ములకలచెరువులో పార్టీ సమావేశంలో మాట్లాడుతున్న రాంగోపాల్‌రెడ్డి
వచ్చినోళ్లు వస్తారు, పోయినోళ్లు పోతారు
ములకలచెరువులో ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డి
మండిపడుతున్న తంబళ్లపల్లె టీడీపీ క్యాడర్
అన్నమయ్య: తంబళ్లపల్లె నియోజకవర్గంలో టీడీపీకి తాము చెబితే జనం ఓట్లెయ్యరని ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డి తేల్చి చెప్పేశారు. గంపగుత్తగా పార్టీకి ఓట్లు వేసే పరిస్థితి కూడా లేదని పార్టీ క్యాడర్ సమక్షంలోనే చెప్పి, మనం అర్గనైజర్లుగా మాత్రమే వ్యహరించాలని సూచించడంతో నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి ఏ స్థాయిలో ఉందో చెప్పకనే చెప్పేశారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలిలా ఉన్నాయి. ఈ నెల 20వ తేదీ(బుధవారం) తంబళ్లపల్లె నియోజకవర్గం ములకలచెరువులో టీడీపీ అభ్యర్థికి చెందిన కార్యాలయంలో పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డి ఎన్నికల వ్యవహారంపై టీడీపీ అభ్యర్థి మంచోడైతేనే ఓట్లు వేస్తారని కూడా చెప్పడంతో సమావేశానికి హాజరైన పార్టీ నాయకులు చర్చించుకోవడం విశేషం. ఎమ్మెల్సీ మాట్లాడుతూ మనం చెబితే ఎవరూ ఓట్లు వేయరు, మనం ఆర్గనైజర్లుగా పని చేయాలన్నారు. నేను చెబితోనో, మీరు చెబితోనో తండోప తండాలుగా ఓట్లు వేసే పరిస్థితి గ్రామాల్లో లేదు.. వాళ్లకు నచ్చిన పార్టీకి ఓట్లు వేస్తారు, మన అభ్యర్థి మంచోడైతే మనకు ఓట్లు వేస్తారని, లేకపోతే అవతలి పార్టీకి ఓట్లు పడ్తాయని, లీడర్లను చూసి ఓట్లు వేసే పరిస్థితులు పోయాయని కుండబద్దలు కొట్టారు.
ఇదే క్రమంలో నిన్ను, నన్ను చూసి ఓట్లు వేయరని స్పష్టంగా చెప్పారు. ప్రధానంగా టీడీపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న జయచంద్రారెడ్డిని పార్టీ క్యాడర్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పరిస్థితుల్లో రాంగోపాల్‌రెడ్డి ప్రసంగం నియోజకవర్గ టీడీపీలో అగ్గి రాజేసింది. ఈ సమావేశం తర్వాత హాజరైన పార్టీ నాయకులతో రాంగోపాల్‌రెడ్డి ముచ్చటిస్తూ అభ్యర్థికి మద్దతు ఇవ్వని వాళ్లని పార్టీ నుంచి సస్పెన్షన్ చేయిస్తానని చెప్పినట్టు క్యాడర్‌లో ప్రచారం జరుగుతోంది. ఈ వ్యాఖ్యలపై నియోజకవర్గ టీడీపీలో అభ్యర్థి జయచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డిలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు హోరెత్తిస్తున్నారు.
ఎమ్మెల్సీకి ఏం సంబంధం?
తంబళ్లపల్లెతో రాంగోపాల్‌రెడ్డికి ఏం సంబంధం ఉందని టీడీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. పలువురు నాయకులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. వచ్చేవాళ్లు వస్తారు, పోయేవాళ్లు పోతారు అంటూ స్థానిక లీడర్లపై అవహేళనగా మాట్లాడతారా. నియోజకవర్గ స్థితిగతులు తెలియని, అసలు సంబంధమేలేని ఎమ్మెల్సీని అభ్యర్థి జయచంద్రారెడ్డి పిలిపించుకుని మమ్మల్ని తక్కువ చేసి మాట్లాడించడం వెనుక ఉద్దేశమేమిటి అంటూ నిలదీస్తున్నారు. పార్టీకి దూరంగా ఉంటున్న నాయకులను కలుపుకొని వెళ్లాలి, వారిని బుజ్జగించాలి కానీ బెదిరింపు ధోరణితో మాట్లాడటం ఏమిటని నిలదీశారు. కొన్ని పోస్టుల్లో ఎమ్మెల్సీని ఉద్దేశించి ఖబడ్దార్ అంటూ హెచ్చరిస్తూ టీడీపీ శ్రేణులు పెట్టిన కొన్ని పోస్టులను తొలగించారు. జిల్లావాసి కాని ఎమ్మెల్సీ తంబళ్లపల్లైపె ఎందుకు ఆసక్తి చూపుతున్నారంటూ టీడీపీ క్యాడర్ అనుమానాలను వ్యక్తం చేస్తోంది. ఇటీవల రెండు సార్లు ఇక్కడికి రావడం వెనుక మతలబు ఏమిటని ఆరా తీస్తున్నారు. జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు ఉన్నా తంబళ్లపల్లైవెపు కన్నెత్తి చూడలేదు కానీ ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి ఒక్కరే ఇక్కడి టీడీపీ రాజకీయాలపై శ్రద్ధ చూపడం, అభ్యర్థికి మద్దతుగా మాట్లాడటం, వ్యతిరేక వర్గాలను మందలించినట్లుగా మాట్లాడటం పార్టీలో తీవ్ర చర్చనీయాంశమైంది.
Comments
Please login to add a commentAdd a comment