సాక్షి, కడప: ప్రొద్దుటూరు టీడీపీలో మరోమారు వర్గపోరు రోడ్డెక్కింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ టిక్కెట్ వ్యవహారం ఈ రచ్చకు వేదికగా మారింది. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ తనకేనంటూ ప్రస్తుత ప్రొద్దుటూరు నియోజకవర్గ ఇన్‌చార్జి ప్రవీణ్‌కుమార్‌రెడ్డి వర్గం పేర్కొంటోంది. ఇటీవలే టీడీపీ అధినేత చంద్రబాబును ప్రవీణ్‌కుమార్‌రెడ్డి కలిశారు. నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిని వివరించారు. తన ఆధ్వర్యంలో జరిగిన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని తెలియజేశారు.
వచ్చే ఎన్నికల్లో తనకే అభ్యర్థిగా అవకాశం కల్పించాలంటూ విజ్ఞప్తి చేశారు. పార్టీలో వర్గ విబేధాలపైనా చర్చించినట్లు సమాచారం. చంద్రబాబు ఏం చెప్పారో తెలియదు గానీ ఈ దఫా ఎన్నికల్లో టీడీపీ టిక్కెట్ తనకే అంటూ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి నియోజకవర్గంలోని తన అనుయాయులకు సమాచారం అందించారు.ఈ విషయంలో చంద్రబాబు స్పష్టత ఇచ్చారని, మనమే పోటీలో ఉంటామంటూ ప్రకటించారు. ప్రవీణ్ సూచనలతో ప్రొద్దుటూరులో ఆయన వర్గం బాణాసంచా పేల్చి సంబరాలు జరుపుకుంది. ఇది జీర్ణించుకోలేని పార్టీ జిల్లా అధ్యక్షులు లింగారెడ్డి, ఆయన వర్గం భగ్గుమంటోంది.
నూటికి లక్ష సార్లు నాకే టిక్కెట్
పార్టీ జిల్లా అధ్యక్షులుగా ఉన్న మల్లెల లింగారెడ్డి పార్టీ అధిష్టానం ప్రొద్దుటూరు టిక్కెట్ ఇంకా ఎవరికీ ఖరారు చేయలేదంటూ నాలుగు రోజుల కిందట హడావుడిగా వీడియో రిలీజ్ చేశారు. ప్రవీణ్‌కుమార్‌రెడ్డికి టిక్కెట్ కేటాయించలేదని, ఆ మేరకు చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని లింగారెడ్డి స్పష్టం చేశారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు, ఎన్టీఆర్ అభిమానులు ఎవరూ గందరగోళానికి గురి కావద్దని ఆయన తెలిపారు.
ప్రొద్దుటూరు అభ్యర్థిత్వం ఖరారుకు చాలా సమయం పడుతుందని, అందరి అభిప్రాయం తీసుకున్న తర్వాతే అభ్యర్థి ఖరారు ప్రకటన ఉంటుందన్నారు. అంతటితో ఊరుకోకుండా రెండు రోజుల క్రితం ప్రొద్దుటూరు లింగారెడ్డి ప్రెస్‌మీట్ కూడా పెట్టారు. నూటికి లక్ష శాతం పార్టీ తనకే టిక్కెట్ కేటాయిస్తుందని చెప్పకనే చెప్పారు. ఆది నుంచి టీడీపీలో ఉన్నది తానేనన్నారు. తాను, తన కుటుంబం టీడీపీ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామని, తనకు కాకుండా పార్టీ ఎవరికి టిక్కెట్ ఇస్తుందని ప్రశ్నించారు. ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, లింగారెడ్డిలు రాబోయే ఎన్నికల్లో టిక్కెట్ తనకేనంటూ ఎవరికి వారు ప్రకటించుకుంటుండడంతో పార్టీ క్యాడర్‌లో అయోమయం నెలకొంది.
లింగారెడ్డి ప్రకటనపై ప్రవీణ్‌కుమార్‌రెడ్డి వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి తనకే టిక్కెట్ అని ప్రకటించుకోవడంపై లింగారెడ్డి వర్గంతోపాటు వరదరాజులురెడ్డికి మద్దతు పలుకుతున్న మరోవర్గం ఆగ్రహంతో ఉంది. ప్రొద్దుటూరు టీడీపీ టిక్కెట్‌ను వీరు ఇద్దరే కాకుండా మాజీ ఎమ్మెల్యే వరద రాజులరెడ్డి, సీఎం సురేష్‌నాయుడు తదితరులు ఆశిస్తున్నారు. ఎవరికి వారు పావులు కదుపుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఒకరికొకరు మద్దతు పలికే పరిస్థితి లేదు. ఏ ఒక్కరికీ టిక్కెట్ ఖరారు చేసినా మిగిలిన వర్గాలు వెన్నుపోటుకు సిద్ధంగా ఉన్నాయి. మొత్తంగా ప్రొద్దుటూరు టీడీపీలో టిక్కెట్ రచ్చ మరోమారు రోడ్డెక్కింది.
Comments
Please login to add a commentAdd a comment