సాక్షి, అనంతపురం : కాంగ్రెస్ సర్కారు అమలు చేసిన ‘అమ్మహస్తం’ పథకానికి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మంగళం పాడనుంది. ఫలితంగా రేషన్ షాపుల ద్వారా రూ.185కే తొమ్మిది రకాల సరుకుల పంపిణీ నిలిచిపోనుంది. పథకంలో లోపాలుంటే సరిచేసి పకడ్బందీగా అమలు చేయాల్సిందిపోయి పూర్తిగా నిలిపివేయడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. జిల్లాలో 11 లక్షల తెల్లరేషన్ కార్డుదారులు ఉన్నారు. వీరికి ‘అమ్మహస్తం’ పథకానికి సంబంధించి పంచదార, గోధుమలు, పామాయిల్, చింతపండు, పసుపు, గోధుమ పిండి, కందిపప్పు, ఉప్పు, కారంపొడి పంపిణీ చేస్తారు.
అంతర్జాతీయ మార్కెట్‌లో పామాయిల్ ధరపై పన్నులు పెరగడంతో ఐదు నెలలుగా పామాయిల్ సరఫరా నిలిపివేశారు. చింతపండు, పసుపు రెండు నెలలుగా సరఫరా కావడం లేదు. మిగిలిన సరుకులు కూడా పూర్తి స్థాయిలో రావడం లేదు. ఆగస్టులో కార్డుదారులు తీసుకోకపోవడంతో పౌరసరఫరాల శాఖలో గోధుమ పిండి, కందిపప్పు, ఉప్పు, కారంపొడి సరుకులు ఓపెనింగ్ బ్యాలెన్స్ (నిల్వ)గా ఉన్న కొన్ని సరుకులతో పాటు సెప్టెంబర్ మాసానికి కేవలం బియ్యం, పంచదారకు మాత్రమే అధికారుల సూచనల మేరకు కొంత మంది డీలర్లు డీడీలు తీశారు. ప్రస్తుతం జిల్లాలో ఉన్న కొద్దిపాటి సరుకులు సెప్టెంబర్‌లో క్లియర్ చేసిన తరువాత అక్టోబర్ మాసం నుంచి అమ్మహస్తం పథకానికి ప్రభుత్వం టాటా చెప్పడానికి సిద్ధమైనట్లు తెలిసింది.
నాణ్యత పెంచితే సరి
నిత్యావసర సరుకుల ధరలు చుక్కలనంటుతున్న నేపథ్యంలో ప్రభుత్వం పేదలకు ఆసరాగా ఉండేందుకు 18 నెలల క్రితం ప్రారంభమైన ఈ పథకం కింద పంపిణీ చేస్తున్న సరుకుల్లో కొన్ని నాణ్యతగా ఉండడం లేదన్న విమర్శలు ఉన్నాయి. పురుగులు పట్టిన చింతపండు, ఇటుక పొడి కలిపిన కారం, కంపుకొడుతున్న గోధుమ పిండి కార్డుదారులకు పంపిణీ చేస్తున్నారు. కందిపప్పు ఎంత ఉడకబెట్టినా ఉడకడం లేదన్న విమర్శలు ఉన్నాయి. దీంతో పాటు కొన్ని సరుకులు అమ్మహస్తం పథకం కంటే బహిరంగ మార్కెట్‌లోనే తక్కువ ధరకు లభిస్తుండడంతో కార్డుదారులు వీటిని తీసుకునేందుకు ముందుకు రావడం లేదు. దీంతో డీలర్ల నుంచి కూడా ఈ పథకం పట్ల నిరాసక్తత వ్యక్తమవుతోంది.
తాము వేలకు వేలు డీడీలు చెల్లించి అమ్మహస్తం సరుకులు తీసుకువస్తే కార్డుదారులు తీసుకోకపోవటంతో నష్టపోతున్నామంటూ ఎంతో కాలంగా డీలర్లు గగ్గోలు పెడుతున్నారు. ఆ వస్తువుల్లో నాణ్యత పెంచి సరఫరా చేస్తే కార్డుదారుల నుంచి డిమాండ్ ఉంటుంది. ఈ లోపాలను సవరించే ప్రయత్నం చేయకుండా ఈ పథకానికి మంగళం పాడాలనుకోవడం తగదని కొందరు డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెలకో సరుకు చొప్పున తగ్గిస్తూ.. నాణ్యత లేకుండా ఇస్తే ఎలా తీసుకోవాలని జనం ప్రశ్నిస్తున్నారు. సరుకు బాగోలేదంటే నాణ్యత పెంచాల్సింది పోయి ఇలా బంద్ చేయడం తగదని వాపోతున్నారు.
సరుకులు రావడం లేదు
అమ్మహస్తం పథకానికి సంబంధించి తొమ్మిది రకాల సరుకులు రావడం లేదు. ప్రభుత్వానికి నివేదించాము. సెప్టెంబర్ మాసానికి సంబంధించి కొద్దిపాటి డీలర్లు మాత్రమే డీడీలు తీశారు. వారికి బియ్యం, పంచదారతో పాటు గత నెలకు సంబంధించి ఓపెనింగ్ బ్యాలెన్స్‌గా ఉన్న గోధుమ పిండి, కంది పప్పు, ఉప్పు, కారం పొడి సరఫరా చేస్తే స్టాక్ క్లియర్ అవుతుంది. వచ్చే నెల నుంచి సరుకులు పంపిణీకి సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
- వెంకటేశం, పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్, అనంతపురం.
సరుకుల్లేవ్..
Published Tue, Sep 2 2014 1:58 AM | Last Updated on Sat, Sep 2 2017 12:43 PM
Advertisement
Advertisement