ప్రొద్దుటూరు టీడీపీలో గందరగోళం | - | Sakshi
Sakshi News home page

ప్రొద్దుటూరు టీడీపీలో గందరగోళం

Published Wed, Feb 7 2024 1:34 AM | Last Updated on Wed, Feb 7 2024 10:51 AM

- - Sakshi

సాక్షి ప్రతినిధి, కడప: ప్రొద్దుటూరు తెలుగుదేశం పార్టీలో గందరగోళం నెలకొంది. తెలుగుతమ్ముళ్లు తలోదారిలో ఉన్నారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు క్రమం తప్పకుండా ఒకరి తర్వాత మరొకరు తెరపైకి వస్తున్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎవరికి వారు అభ్యర్థిగా ప్రచారం చేసుకుంటున్నారు. అది చాలదన్నట్లు జిల్లా అధ్యక్షుడు లింగారెడ్డి, పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి మైండ్‌గేమ్‌ ఆడుతున్నారు. అధిష్టానం ఎలాంటి ప్రకటన చేయకముందే అభ్యర్థిగా పోస్టర్లు ఒకరు వేయిస్తే, టికెట్‌ మనదే, పోటీలో ఉండేది మనమే అంటూ మరొకరు వారి వారి నెట్‌వర్క్‌ ద్వారా ప్రచారపర్వాన్ని అందుకుంటున్నారు.

‘ఆలు లేదు.. చూలు లేదు.. కొడుకు పేరు సోమలింగం’అన్నట్లుగా ప్రొద్దుటూరు తెలుగుతమ్ముళ్ల పరిస్థితి నెలకొంది. ఓ వైపు టీడీపీ సొంతంగా పోటీ చేసే పరిస్థితి లేకపోగా, పొత్తుల సమీకరణ పనిలో అధినేత చంద్రబాబు నిమగ్నమ య్యారు. అధినేత ఆ పరిస్థితిలో ఉంటే నాయకులు ప్రొద్దుటూరులో టికెట్‌ తమదేనని ఎవరికి వారు తెరపైకి వస్తున్నారు. మాజీ ఎమ్మెల్యేలు నంద్యాల వరదరాజులరెడ్డి, మల్లెల లింగారెడ్డి, ఇన్‌చార్జి ప్రవీణ్‌కుమార్‌రెడ్డిలు ఇప్పటికే ప్రచారంలో నిమగ్నం కాగా, సోదరులమంతా అధినేతను కలిశాం. తుది జాబితాలో తానే ఉంటానంటూ సురేష్‌నాయుడు తెరచాటు మంత్రాంగం నిర్వహిస్తున్నారు. ఈక్రమంలో సీనియర్‌ నేత వరదరాజులరెడ్డితో వైరం లేకుండా జాగ్రత్త పడుతున్నట్లు పరిశీలకులు వెల్లడిస్తున్నారు.

వరదపై మల్లెల మండిపాటు
ఈమారు ఎన్నికల్లో తాను లేదా తన కుమారుడు కొండారెడ్డి పోటీలో ఉంటామని మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ప్రచారం కొనసాగిస్తున్నారు. బాబు ష్యూరిటీ, భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా పట్టణంలో పర్యటిస్తున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకునే అర్హత వరదరాజులరెడ్డికి లేదని జిల్లా అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి విమర్శిస్తున్నారు.

సభ్యత్వమే లేని వరద ఎలా ప్రచారం చేస్తారని మండిపడుతున్నారు. జిల్లా అధ్యక్షుడు లింగారెడ్డి మాటలు నిజమే అయితే, అధినేత చంద్రబాబు వద్దకెళ్లి వరద కుటుంబాన్ని పార్టీ నుంచి బహిష్కరించే చర్యలు చేపట్టవచ్చు కదా...అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. జిల్లా అధ్యక్షుడిగా పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి ఆహ్వానం లేకపోయినా నోరెత్తని లింగారెడ్డి, ఉనికి కోసం ఆరాట పడుతున్నారని వరద వర్గీయులు ఆరోపిస్తున్నారు. ఇలా ఎవరికి వారు ప్రచారం చేసుకుంటుండటంతో ప్రొద్దుటూరు తెలుగుదేశంలో గందరగోళం నెలకొంది. తలోదిక్కుగా తెలుగుతమ్ముళ్లు వ్యవహరిస్తుండటం విశేషం.

ప్రవీణ్‌కు వాసు వత్తాసు
పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి ప్రొద్దుటూరు ఇన్‌చార్జి ప్రవీణ్‌కుమార్‌రెడ్డికి వత్తాసుగా నిలుస్తున్నారు. ఆయన చర్యలే అందుకు దర్పణంగా నిలుస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రవీణ్‌కుమార్‌రెడ్డి పేరుతో ప్రొద్దుటూరులో పోస్టర్లు వెలిశాయి. నలుగురు ఆశావహులు ఉండటం, అధిష్టానం ప్రకటనతో నిమిత్తం లేకుండా రాత్రికి రాత్రి వాల్‌ పోస్టర్లు తెరపైకి రావడంతో తక్కిన వారు జీర్ణించుకోలేని పరిస్థితి తలెత్తింది. తాజాగా శ్రీనివాసులరెడ్డి ఏడాది క్రితమే నారా లోకేష్‌, ప్రవీణ్‌ నాయకత్వానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారని తేల్చి చెప్పారు. తాను సైతం పార్లమెంటు అభ్యర్థిగా ప్రకటించుకున్నారు.

రామేశ్వరం రోడ్డులో టీడీపీ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన ఈ విషయం చెప్పుకొచ్చారు. కాగా, ఆకార్యక్రమానికి స్థానికంగా నివాసం ఉంటున్న జిల్లా అధ్యక్షుడు లింగారెడ్డిని ఆహ్వానించకపోవడం గమనార్హం. ఇన్‌చార్జి ప్రవీణ్‌ చర్యలకు వత్తాసుగా నిల్చే విధంగా పొలిట్‌ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి చర్యలున్నాయని పరిశీలకులు వెల్లడిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement