సాక్షి ప్రతినిధి, కడప: శాంతిభద్రతలకు నిలయంగా, మత సామరస్యానికి ప్రతీకగా.. ప్రశాంతతకు మారుపేరుగా ఉన్న జిల్లా కేంద్రమైన కడపలో దౌర్జన్యకర ఘటనలు జరుగుతున్నాయి. ఏదో ఒకచోట టీడీపీ నాయకులు బెదిరింపులకు పాల్పడుతున్నారు. రెండు నెలల తర్వాత అధికారం మాదే, మేమేంటో చూపిస్తామంటూ అధికారులను సైతం బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు.ఒక్కమాటలో చెప్పాలంటే టీడీపీ శ్రేణులు గూండారాజ్‌ను మరిపిస్తున్నారు. ఇదివరకు ఎన్నడు లేనివిధంగా టీడీపీ ఇన్‌చార్జిగా ఆర్ మాధవీరెడ్డి నియామకమయ్యాక ప్రత్యక్ష ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.
తాజాగా కార్పొరేటర్ షబానా కుమారుడు పీరుల్లా(26)పై హత్యాయత్నానికి పాల్పడ్డారు. కడప నగరం మోచంపేట 39వ డివిజన్ టీడీపీ ఇన్‌చార్జి అరీఫ్ మరికొంతమంది కలిసి పీరుల్లాపై గురువారం హత్యాయత్నానికి పాల్పడ్డారు. మొన్న మృత్యుంజయకుంట సమీపంలో మాధవీరెడ్డి ‘బాబు ష్యూరిటీ, భవిష్యత్ గ్యారెంటీ’కార్యక్రమంలో భాగంగా ప్రచారానికి వెళ్లింది. ఇంటింటా టీడీపీ స్టిక్కర్లు గృహస్తుల అనుమతి లేకుండా అతికించారు. గమనించిన వలంటీర్ ఆంజనేయులు తన ఇంటికి టీడీపీ స్టిక్కర్ అతికిస్తుంటే అభ్యంతరం చెప్పారు.
నా అనుమతి లేకుండా ఇలా చేయొద్దన్నందుకు టీడీపీ నేతలు దేరంగుల శివ, శివశంకర్ వాదనకు దిగారు. వలంటీర్‌పై దాడి చేశారు. అంతటితో ఆగకుండా మాధవీరెడ్డి తన ప్రైవేటు సైన్యంతో అక్కడికి వెళ్లి రచ్చ చేశారు. ఈవ్యవహారం చిన్నచౌక్ పోలీసుస్టేషన్‌కు చేరింది. పోలీసుస్టేషన్‌లో సైతం పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి రెండు నెలల్లో మా ప్రభుత్వం వస్తుంది, తర్వాత నేనేంటో చూపిస్తానంటూ బెదిరింపులకు దిగారు. కలెక్టర్ విజయ్‌రామరాజు బుధవారం ఓటర్ల తొలగింపులు, చేర్పులు వ్యవహారంపై రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న శ్రీనివాసులరెడ్డి అదే పదజాలన్నీ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ అయిన విజయరామరాజు ఎదుట సైతం ఉపయోగించడం విశేషం.
క్రమం తప్పకుండా దౌర్జన్యాలు....
ఎన్నికల ప్రచారంలో భాగంగా డివిజన్లలో పర్యటిస్తున్న మాధవీరెడ్డి ఇటీవల దౌర్జన్య కర ఘటనలకు పాల్పడుతున్నారు. మొన్న టీడీపీ బృందం ప్రచారం చేసుకుంటూ వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ నేత వినోద్‌కుమార్ ఇంటికి వెళ్లారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తుంటే అభ్యంతరం చెప్పారు. వెంటనే వినోద్‌కుమార్‌ను టార్గెట్ చేసి, స్వయంగా మాధవీరెడ్డి హెచ్చరికలు జారీ చేశారు. శ్రీనివాసులరెడ్డి దంపతులు డిప్యూటీ సీఎం అంజద్‌బాషాను సైతం ఏకవచనంతో సంబోధించడం పరిపాటిగా పెట్టుకున్నారని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. సోషల్ మీడియా కేంద్రంగా ఏకవచనంతో సంభోదిస్తూ కావాలనే సామాజికంగా ఎక్స్‌ఫోజ్ చేస్తున్నారని పలువురు భావిస్తున్నారు.
మాధవీ..మర్యాదగా మసలుకో!
కడప రూరల్ /కడప అర్బన్: ప్రశాంతంగా ఉన్న కడపకు వచ్చి విద్వేషాలను నింపుతున్న కడప నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి మాధవిరెడ్డి మర్యాదగా మసలుకుని ప్రవర్తించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కడప నగర మహిళా నేతలు హితవు పలికారు. గురువారం స్థానిక వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్ క్లబ్‌లో విలేకరులతో పార్టీ కడప సోషల్‌మీడియా కన్వీనర్ సునీతరెడ్డి మాట్లాడుతూ మాధవిరెడ్డికి ఓటమి భయం పట్టుకుందన్నారు. దీంతో ఆమె మతిస్థిమితం లేని వ్యక్తిలా ప్రవర్తించడమే కాకుండా డిప్యూటీ సీఎం అంజద్‌బాషతోపాటు వైఎస్సార్ సీపీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. బుధవారం రాత్రి 10–12 గంటల ప్రాంతంలో ఒక వ్యక్తి ఫోన్ చేసి తనను బెదిరించడమే కాకుండా ఇష్టానుసారంగా దూషించారన్నారు. కడప టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా మాధవిరెడ్డి నియమితులైనప్పటి నుంచి ఆ పార్టీ కార్యకర్తల ఆగడాలు, బెదిరింపులు ఎక్కువయ్యాయని తెలిపారు. ఈ విషయమై జిల్లా ఎస్పీకి, కడప డీఎస్పీకి ఫిర్యాదు చేశామని సోషల్ మీడీయా కన్వీనర్లు సునీతారెడ్డి, నిశాంత్‌లు తెలిపారు. పార్టీ మహిళా విభాగం కడప నగర అధ్యక్షురాలు వెంకటసుబ్బమ్మ మాట్లాడుతూ ప్రశాంతంగా ఉన్న కడపకు మాధవిరెడ్డి శూర్పనఖలా వచ్చారని అన్నారు. పార్టీ నాయకులు పద్మావతి, మరియలు, సుశీల, తులశమ్మ, నారాయణ, నిర్మల పాల్గొన్నారు.
కడపను కలుషితం చేస్తే సహించం
టీడీపీ ఇన్‌చార్జి మాధవీరెడ్డి, ఆమె భర్త శ్రీనివాసులరెడ్డి కడపలో శాంతిభద్రతలకు భంగం కల్గిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ యువజన నేత పీరుల్లాపై హత్యాయత్నానికి పాల్పడ్డారు. మా నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజామెప్పుతో నాయకుడిగా ఎదగాలని సూచిస్తున్నారు. టీడీపీ నేతలు రౌడీయిజంతో రాజకీయం చేయాలని చూస్తున్నారు.శాంతియుత వాతావరణంలో ఉన్న కడపను కలుషితం చేస్తే సహించం.
–అంజద్‌బాషా, డిప్యూటీ సీఎం
కవ్వింపు చర్యలు మానుకోండి
టీడీపీ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది.వీటిని మానుకోవాలి. అకారణంగా వైఎస్సార్‌సీపీ శ్రేణులను టార్గెట్ చేస్తున్నారు. లక్కిరెడ్డిపల్లె, చక్రాయపేట, రామాపురం ప్రాంతాలకు చెందిన ప్రైవేటు సైన్యంతో శ్రీనివాసులరెడ్డి, మాధవీరెడి జిల్లా కేంద్రంలో దౌర్జన్యకర ఘటనలకు పాల్పడుతున్నారు. ఇలాంటివి పునరావృతమెతే టీడీపీ నేతలు తగిన మూల్యం చె ల్లించుకోవాల్సి వస్తోంది.
– సురేష్‌బాబు, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment