
జిల్లాలో నరకాసుర వధ
సాక్షి, నెల్లూరు: ఎన్నికల హామీని తుంగలో తొక్కి ముఖ్యమంత్రి చంద్రబాబు రుణమాఫీని సక్రమంగా అమలుచేయనందుకు నిరసనగా వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపుమేరకు పార్టీ శ్రేణులు గురువారం జిల్లాలో చంద్రబాబు దిష్టిబొమ్మలను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. సర్వేపల్లి నియోజకవర్గంలోని పొదలకూరు, టీపీ గూడూరు, ముత్తుకూరు మండలాల్లో కార్యకర్తలు చంద్రబాబు దిష్టిబొమ్మలు దహనం చేశారు. రైతులను వంచించిన బాబు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రైతులను, డ్వాక్రా మహిళలను మోసం చేసిన బాబుపై చీటింగ్ కేసులు నమోదుచేయాలని డిమాండ్ చేశారు.
రుణ మోసంపై ఆగ్రహం
మహ్మదాపురం(పొదలకూరు): మండలంలోని మహ్మదాపురం గ్రామంలో రైతులు గురువారం పంట, బంగారు రుణాలను పూర్తిగా మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. నరకాసురవధ పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దిష్టిబొమ్మను దహనం చేశారు. సూరాయపాళెంలో సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తాటిపర్తి లో రుణమాఫీపై ప్రభుత్వం ప్రకటించిన నిర్ణయాన్ని రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు.
జాతీయ రహదారి దిగ్బంధం
మనుబోలు: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీని సక్రమంగా అమలు చేయాలంటూ వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ పచ్చిపాల జయరామరెడ్డి ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు. వాహనాల రాకపోకలను అడ్డుకోవడంతో కొద్దిసేపు వాహనాలు బారులు తీరాయి. ముఖ్యమంత్రి చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పార్టీ నాయకుడు ఉపసర్పంచ్ దండు చంద్రశేఖర్‌రెడ్డి, నాయకులు చిట్టమూరు పద్మనాభరెడ్డి, అజయ్‌కుమార్‌రెడ్డి, కడివేటి చంద్రశేఖర్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి, రఘురామిరెడ్డి, సురేందర్‌రెడ్డి, ప్రవీణ్‌రెడ్డి, ప్రసాద్ గౌడ్, బాలకృష్ణారెడ్డి, అంకయ్యగౌడ్, శ్రీనివాసులురెడ్డి, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
సీఎం దిష్టిబొమ్మ దహనం
ముత్తుకూరు:పిడతాపోలూరు వడ్డిపాళెం వద్ద వైఎస్సార్‌సీపీకి చెందిన రైతులు, డ్వాక్రా మహిళలు సీఎం దిష్టిబొమ్మను ఊరేగించి, దహనం చేశారు. సీఎం దిష్టిబొమ్మలను దహనం చేస్తే నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేస్తామని ఎస్సై మారుతీకృష్ణ హెచ్చరించారు. పిడతాపోలూరు, బ్రహ్మదేవి పంచాయతీకి చెందిన రైతులు, మహిళలు పాల్గొన్నారు.
వంచించిన బాబు
తోటపల్లిగూడూరు: ఎన్నికల ముందు ఓ మాట ఎన్నికల అనంతరం ఓ మరో మాట మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రైతులను నమ్మించి వంచించాడని ఈదూరుకి చెందిన పలువురు రైతులు వాపోయారు. చంద్రబాబునాయుడి రుణమాఫీ విధానాన్ని నీరసిస్తూ వైఎస్సార్‌సీపీ
నాయకులు, రైతుల ఆధ్వర్యంలో మండలంలోని పలు గ్రామాల్లో నిరసన కార్యక్రమాలు జరి గాయి. ఈదూరులో భారీ ఎత్తున రైతులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టి సీఎం దిష్టి బొమ్మను దహనం చేశారు. రైతులు మాట్లాడుతూ ఎన్నికల ముందు రైతులందరి రుణాలను రద్దుచేస్తామని ప్రకటించిన చంద్రబాబు అధికారంలోకి రాగానే మాట మార్చాడన్నారు. కుటుంబంలో ఒక్కరికే రుణమాఫీ అంటే బ్యాంక్‌రుణాలు తీసుకున్న మిగిలిన కుటుంబ సభ్యులు ఆత్మహత్యలకు పాల్పడక తప్పదన్నారు.
చంద్రబాబు హామీలు బూటకం
వెంకటాచలం: చంద్రబాబు ఎన్నికల సందర్భంగా చేసిన రుణమాఫీ హామీలు బూటకమని జెడ్పీటీసీ సభ్యుడు వెంకటశేషయ్య అన్నారు. రైతులతో కలిసి మండల పరిషత్ కార్యాలయం వద్ద విలేకరులతో మాట్లాడారు. రైతురుణాల పేరుతో గద్దె ఎక్కిన చంద్రబాబు పూర్తి రుణమాఫీ నుంచి తప్పించుకునేందు శత విధాలా ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. కుటుంబానికి ఒకరికి రూ.1.5 లక్షలు, పొదుపు మహిళలకు గ్రూపులకు లక్ష ప్రకటించారని ఆయన ప్రకటనే మాఫీగా భావించి టీడీపీ నాయకులు గొప్పలు చెప్పు కోవడం సిగ్గు చేటన్నారు. ప్రజల పక్షాన వైఎస్సార్‌సీపీ నిలుస్తుందని చెప్పారు. శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి పాల్గొంటారన్నారు. మండల పరిషత్ ఉపాధ్యక్షుడు శ్రీధర్‌నాయుడు, వెంకటాచలం సర్పంచ్ మణెమ్మ, నాయకులు మందల పెంచలయ్య, తూమాటి వెంకటరామయ్య, ఆలూరు రామయ్య, పాశం రామయ్య పాల్గొన్నారు.