కరివేపాకు చందంలా
ఉపయోగించుకున్న టీడీపీ
సముచితస్థానం ఇవ్వాలనుకుంటున్న వైఎస్సార్‌సీపీ
సమాలోచనలో పడ్డ శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ సతీష్‌రెడ్డి
సాక్షి ప్రతినిధి, కడప : ‘అవసరం మేరకు వాడుకోవడం, ఆపై కరివేపాకులా వదిలేయడం’ టీడీపీ అధినేత చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్యగా విశ్లేషకులు వర్ణిస్తారు. అచ్చం అలాంటి పరిస్థితే జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు సతీష్‌కుమార్‌రెడ్డికు ఎదురైంది. పార్టీ అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో రాజకీయ పోరాటం చేసినా చంద్రబాబు అధికారంలోకి వచ్చాక వెన్నుపోటు రాజకీయాలకు తెరతీశారు. ఫలితంగా సతీష్‌కుమార్‌రెడ్డి సేవలందించిన చోటే ఛీత్కారాలు చవిచూశారు. ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్సార్‌సీపీ నుంచి ఇటీవల గౌరవప్రదమైన ఆహ్వానం లభించడంతో సమాలోచనలో పడ్డారు. ప్రత్యక్ష రాజకీయాల్లో చురుగ్గా పాలుపంచుకునే దిశగా అడుగులు వేస్తున్నారు.
వేంపల్లె నాగిరెడ్డి పేరు చెబితే తెలియని పాతతరం నేతలుండరు. ఆయన రాజకీయ వారసుడిగా ఆ కుటుంబం నుంచి వచ్చిన ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి స్వశక్తితో అంచెలంచెలుగా ఎదిగారు. తెలుగుదేశం పార్టీకి పులివెందుల నియోజకవర్గంలో పెద్ద దిక్కుగా నిలిచి రాజకీయ పోరాటం చేశారు. 1999 నుంచి 2019 వరకూ ఐదు టర్మ్‌లు పులివెందుల టీడీపీ అభ్యర్థిగా ఎన్నికల్లో తలపడ్డారు. ఓడిపోతామని తెలిసినా పోటీ చేస్తూ టీడీపీ పరువు కోసం తాపత్రయ పడ్డారు. అయితే ఆయన టీడీపీ అధికారంలో ఉన్నన్నాళ్లు ఛీత్కారాలు ఎదుర్కొన్నారని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. దీంతో స్వంత పార్టీలో నేతల కుట్రలు, కుతంత్రాలకు విసిగిపోయి.. క్రియాశీలక రాజకీయాలకు కొంతకాలంగా దూరంగా ఉన్నారు.
వైఎస్సార్‌సీపీ నుంచి ఆహ్వానం
సతీష్‌కుమార్‌రెడ్డి సేవలు వినియోగించుకునేందుకు వైఎస్సార్‌సీపీ సిద్ధమైంది. అలాగే సముచిత స్థానం కూడా ఇచ్చేందుకు యోచిస్తోంది. ఆ మేరకు కడప– కర్నూల్ ఉమ్మడి జిల్లాల రీజనల్ కో–ఆర్డినేటర్లు కె.సురేష్‌బాబు, పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డిలు సతీష్‌తో చర్చించి పార్టీలో చేరాలని ఆహ్వానించారు. ఈ విషయం తెలుసుకున్న పులివెందుల టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి సతీష్‌రెడ్డి ఇంటి ముందు ప్రత్యక్షమయ్యారు.
బీటెక్ రవి వైఖరి క్షుణ్ణంగా పరిశీలిస్తే సతీష్‌కుమార్‌రెడ్డి పట్ల చిత్తశుద్ధి, నిబద్ధత ఏమాత్రం లేదనే పరిశీలకులు వెల్లడిస్తున్నారు. అధికారంలో ఉండగా ప్రాంతం కోసం, ప్రజల కోసం ప్రతినబూని కృష్ణాజలాలు తీసుకవచ్చేందుకు సతీష్‌రెడ్డి శక్తి వంచన లేకుండా కృషి చేశారు. ఏదేమైనా తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో మళ్లీ క్రియాశీలకం కానున్నట్లు విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment