువురు చెప్పుకొస్తున్నారు. వెరసి జిల్లాలో టీడీపీ కూసాలు కదులుతున్నాయి. అధినేత వైఖరిపై మండిపడుతూ జిల్లా నేతలు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ జెండా మోసిన కార్యకర్తకు అదే జెండా అండగా ఉంటుందన్నది పాత మాట. కార్యకర్తల ఉన్నతి కాంక్షించే ఆ పార్టీలో ఇపుడు ‘పొడుగు చేతుల పందేరం’గా వ్యవహారం నడుస్తోందని సీనియర్ నేతలు వాపోతున్నారు. విధేయులు, అవకాశవాదులను ఓకే గాటన కట్టేస్తున్నారనే ఆవేదనతో రగలిపోతున్నారు. కష్టపడ్డ వారికి గుర్తింపు అటుంచితే ఏకంగా పార్టీ నుంచి వెళ్లగొట్టే చర్యలకు పాల్పడుతున్నారు. ఆవిర్భావం నుంచి టీడీపీని అంటిపెట్టుకున్న నేతలు సైతం పార్టీ మారే యోచనలో ఉన్నట్లు సమాచారం. గరం గరంగా మాజీ ఎమ్మెల్యే రమేష్‌రెడ్డి పదేళ్ల పాటు రాయచోటి నియోజకవర్గ ఇన్చార్జిగా, ఇరవై ఐదేళ్లు టీడీపీ నేతగా మాజీ ఎమ్మెల్యే రమేష్‌కుమార్‌రెడ్డి ఆ పార్టీలో సేవలందిస్తున్నారు. తాజాగా ఈమారు టికెట్ ఇచ్చేది లేదని తేల్చి చెప్పడంతో తీవ్ర ఆవేదనకు గురయ్యారు. వ్యక్తిగతంగా అధినేత చంద్రబాబుతో సమావేశపర్చమని రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడును కోరినా ఫలితం లేకుండా పోయింది. దాంతో తీవ్ర ఆక్రోశానికి గురయ్యారని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. పార్టీ కోసం ఇంతకాలం సేవలు పొంది ఎన్నికలు సమీపించినపుడు మొండిచేయి చూపుతారా? కనీసం పర్సనల్‌గా మాట్లాడే అవకాశం కూడా ఇవ్వరా? ఇలాంటి పార్టీ కోసం తాను ఇంకా పనిచేయాలా అంటూ రమేష్‌రెడ్డి రగిలిపోతున్నట్లు సమాచారం. ఆ మేరకే మండలాలవారీగా నాయకులు, కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. వాస్తవ పరిస్థితులను వివరిస్తూ వారి మద్దతు కోరుతున్నారు. ఆయనకు లక్కిరెడ్డిపల్లె మండల టీడీపీ నాయకులు మూకుమ్మడిగా మద్దతు తెలిపారు. ఇన్చార్జి రమేష్‌రెడ్డి అభ్యర్థిత్వం ఖరారు చేయాలని అలా చేయని పక్షంలో తమ రాజీనామాలు స్వీకరించాలని ఆల్టిమేటం జారీ చేశారు. రాయచోటి నియోజకవర్గ వ్యాప్తంగా నాయకుల మద్దతు కోరుతున్న రమేష్‌రెడ్డి సైతం ఇక ఉపేక్షించరాదనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అవసరమైతే జిల్లాలో టీడీపీ భూస్థాపితానికి శాయశక్తులా కృషి చేయాలనే దిశగా సన్నిహితులతో మంతనాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. లింగారెడ్డిని కనుమరుగు చేసిన అధిష్టానం ప్రొద్దుటూరు అసెంబ్లీ టీడీపీ అభ్యర్థిగా నాలుగుసార్లు పోటీచేసిన మల్లెల లింగారెడ్డి ఒక్కసారి విజయం సాధించారు. అప్పటి ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డితో తలపడుతూనే జిల్లా అధ్యక్షుడిగా పలుమార్లు సేవలందించారు. 2009లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఈమారు ఆశావహుల్లో ఒకరైన నంద్యాల వరదరాజులరెడ్డి అభ్యర్థిత్వంపై ఆయన ఆక్షేపణ వ్యక్తం చేశారు. పార్టీలో చేరకుండానే టీడీపీ టికెట్ ఎలా అడుగుతారని నిలదీస్తూనే, ఆయనకే టికెట్ ఇస్తే పార్టీని నమ్ముకున్న తమలాంటి వారు సన్యాసం స్వీకరించాల్సి ఉంటుందని పరోక్ష హెచ్చరిక చేశారు. అంతే, ఏకంగా జిల్లా అధ్యక్ష పదవి నుంచి సైతం తప్పించారు. ఆ స్థానంలో పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డిని కూర్చోబెట్టారు. కష్టకాలంలో టీడీపీకి సేవలందించిన తనను తప్పించడాన్ని మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి జీర్ణించుకోలేకున్నారు. సరైన సమయంలో స్పందించాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. పుత్తాకు వీరశివా సెగలు కమలాపురం నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జిగా పుత్తా నరసింహారెడ్డి పదహారేళ్లుగా కొనసాగుతున్నారు. మూడు పర్యాయాలు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. మరోమారు ప్రజాతీర్పు కోరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అప్పటి నుంచి పుత్తాకు వీరశివా సెగలు తాకుతున్నాయి. తాజాగా మరోమారు కమలాపురం అభ్యర్థిత్వంపై ఐవీఆర్ ఫోన్ కాల్స్ రూపంలో ఇరువురు పేర్లపై టీడీపీ నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టడం విశేషం. ఈ వ్యవహారం వెనుక జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి ప్రమేయం ఉన్నట్లు పుత్తా వర్గీయులు విశ్వసిస్తున్నారు. మూడు సార్లు పోటీ చేసి పార్టీ ఉన్నతి కోసం పనిచేస్తున్న తనని కాదని, అవకాశవాదుల్ని తెరపైకి తెస్తారా? అని పుత్తా మండిపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రొద్దుటూరు, కడప, కమలాపురం నియోజకవర్గాల్లో శ్రీనివాసులరెడ్డి ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తున్నారనే ఆవేదనను తెలుగుతమ్ముళ్లు వ్యక్తం చేస్తున్నారు. కడప పార్లమెంటు, అసెంబ్లీ ఎక్కడి నుంచైనా సరే శ్రీనివాసులరెడ్డి కుటుంబం పోటీ చేస్తే, ఓడించాలనే దిశగా స్వంత అన్న రమేష్‌రెడ్డి సైతం మండిపడుతోన్నట్లు పలువురు చెప్పుకొస్తుండటం విశేషం. రెడ్యంకు దక్కని ప్రాధాన్యత మైదుకూరు నియోజకవర్గంలో రాష్ట్ర కార్యనిర్వాహక మాజీ కార్యదర్శి రెడ్యం సోదరుల పరిస్థితి కూడా పై వారికి భిన్నంగా ఏమీ లేదు. ఇన్చార్జి పుట్టా సుధాకర్ యాదవ్ పార్టీలో సీనియారిటీ ఉన్న నాయకుల్ని కనుమరుగు చేయాలనే ఎత్తుగడల్లో భాగంగా వారిని పక్కకు తప్పిస్తున్నట్లు సమాచారం. టీడీపీ ఆవిర్భావం నుంచి పనిచేసిన రెడ్యం సోదరులకు పార్టీలో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడిందని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. -
ప్రొద్దుటూరు టీడీపీలో రచ్చ రచ్చ.. వెన్నుపోటుకు సిద్ధంగా ఆ వర్గాలు
సాక్షి, కడప: ప్రొద్దుటూరు టీడీపీలో మరోమారు వర్గపోరు రోడ్డెక్కింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ టిక్కెట్ వ్యవహారం ఈ రచ్చకు వేదికగా మారింది. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ తనకేనంటూ ప్రస్తుత ప్రొద్దుటూరు నియోజకవర్గ ఇన్చార్జి ప్రవీణ్‌కుమార్‌రెడ్డి వర్గం పేర్కొంటోంది. ఇటీవలే టీడీపీ అధినేత చంద్రబాబును ప్రవీణ్‌కుమార్‌రెడ్డి కలిశారు. నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిని వివరించారు. తన ఆధ్వర్యంలో జరిగిన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని తెలియజేశారు. వచ్చే ఎన్నికల్లో తనకే అభ్యర్థిగా అవకాశం కల్పించాలంటూ విజ్ఞప్తి చేశారు. పార్టీలో వర్గ విబేధాలపైనా చర్చించినట్లు సమాచారం. చంద్రబాబు ఏం చెప్పారో తెలియదు గానీ ఈ దఫా ఎన్నికల్లో టీడీపీ టిక్కెట్ తనకే అంటూ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి నియోజకవర్గంలోని తన అనుయాయులకు సమాచారం అందించారు.ఈ విషయంలో చంద్రబాబు స్పష్టత ఇచ్చారని, మనమే పోటీలో ఉంటామంటూ ప్రకటించారు. ప్రవీణ్ సూచనలతో ప్రొద్దుటూరులో ఆయన వర్గం బాణాసంచా పేల్చి సంబరాలు జరుపుకుంది. ఇది జీర్ణించుకోలేని పార్టీ జిల్లా అధ్యక్షులు లింగారెడ్డి, ఆయన వర్గం భగ్గుమంటోంది. నూటికి లక్ష సార్లు నాకే టిక్కెట్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా ఉన్న మల్లెల లింగారెడ్డి పార్టీ అధిష్టానం ప్రొద్దుటూరు టిక్కెట్ ఇంకా ఎవరికీ ఖరారు చేయలేదంటూ నాలుగు రోజుల కిందట హడావుడిగా వీడియో రిలీజ్ చేశారు. ప్రవీణ్‌కుమార్‌రెడ్డికి టిక్కెట్ కేటాయించలేదని, ఆ మేరకు చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని లింగారెడ్డి స్పష్టం చేశారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు, ఎన్టీఆర్ అభిమానులు ఎవరూ గందరగోళానికి గురి కావద్దని ఆయన తెలిపారు. ప్రొద్దుటూరు అభ్యర్థిత్వం ఖరారుకు చాలా సమయం పడుతుందని, అందరి అభిప్రాయం తీసుకున్న తర్వాతే అభ్యర్థి ఖరారు ప్రకటన ఉంటుందన్నారు. అంతటితో ఊరుకోకుండా రెండు రోజుల క్రితం ప్రొద్దుటూరు లింగారెడ్డి ప్రెస్‌మీట్ కూడా పెట్టారు. నూటికి లక్ష శాతం పార్టీ తనకే టిక్కెట్ కేటాయిస్తుందని చెప్పకనే చెప్పారు. ఆది నుంచి టీడీపీలో ఉన్నది తానేనన్నారు. తాను, తన కుటుంబం టీడీపీ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామని, తనకు కాకుండా పార్టీ ఎవరికి టిక్కెట్ ఇస్తుందని ప్రశ్నించారు. ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, లింగారెడ్డిలు రాబోయే ఎన్నికల్లో టిక్కెట్ తనకేనంటూ ఎవరికి వారు ప్రకటించుకుంటుండడంతో పార్టీ క్యాడర్లో అయోమయం నెలకొంది. లింగారెడ్డి ప్రకటనపై ప్రవీణ్‌కుమార్‌రెడ్డి వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి తనకే టిక్కెట్ అని ప్రకటించుకోవడంపై లింగారెడ్డి వర్గంతోపాటు వరదరాజులురెడ్డికి మద్దతు పలుకుతున్న మరోవర్గం ఆగ్రహంతో ఉంది. ప్రొద్దుటూరు టీడీపీ టిక్కెట్‌ను వీరు ఇద్దరే కాకుండా మాజీ ఎమ్మెల్యే వరద రాజులరెడ్డి, సీఎం సురేష్‌నాయుడు తదితరులు ఆశిస్తున్నారు. ఎవరికి వారు పావులు కదుపుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఒకరికొకరు మద్దతు పలికే పరిస్థితి లేదు. ఏ ఒక్కరికీ టిక్కెట్ ఖరారు చేసినా మిగిలిన వర్గాలు వెన్నుపోటుకు సిద్ధంగా ఉన్నాయి. మొత్తంగా ప్రొద్దుటూరు టీడీపీలో టిక్కెట్ రచ్చ మరోమారు రోడ్డెక్కింది. -
‘సీఎంను కలిశాం.. మంత్రులతో మనకేంటి’
‘సంక్రాంతి పండక్కి కోడిపందాలు వేయకుండా ఎవడ్రా మనల్ని ఆపేది. పండగ వరకు మీ ఇష్టమొచ్చినట్టు ఆడుకోండి.. నేను చూసుకుంటా..’ పందేల రాయుళ్లకు టీడీపీ ప్రజాప్రతినిధి ఇచ్చిన భరోసా ఇది. పౌర సరఫరాల శాఖ కార్పొరేషన్ చైర్మన్ మల్లెల లింగారెడ్డి నాలుగు రోజుల క్రితం ఏలూరు మార్కెట్ యార్డు ప్రాంగణంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఆయన వెంట జిల్లాకు చెందిన టీడీపీ ప్రజాప్రతినిధి కూడా ఉన్నారు. అక్కడ అధికారులతో మాట్లాడిన అనంతరం తిరిగి వెళ్తుండగా.. పౌర సరఫరాల శాఖ గోడౌన్ల పరిసరాల్లోని యువకులు వారి వద్దకు వచ్చారు. ‘సార్.. ఈసారి కోడిపందాల పరిస్థితి ఏమిటి. పోలీసులతో ఏమైనా ఇబ్బంది ఉంటుందా’ అని ఆ ప్రజాప్రతినిధిని అడిగారు. ఆయన ‘ఆడుకోండ్రా. ఫుల్లుగా ఎంజాయ్ చేయండి’ అని అభయం ఇచ్చేశారు. కోడిపందేలపై ఉక్కుపాదం మోపుతామని ఓ పక్క పోలీసు అధికారులు హెచ్చరికల మీద హెచ్చరికలు చేస్తుంటే.. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితి ఎలా ఉందనేందుకు ఆ ఘటనే నిదర్శనం. వాస్తవానికి ఆ ప్రజాప్రజానిధి ఇలాకాలో ఎప్పటి నుంచో కోడిపందాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. అక్కడే కాదు.. ఏలూరు నగరం చాటపర్రు రోడ్డులోని ఓ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధి షెడ్డులోనూ జోరుగా పందేలు నిర్వహిస్తున్నారు. భీమవరంలోని ప్రకృతి ఆశ్రమం ప్రాంతంలోను, రూరల్ మండలం వెంప, లోసరి, వీరవాసరం మండలం కొణితి వాడ, నౌడూరు జంక్షన్లలో భారీ ఎత్తున పందేలు నిర్వహించేందుకు బరులు సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కోడిపందేలు ఆడిన, ఆడించిన చరిత్ర ఉన్న నేతలను బైండోవర్ చేయాల్సిందిగా జిల్లా పోలీసు అధికారులు ఆదేశాలిస్తే.. ఆ నోటీసులను పందెగాళ్లకు ఇచ్చే ధైర్యం కూడా ఖాకీలు చేయలేకపోతున్నారు. సంప్రదాయాల ముసుగులో విష సంస్కృతికి బీజం వేస్తున్న అధికార పార్టీ నేతలను అడ్డుకునే దమ్ము, ధైర్యంలేని పరిస్థితి చూస్తుంటేనే.. ఈసారి కళ్లెం లేకుండా పందెంకోళ్లు విచ్చలవిడిగా ఎగురుతాయని అర్థమవుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పేందుకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సులో ఉన్నతాధికారులు విజయవాడకు తరలిరాగా, స్వయంగా చంద్రబాబే మన జిల్లాకు రావడంతో ఇక్కడ అధికారులు ఖుషీ అయ్యారు. శుక్రవారం సాయంత్రం వచ్చిన సీఎంను జిల్లా అధికారులు కలిసి శుభాకాంక్షలు చెప్పారు. ఇంతవరకు బాగానే ఉన్నా కొత్త సంవత్సరం తొలి రోజు జిల్లాకు చెందిన మంత్రులు పీతల సుజాత, పైడికొండల మాణిక్యాలరావును జిల్లాస్థాయి అధికారులెవరూ పట్టించుకోలేదు. తాడేపల్లిగూడెంలో ఉండే మాణిక్యాలరావు సీఎం పర్యటనలో పాల్గొనేందుకు ఏలూరు రావడంతో.. ఎదురుపడినప్పుడు మొక్కుబడి శుభాకాంక్షలు చెప్పిన అధికారులు ఇక్కడే నివాసముంటున్న పీతల సుజాత వద్దకు పలకరింపునకు కూడా వెళ్లలేదు. కలెక్టర్, డీఐజీ, ఎస్పీ, జాయింట్ కలెక్టర్‌తోపాటు.. చివరకు ఆర్డీవో కూడా మంత్రిని కూడా కలి సేందుకు రాలేదని పీతల వర్గీయులు మదనపడుతున్నారు. ఇతర జిల్లాల మంత్రులు వచ్చినప్పుడు హడావుడి చేసే అధికారులు జిల్లాలోని మంత్రులను జనవరి 1న మర్యాదపూర్వకంగా కలవకపోవడం చర్చనీయాంశంగా మారింది. దళిత మంత్రి కాబట్టే సుజాతను గౌరవించడం లేదని ఆమె వర్గీయులు, భాజపాకు చెందిన మంత్రి కాబట్టే పైడికొండలను పట్టించుకోవడం లేదని కమల నాథులు పేర్కొంటున్నారు. ఆ వర్గాల వాదనలు ఎలా ఉన్నా.. వారానికోసారి ముఖ్యమంత్రి జిల్లాకు వచ్చి నేరుగా అధికారులతోనే మాట్లాడుతుంటే.. మంత్రులకు ప్రొటోకాల్ ఏమిటన్న భావన అధికార వర్గాలకు వచ్చేసిందన్నది ఎవరు ఔనన్నా.. కాదన్నా తిరుగులేని వాస్తవం.