వెంకటగిరిటౌన్: రైతుల రుణమాఫీపై సీఎం చంద్రబాబునాయుడు రోజుకో మాట మాట్లాడుతున్నారు. దీంతో అన్నదాతల్లో అయోమయం నెలకొంది. ఒకే ఒక్క సంతకంతో రైతుల తలరాతలు మార్చేలా రుణమాఫీ చేసి వారిని అప్పుల ఊబి నుంచి బయట పడేస్తానని సార్వత్రిక ఎన్నికల సందర్భంగా నిర్వహించిన ప్రచారంలో చంద్రబాబు గొప్పలు చెప్పారు. తీరా అధికారంలోకి వచ్చాక చంద్రబాబు పూటకో మాట మారుస్తున్నారు.
తొలుత రుణమాఫీపై కమిటీ వేసి 45 రోజుల్లో నివేదిక రాగానే రుణమాఫీ చేస్తామనడం, ఆ తర్వాత రుణాల రీషెడ్యూల్ పల్లవి అందుకోవడం, ఇప్పుడు ఇంటికి ఒక రుణం మాత్రమే మాఫీ చేస్తామని చెబుతుండటంతో అన్నదాతలు లబోదిబోమంటున్నారు. బంగారు రుణాలమాఫీ ఊసే ఎత్తడం లేదు. దీంతో సేద్యం పెట్టుబడులకు ఎక్కడి నుంచి తేవాలో అన్నదాతలకు దిక్కుతోచడం లేదు. ఈ నేపథ్యంలో అధిక వడ్డీలకు అప్పులు చేయాల్సిన దుస్థితి నెలకొంది.
రీషెడ్యూల్‌కు సానుకూలం
రీషెడ్యూల్‌పై బుధవారం ఆర్‌బీఐ సంకేతాలు ఇవ్వడంతో తాజాగా రుణమాఫీ ప్రక్రియను వాయిదా వేసేందుకు వ్యవసాయానికి ఖర్చుపెట్టిన రుణాలను మాత్రమే మాఫీ అంటూ కొత్తపల్లవిని ప్రభుత్వం అందుకుందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరువు, వరదల ప్రభావం ఉన్న మండలాల్లో మాత్రమే రీషెడ్యూల్ చేసే అవకాశం ఉండటంతో తమ మండలం ఆ జాబితాలో ఉంటుందో లేదోననే అనుమానాలు నియోజకవర్గంలోని వెంకటగిరి, డక్కిలి, బాలాయపల్లి, సైదాపురం, కలువాయి, రాపూరు మండలాల రైతుల్లో తలెత్తాయి.
అయినా రీషెడ్యూల్ చేసే రుణాలను దశలవారీగా తామే చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించకపోవడంపైనా చర్చ సాగుతోంది. ఇక వాయిదాలు మీద వాయిదాలు వేస్తూ ఆధార్‌కార్డులు, రేషన్‌కార్డులు, ఓటరు కార్డులు అంటూ పలు ధ్రువీకరణ పత్రాలను సేకరించి వాటిలో ఇంటినంబర్ ఆధారంగా ఇంటికో అప్పు మాత్రమే మాఫీ చేస్తారనే అనుమానాలను రైతులు వ్యక్తం చేస్తున్నారు. ఇక బంగారంపై తెచ్చుకున్న వ్యవసాయరుణాలపై ప్రభుత్వ చేతులేత్తేసినట్టేనని చంద్రబాబు బుధవారం వెల్లడించిన వివరాలతో రైతులు దిగాలు చెందుతున్నారు.
మాఫీపై పిల్లిమొగ్గలు
Published Thu, Jul 17 2014 2:36 AM | Last Updated on Sat, Jul 28 2018 6:33 PM
Advertisement
Advertisement