ధర్మశాలలో హిమాచల్ సీఎం ఠాకూర్ భుజంపై సరదాగా తడుతున్న ప్రధాని మోదీ
ధర్మశాల/సిమ్లా: రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ రైతులను మోసం చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. రైతుల రుణమాఫీ విషయంలో గతంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నిలబెట్టుకోలేదని వెల్లడించారు. ‘కాపలాదారు దొంగగా మారాడు’ అంటూ కాంగ్రెస్ చీఫ్ రాహుల్ చేస్తున్న విమర్శలపై స్పందిస్తూ.. ‘ఈ కాపలాదారు దొంగల్ని వదిలిపెట్టడానికి సిద్ధంగా లేడు’ అని వ్యాఖ్యానించారు. హిమాచల్‌ప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా ధర్మశాలలో గురువారం నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న మోదీ, కాంగ్రెస్‌శైలిపై విమర్శలు గుప్పించారు.
రుణమాఫీపై మాట తప్పారు: దేశంలో రైతుల రుణాలన్నింటిని మాఫీ చేసేంతవరకూ ప్రధానిని నిద్రపోనివ్వబోమని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ధర్మశాల సభలో మోదీ మాట్లాడుతూ..‘2009 లోక్‌సభ ఎన్నికల్లో గెలిస్తే ఏకంగా రూ.6 లక్షల కోట్ల రైతుల రుణాలను మాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. కానీ అధికారంలోకి వచ్చాక కేవలం రూ.60,000 కోట్లు మాత్రమే మాఫీ చేసి చేతులు దులుపుకుంది. విచిత్రం ఏంటంటే రైతులు కాని లక్షలాదిమంది ఈ రుణమాఫీతో లబ్ధి పొందారని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) తన నివేదికలో బయటపెట్టింది. రుణమాఫీపై ఇదే తరహా హామీలను పంజాబ్, హరియాణా ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. అయితే ఎన్నికలు అయ్యాక పంజాబ్‌లో రైతులకు ఏమీ దక్కకపోగా, కర్ణాటకలో మాత్రం ఓ 800 మంది రైతులకు ఏదో నామమాత్రంగా మాఫీ చేశారు’ అని అన్నారు.
రూ.90,000 కోట్లను ఆదా చేశాం
భారత సాయుధ బలగాలు, మాజీ జవాన్లు చాలాకాలంగా డిమాండ్ చేస్తున్న వన్ ర్యాంక్–వన్ పెన్షన్ (ఓఆర్‌ఓపీ) విధానంపై మోదీ మాట్లాడుతూ.. ‘అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం రుణమాఫీ తరహాలోనే ఓఆర్‌ఓపీపై దేశాన్ని తప్పుదోవ పట్టించింది. ఈ పథకం కోసం కొద్దిపాటి నిధులను మాత్రమే కేటాయించింది. కానీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఓఆర్‌ఓపీని పూర్తిస్థాయిలో అమలుచేశాం. యూపీఏ హయాంలో వేర్వేరు ప్రభుత్వ పథకాల కింద బోగస్ లబ్ధిదారుల పేరుతో దుర్వినియోగం అవుతున్న రూ.90,000 కోట్లను మేం ఆదా చేయగలిగాం’ అని తెలిపారు.
బస్సు పల్టీ.. 35 మందికి గాయాలు
ధర్మశాలలో ప్రధాని ర్యాలీకి వెళుతున్న ఓ స్కూలు బస్సు కాంగ్రా జిల్లా జవాలీ ప్రాంతంలో అదుపు తప్పి పల్టీ కొట్టింది. ఈ ఘటనలో బస్సు నుజ్జునుజ్జు కావడంతో అందులోని 35 మంది కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ విద్యార్థులు గాయపడ్డారు. దీంతో అధికారులు వీరిని హుటాహుటిన సమీపం లోని ఆసుపత్రికి తరలించారు. కాగా, వీరిలో ఐదుగురు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment