తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్
తెనాలిరూరల్ : గత ప్రభుత్వ హయాంలో రూ. 97 కోట్లతో చేపట్టిన సమగ్ర మంచి నీటి పథకం అమలు కాని ప్రాజెక్టని, దానిని గత పాలకులు ఇప్పుడు తమ నెత్తిన పెట్టారని ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ అన్నారు. అమలు సాధ్యం కాని ఈ ప్రాజెక్టు వల్ల ఏడాదికి పురపాలక సంఘంపై సుమారు రూ. మూడు కోట్ల వరకు భారం పడుతుందని, దాన్ని తగ్గించేందుకే కోకాకోలా ఫ్యాక్టరీకి నీరు ఇవ్వాలని నిర్ణయించినట్టు చెప్పారు.
సోమవారం స్థానిక రామలింగేశ్వరపేటలోని పార్టీ కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రోజుకు 14.8 క్యుసెక్కుల నీటిని తెనాలికి తీసుకునే సామర్ధ్యం ఉందని, ఇది 31 ఎంఎల్‌డీకి సమానంగా చెప్పారు. ఇందులో మూడు ఎంఎల్‌డీ వేస్టేజి కింద పోయినా, 28 ఎంఎల్‌డీ నీరు ఉంటుందని, ప్రస్తుతమున్న జనాభా, కొళాయి కనెక్షన్‌లకు ఇది ఎక్కువేనన్నారు. మిగిలిన నీటిని కోకాకోలాకు ఇస్తే పురపాల సంఘంపై భారం తగ్గుతుందని వివరించారు. రానున్న ఐదేళ్ల కాలంలో పట్టణంలో లక్షకుటుంబాలు నివసిస్తాయని, నీటి అవసరాలు తీర్చలేమని అఖిల పక్షం సభ్యులు చేస్తున్న ఆరోపణలు సత్యదూరమన్నారు.
మార్కెట్ కాంప్లెక్సులోని పై రెండు ఫ్లోర్లు, మున్సిపల్ కార్యాలయం వెనుక ఉన్న చేపల మార్కెట్ స్థలం వేలం నిర్వహిస్తే కోట్లాది రూపాయలు వస్తాయని చెబుతున్న అఖిల పక్ష సభ్యులే వాటి వేలం నిర్వహించాలని, అందుకు అవసరమైన ఏర్పాట్లను చేయిస్తానని సవాల్ చేశారు. ఖర్చు చేసే ప్రతిపైసాకు జవాబుదారీగా ఉండాలన్నదే తమ లక్ష్యంగా చెప్పారు. అఖిల పక్షం పేరిట ప్రజల్లో లేనిపోని అనుమానాలను రేకెత్తిస్తున్నారని, వాటిని నమ్మే స్థితిలో ప్రజలు లేరన్నారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ కొత్తమాసు తులసీదాసు, వైస్‌చైర్మన్ మాదల కోటేశ్వరరావు, టీడీపీ పట్టణ అధ్యక్షుడు మహమ్మద్ ఖుద్దూస్, టీడీపీ కౌన్సిలర్లు పాల్గొన్నారు.
నేడు తెనాలి పట్టణ బంద్
తెనాలిరూరల్ : పెదవడ్లపూడి సమీపంలోని కోకాకోలా ఫ్యాక్టరీకి తెనాలి సమగ్ర మంచినీటి పథకం నీటిని తరలించేందుకు మున్సిపల్ కౌన్సిల్ చేసిన తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ పట్టణ అఖిల పక్షం మంగళవారం పట్టణ బంద్ నిర్వహించాలని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. టీడీపీ, బీజేపీ మినహా మిగిలిన అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు బంద్‌కు మద్దతు ప్రకటించాయి.
కోకాకోలాకు నీరు ఇవ్వాలని నిర్ణయం
Published Tue, May 12 2015 5:02 AM | Last Updated on Sun, Sep 3 2017 1:51 AM
Advertisement
Advertisement