- ఎన్నికల పోటీలో కొత్త తరం
- రేసులో అనేకమంది
సాక్షి, తిరుపతి: వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు యువరక్తం తహతహలాడుతోంది. రేసులో ఉన్నవారిలో ఎక్కువమంది మాజీ మంత్రుల సంతానం కావడం గమనార్హం. ఇద్దరు యువకులు లోక్‌సభలో అడుగుపెట్టేందుకు ఉత్సాహం చూపుతున్నారు. మిగిలినవారు శాసనసభ నుంచి రాజకీయ భవిష్యత్తును పరీక్షించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.
మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గల్లా అరుణకుమారి, రెడ్డివారి చెంగారెడ్డి, గుమ్మడి కుతూహలమ్మ, గాలి ముద్దుకృష్ణమనాయుడుతో పాటు మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తినాయుడు తదితరుల పిల్లలు ఇప్పటికే ప్రత్యక్షంగానో పరోక్షంగానో రాజకీయ వ్యవహారాలు పర్యవేక్షిస్తున్నారు. ఈ ఎన్నికల్లో వారు పోటీ చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. రాజంపేట, గుంటూరు లోక్‌సభ స్థానాల నుంచి పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి గల్లా జయదేవ్ వేర్వేరు రాజకీయపార్టీల నుంచి పోటీ చేయనున్నారు. మిగిలిన వారు వివిధ శాసనసభ స్థానాల నుంచి పోటీ చేసేందుకు రాజకీయపార్టీల నుంచి టికెట్లు కోరుతున్నారు.
పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి
మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనయుడు పెద్దిరెడి మిథున్‌రెడ్డి. వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ తరఫున రాజంపేట లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాజీ మంత్రి. విద్యాధికుడైన మిథున్‌రెడ్డి ఇప్పటివరకు రాజకీయాల్లో తండ్రి విజయాలకు తెరవెనక పాత్ర పోషిస్తున్నారు. ఈ యువనేత ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయ అరంగేట్రంలోనే లోక్‌సభకు పోటీ చేయాలని భావిస్తున్నారు.
గల్లా జయదేవ్
మంత్రి గల్లా అరుణకుమారి కుమారుడు గల్లా జయదేవ్. తెలుగుదేశం పార్టీ తర ఫున గుంటూరు లోక్‌సభ స్థానానికి టికెట్టు ఖాయం చేసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. తల్లి గల్లా అరుణకుమారి రాష్ట్ర మంత్రివర్గంలో సభ్యులు. జయదేవ్ కుటుంబం ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపుతోంది.
రెడ్డివారి ఇందిర ప్రియదర్శిని
మాజీ మంత్రి రెడ్డివారి చెంగారెడ్డి కుమార్తె ఇందిరప్రియదర్శిని కొన్ని సంవత్సరాలుగా తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్నారు. కిందటిసారి నగరి నుంచి కాంగ్రెస్ టికెట్టు ఆశించిన ప్పటికీ అధిష్టానం అంగీకరించకపోవడంతో నిరాశకు గురయ్యారు. ఈసారి తెలుగుదేశం పార్టీ నుంచి టికెట్టు ఆశిస్తున్నారు. ఒకవేళ అవకాశం రాకపోతే స్వతంత్రంగా పోటీ చేసే యోచనలో ఉన్నట్టు సమాచారం.
గాలి జగదీష్
మాజీ మంత్రి, నగరి శాసనసభ్యులు గాలి ముద్దుకృష్ణమనాయుడు కుమారుడు గాలి జగదీష్. వ్యాపారాల్లో బిజీగా ఉంటూనే అవసరమైన సమయంలో తండ్రికి చేదోడువాదోడుగా ఉంటున్నారు. ప్రస్తుతం చంద్రగిరి, మదనపల్లె అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏదో ఒకచోట నుంచి టీడీపీ టికెట్టు ఆశిస్తున్నారు.
అనగంటి హరికృష్ణ
మాజీ మంత్రి, గంగాధరనెల్లూరు శాసనసభ్యులు గుమ్మడి కుతూహల మ్మ కుమారుడు అనగంటి హరికృష్ణ. విద్యాధికుడైన ఈయనను కింద టి ఏడాది తన రాజకీయ వారసుడుగా కుతూహలమ్మ పరిచయం చేశా రు. తెలుగుదేశం పార్టీ నుంచి గంగాధరనెల్లూరు టికెట్టు ఆశిస్తున్నారు.
నారా గిరీష్
చంద్రగిరి మాజీ శాసనసభ్యులు నారా రామ్మూర్తినాయుడు కుమారుడు నారా గిరీష్. ప్రస్తుతం చంద్రగిరి టీడీపీ టికెట్టు ఆశిస్తున్నారు.