వేలం వెనుక మతలబు!
► పశు వైద్యశాల స్థల విక్రయ పంచాయితీ
► టీడీపీలో మళ్లీ నేతల మధ్య వివాదం
► భూమా నిర్ణయంపై సర్వత్రా వ్యతిరేకత
► ఇదే బాటలో అన్ని పార్టీల నేతలు
► అధికారులు కూడా ససేమిరా..
► ముఖ్యమంత్రిని కలిసే యోచనలో శిల్పా.
టీడీపీలో మళ్లీ చిచ్చు రగులుతోంది. ముఖ్యమంత్రి పిలిచి సయోధ్య కుదిర్చినా.. ఏదో ఒక రూపంలో నేతల మధ్య వివాదం బయటపడుతోంది. తాజాగా పశు వైద్యశాల స్థల విక్రయం వివాదాస్పదమవుతోంది. భూమా దూకుడును.. శిల్పా వర్గం జీర్ణించుకోలేకపోతోంది. పార్కింగ్ స్థలం చేద్దామన్న నేత.. ఇప్పుడు విక్రయానికి సిద్ధపడటం స్థానికుల్లో వ్యతిరేకతకు కారణమవుతోంది. సొంత పార్టీతో పాటు మిత్ర పక్షం.. వామపక్షాలు కూడా ఈ విషయంలో భూమా నిర్ణయంపై భగ్గుమంటున్నారు.
నంద్యాల: పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదుటనున్న పశు వైద్యశాల స్థలం రాజకీయ వివాదానికి కేంద్రంగా మారుతోంది. ఒకరు అమ్మేద్దామంటే.. మరొకరు వద్దని వారించడం కొత్త సమస్యను తెరమీదకు తీసుకొస్తోంది. 1931లో బ్రిటీష్ ప్రభుత్వం 2.50 ఎకరాల స్థలంలో నిర్మించిన ఈ వైద్యశాల నంద్యాల, ఆళ్లగడ్డ, బనగానపల్లె, ఆత్మకూరు ప్రాంతాల రైతులకు చెందిన పశువులకు సేవలందిస్తోంది. ఆసుపత్రి చుట్టూ ఆర్టీసీ బస్టాండ్.. షాపింగ్ కాంప్లెక్స్.. లాడ్జీలు.. పెట్రోల్ బంకులు.. బ్యాంకులు ఏర్పాటు కావడంతో ఇక్కడి స్థలానికి డిమాండ్ పెరిగింది. పశు సంవర్ధక శాఖ అధికారుల అంచనా రూ.10 కోట్లు కాగా.. బహిరంగ మార్కెట్‌లో రూ.25 కోట్లకు పైమాటే.
గత ఏడాది రూ.కోటితో డివిజన్ స్థాయి పశు సంవర్ధక శాఖ కార్యాలయంతో పాటు శిక్షణ కేంద్రం కూడా ఇక్కడ నిర్మితమైంది. మిగిలిన 1.30 ఎకరాల ఖాళీ స్థలం పిచ్చిమొక్కలతో నిండిపోయింది. ఈ నేపథ్యంలో స్థలాన్ని బహిరంగ వేలంలో విక్రయించి.. ఆ డబ్బును అభివృద్ధికి ఉపయోగిద్దామంటూ ప్రభుత్వానికి ఈ నెల 23న ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి లేఖ రాశారు. అయితే గతంలో ఆయన ఈ స్థలాన్ని పార్కింగ్‌కు కేటాయించాలని వాదించారు. బస్టాండ్ ప్రాంతంలో రోడ్ల పైనున్న ఆటోలను ఇక్కడ పార్కింగ్ చేయిస్తే ట్రాఫిక్ సమస్యకు కాస్తయినా పరిష్కారం లభిస్తుందని చెప్పిన ఆయన పార్టీతో పార్టీ స్వరం కూడా మార్చేయడం స్థానికుల్లో చర్చకు తావిస్తోంది. ఎమ్మెల్యే లేఖను పరిశీలించిన ముఖ్యమంత్రి కార్యాలయం ఈనెల 24న జిల్లాలోని పశుసంవర్ధక శాఖ అధికారులకు పంపి నివేదిక కోరగా.. ఆ నిర్ణయం సరికాదంటూ వ్యతిరేకించినట్లు సమాచారం.
విక్రయం వద్దే వద్దు
పశు వైద్యశాల విక్రయ ప్రతిపాదనపై రాజకీయ పార్టీలు, వాపక్షాలు, మేధావుల నుంచి అభ్యంతరం వ్యక్తమవుతోంది. ప్రస్తుత పశువైద్యశాలను పట్టణానికి దూరంగా ఉన్న వైఎస్ నగర్‌కు తరలిస్తే.. రైతులకు ఇబ్బందులు తప్పవనే చర్చ జరుగుతోంది. అదేవిధంగా ప్రభుత్వం బహిరంగ వేలంలో స్థలాన్ని విక్రయానికి ఉంచితే.. బడా నేతలు చేతులు కలిపి కారుచౌకగా సొంతం చేసుకునే అవకాశం ఉందనే అభిప్రాయం వినిపిస్తోంది. ఇక బేరసారాలు.. బెదిరింపులు మామూలే.
అందువల్ల ఎంతో విలువైన స్థలాన్ని విక్రయించే ప్రతిపాదన వద్దే వద్దని బీజేపీ మాజీ కౌన్సిలర్ మేడా మురళి, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి ఊకొట్టు వాసు, సీపీఎం డివిజన్ కార్యదర్శి మస్తాన్‌వలి, సీపీఐ పట్టణ కార్యదర్శి బాబా ఫకృద్దీన్, రోడ్ల విస్తరణ పోరాట సమితి కన్వీనర్ శంకరయ్య తదితరులు బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నారు.
ముఖ్యమంత్రి దృష్టికి..
ఎమ్మెల్యే భూమా ప్రతిపాదనను పార్టీలోని ప్రత్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. అభివృద్ధి పనులు చేయాలంటే.. ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టాలని, ఆస్తులను అమ్మడం సరికాదని భావిస్తున్నట్లు ఆయన సన్నిహితుల ద్వారా తెలిసింది. స్థల విక్రయానికి సంబంధించిన ఫైలు ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్నందున.. నేరుగా చంద్రబాబు నాయుడునే కలిసి అభ్యంతరం తెలపాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
అభ్యంతరం ఎందుకంటే..
భవిష్యత్‌లో నంద్యాల జిల్లాగా ఏర్పాటయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత పశువైద్యల శాల స్థలాన్ని డిమాండ్ మరింత పెరగనుంది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో ఈ స్థలం విలువ రూ.25 కోట్లకు పైమాటే. భూమా ప్రతిపాదన మేరకు.. స్థలానికి బహిరంగ వేలం నిర్వహిస్తే అనుకూలురు దక్కించుకునే అవకాశం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదీ కాకుండా నేతలు రంగంలోకి దిగితే.. స్థలం రూ.5 కోట్లకు మించి కొనుగోలు చేసే పరిస్థితి ఉండదనేది జగమెరిగిన సత్యం.