గురుకుల పాఠశాలలో బాలిక అదృశ్యం
గురుకుల పాఠశాలలో బాలిక అదృశ్యం
Published Tue, Sep 16 2014 12:35 AM | Last Updated on Sat, Sep 2 2017 1:25 PM
డోన్ రూరల్:
పట్టణ సమీపంలోని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో 8వ తరగతి విద్యార్థి మౌనిక అదృశమైంది. ఆదివారం నుంచి తమ కూతురు కనిపించడం లేదని బాలిక తల్లిదండ్రులు డోన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సోమవారం కేసు నమోదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి..వెలుగోడు మండలం రేగడగూడూరు గ్రామానికి చెందిన లక్ష్మిదేవి, రత్నస్వామి దంపతుల కుమార్తె మౌనిక స్థానిక గురుకుల పాఠశాలలో మూడేళ్ల క్రితం ఐదో తరగతిలో ప్రవేశం పొందింది. ఈమె ఆదివారం ఉదయం అల్పాహార సమయంలో కనిపించకపోవడంతో పాఠశాల సిబ్బంది బాలిక కోసం గాలించారు. ఆచూకీ లభ్యంకాకపోవడంతో మధ్యాహ్నం విద్యార్థిని తల్లిదండ్రులకు ఫోన్ చేసి విషయం తెలిపారు. దీంతో తల్లిదండ్రులు హుటాహుటిన పాఠశాలకు చేరుకొని ప్రిన్సిపాల్ ఉమాకుమారితో వాగ్వాదానికి దిగారు. తమ కూతురు కనిపించకపోవడానికి స్కూల్ సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని వారు పట్టణ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
సిబ్బంది నిర్లక్ష్యమే కారణం..
స్థానిక గురుకుల పాఠశాలలో 616 మంది బాలికలు చదువుతున్నారు. పాఠశాలతో పాటు రెసిడెన్షియల్ సౌకర్యం ఉండటంతో సిబ్బంది కూడా ఇక్కడే ఉంటున్నారు. అయితే బాలికల సంరక్షణ పట్ల సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో విద్యార్థినులు తరచూ అదృశ్యమవుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గతేడాది పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినులు అదృశ్యమయ్యారు. అయినా సిబ్బంది ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. దీంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు.
పాఠశాలను సందర్శించిన డీఎస్పీ, ఎస్‌ఐ..
స్థానిక గురుకుల పాఠశాలను సోమవారం డోన్ డీఎస్పీ పీఎన్ బాబు, ఎస్‌ఐ సుబ్రమణ్యం సందర్శించి విద్యార్థి అదృశ్యంపై ఆరా తీశారు. ప్రిన్సిపాల్‌తో వారు సమావేశమై చర్చించారు. బాలికల సంరక్షణకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పాఠశాల ఆవరణలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని వివరించారు.
ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేయాలి:
గురుకుల పాఠశాలలో విద్యార్థిని అదృశ్యానికి కారణమైన ప్రిన్సిపాల్ ఉమాకుమారిని తక్షణమే సస్పెండ్ చేయాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ భాగ్ కన్వీనర్ విజయభాస్కర్, పట్టణ కార్యదర్శి చిరంజీవి, మండల కన్వీనర్, కోకన్వీనర్లు శివశంకర్, నాగరాజు డిమాండ్ చేశారు. సోమవారం గురుకుల పాఠశాలకు వచ్చిన డీఎస్పీ పీఎన్‌బాబకు ఏబీవీపీ నాయకులు ఫిర్యాదు చేశారు.
Advertisement
Advertisement