విజయనగరం కంటోన్మెంట్: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేయనున్న అటల్ మిషన్ ఫర్ రిజువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్‌ఫర్‌మేషన్ (అమృత) పథకానికి జిల్లా కేంద్రాన్ని ఎంపిక చేశారు. లక్ష పైన జనాభా ఉండే నగరాల్లో ఈ పథకాన్ని అమలు చేస్తారు. రాష్ట్రంలోని 31 నగరాల్లో ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించగా, మన జిల్లాలో విజయనగరం పట్టణాన్ని ఎంపిక చేసినట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ పథకం అమలైతే అధికస్థాయిలో నిధులు విడుదలవుతాయి. విజయనగరం పట్టణం చాలా రంగాల్లో వెనుకబడి ఉంది. ఈ పథకంతో వివిధ కార్యక్రమాలకు నిధులు విడుదలై పట్టణం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందని ప్రజలు ఆశిస్తున్నారు. గతంలో ప్రారంభమై నిలిచిపోయిన పలు అభివృద్ధి పథకాలను ఈ పథకం కింద పునఃప్రారంభించి పూర్తి చేస్తారు.
మురికి వాడలకు మహర్దశ
జిల్లా కేంద్రంలో 2.75లక్షల జనాభా ఉన్నారు. విజయనగరంలో 72 గుర్తించిన మురికి వాడలున్నాయి. మరో ఎనిమిది గుర్తించని మురికి వాడలున్నాయి. ఉపాధి కోసం వివిధ ప్రాంతాల నుంచి జిల్లాకు వచ్చి స్థానికంగా ఉంటున్న వారు ఏటా పెరుగుతున్నారు. వీరికి సరిపడా సౌకర్యాలు మాత్రం పెరగడం లేదు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో ఈ ప్రాంతాల్లో పలు అంటు వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయి. దీంతో పట్టణంలోని మురికి వాడల్లో ఉన్న ప్రజలు ఏటా వైద్యం కోసం ఎక్కువ మొత్తాన్ని వెచ్చించాల్సి వస్తోంది. అమృత పథకం వల్ల మురికివాడల్లో సౌకర్యాలు మెరుగవుతాయి. వందశాతం వ్యక్తిగత మరుగుదొడ్లు ఉండేలా చర్యలు చేపడతారు. పారిశుధ్యానికి అధిక నిధులు వెచ్చిస్తారు.
రహదారులు...
పట్టణంలోని రహదారులు మరీ అధ్వాన్నంగా ఉన్నాయి. ప్రధాన రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ పథకం కింద రహదారులను అభివృద్ధి చేస్తారు. పట్టణం పరిధి విస్తరించనుండడంతో అన్ని ప్రాంతాలను కలుపుతూ రోడ్లు నిర్మిస్తారు. పార్కులు, ఇతర ప్రాంతాలను అభివృద్ధి చేస్తారు. నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతారు.
తాగునీరు..
జిల్లా కేంద్రంలో ఉన్న జనాభాకు అవసరమైన తాగునీరు లభించడం లేదు. ప్రతి మనిషికీ 20 లీటర్ల తాగునీరు కావాలంటే ఒక్క విజయనగరం పట్టణంలోని ప్రజలకే దాదాపు 34 ఎంఎల్‌డీల తాగునీరు అవసరమవుతుంది. కానీ ప్రస్తుతం కేవలం 16 ఎంఎల్‌డీల తాగునీరు మాత్రమే లభ్యమవుతోంది. ముషిడిపల్లి, నెల్లిమర్ల, రామతీర్థం ప్రాజెక్టుల నుంచి ప్రస్తుతం తాగునీరు సరఫరా అవుతోంది. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న పైపుల ద్వారా నీరు తీసుకోవాలంటే గోతులు తవ్వుకునే పరిస్థితి ఉంది. మురుగు కాలువల్లో ఉన్న పైపులు తుప్పిపట్టి పోతున్నాయి. వాటి ద్వారా సరఫరా అయ్యే తాగునీటినే ప్రస్తుతం ప్రజలు వినియోగిస్తున్నారు. కొత్త పథకం ద్వారా తాగునీరు పుష్కలంగా లభిస్తుంది.
జిల్లాకు అమృత్ కలశం
Published Sat, Jun 27 2015 1:40 AM | Last Updated on Sun, Sep 3 2017 4:25 AM
Advertisement
Advertisement