- పురుషుల విభాగం విజేత జేఎన్‌టీయూ కాకినాడ
- మహిళల విజేతగా ‘సెయింట్ పోయిస్’
నూజివీడు, న్యూస్‌లైన్ : నూజివీడు డీఏఆర్ కళాశాలలో నాలుగు రోజులుగా నిర్వహించిన 38వ రాష్ట్రస్థాయి బాస్కెట్ పోటీలు ముగిశాయి. పురుషుల విభాగంలో కాకినాడ జేఎన్‌టీయూ జట్టు, మహిళల విభాగంలో హైదరాబాద్‌కు చెందిన సెయింట్ పోయిస్ జట్టు విజేతలుగా నిలి చాయి. సెమీస్, ఫైనల్‌తో పాటు రెండు విభాగాల్లో 3,4 స్థానాలకు ఆదివారం పోటీలు నిర్వహించారు. మహిళల, పురుషుల సెమీఫైనల్స్, ఫైనల్స్ పోటీలు ఆద్యంతం రసవత్తరంగా సాగాయి. మహిళల విభాగంలో వీటీహెచ్ నూజివీడు, జీఎస్‌సీ గుంటూరు జట్ల మధ్య జరిగిన తొలి సెమీఫైనల్ మ్యాచ్ ఆసక్తికరంగా సాగింది.
ఈ మ్యాచ్‌ను వీటీహెచ్ 38-23 పాయింట్ల తేడాతో గెలుచుకుని ఫైనల్‌కు చేరింది. రెండో సెమీఫైనల్ మ్యాచ్‌లో హైదరాబాద్‌కు చెందిన సెయింట్ పోయిస్ జట్టు మార్టేరుకు చెందిన వైబీఏ జట్టుపై 48-22 పాయిట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో వీటీహెచ్ నూజివీడు, సెయింట్ పోయిస్ హైదరాబాద్ జట్లు ఫైనల్‌కు చేరాయి. మూడు, నాల్గో స్థానాల కోసం నిర్వహించిన మ్యాచ్‌లో మార్టేరు వైబీఏ జట్టు గుంటూరు జీఎస్‌సీపై 32-29 తేడాతో గెలిచి మూడోస్థానంలో నిల వగా, గుంటూరు జట్టు నాల్గో స్థానంతో సరిపెట్టుకుంది.
పురుషుల విభాగంలో తొలి సెమీఫైనల్ మ్యచ్ జేఎన్‌టీయూ(కే), అనంతపురం మధ్య జరిగింది. జేఎన్‌టీయూ(కే) 78-56 పాయింట్ల తేడాతో గెలిచి ఫైనల్‌కు చేరింది. రెండో సెమీఫైనల్ మ్యాచ్‌లో సౌత్‌సెంట్రల్ రైల్వే విజయవాడ జట్టు నెల్లూరు పై 45-25 స్కోరుతో విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది. అనంతరం మూడు, నాలుగు స్థానాలకు జరిగిన పోటీలో అనంతపురం జట్టు నెల్లూరు జట్టుపై 54-39 తేడాతో గెలిచింది. దీంతో అనంతపురం మూడోస్థానం, నెల్లూరు నాల్గో స్థానంలో నిలిచాయి.
హోరాహోరీగా మహిళల ఫైనల్ మ్యాచ్
మహిళ ఫైనల్ మ్యాచ్ హైదరాబాద్‌కు చెందిన సెయింట్ పోయిస్, నూజివీడు వీటీహెచ్ జట్ల మధ్య హోరాహోరీగా సాగింది. మొదటి క్వార్టర్‌లో వీటీహెచ్ ఆధిక్యంలో ఉండగా, తొలిఅర్ధభాగం ముగిసే సరికి 27-26 తేడాతో సెయింట్ పాయిస్ స్వల్ప ఆధిక్యంలోకి వెళ్లింది. అనంతరం సెయింట్ పోయిస్ జట్టుకు చెందిన పూర్ణిమ అలవోకగా బాస్కెట్‌లు వేసి పాయింట్లు సాధించడంతో చివరకు సెయింట్‌పోయిస్ జట్టు 57-46 స్కోరుతో వీటీహెచ్‌పై గెలిచి కప్‌ను కైవసం చేసుకుంది. మొత్తం పాయింట్లలో పూర్ణిమ ఒక్కరే 31పాయింట్లు సాధించారు. వీటీహెచ్ జట్టులో స్రవంతి 27 పాయింట్లు సాధించారు. పురుషుల ఫైనల్ మ్యాచ్ ఏకపక్షంగా సాగింది. జేఎన్‌టీయూ కాకినాడ, సౌత్‌సెంట్రల్ రైల్వే విజయవాడ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో 60-37స్కోరుతో జేఎన్‌టీయూ కాకినాడ జట్టు విజయం సాధించి విజేతగా నిలిచింది. సౌత్‌సెంట్రల్ రైల్వే జట్టు రన్నర్‌గా మిగిలింది.
నూజివీడుకే గర్వకారణం
ఏ టోర్నీ జరగని విధంగా 38 ఏళ్లుగా రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ టోర్నీ నిర్వహించడం నూజివీడుకే గర్వకారణమని మాజీ ఎమ్మెల్యే మేకా వెంకటప్రతాప్‌అప్పారావు అన్నారు. రాజా వెంకటాద్రి అప్పారావు స్మారక 38వ రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీల బహుమతి ప్రదానోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ నూజివీడులో స్టేడియం నిర్మించాలనే తనకోరికను నెరవేర్చేందుకు కృషిచేస్తున్నానని పేర్కొన్నారు. పోటీల నిర్వహణకు సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. టీడీపీ నాయకుడు కాపా శ్రీనివాసరావు క్రీడలలో ప్రావీణ్యత ప్రదర్శించడం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకోవచ్చన్నారు. డీఏఆర్ కళాశాల పాలకవర్గం సెక్రటరీ బొబ్బిలి కొండలరావు, ప్రిన్సిపాల్ జి.వి.రామారావు, పీడీ అంజాద్ అలీ, టీడీపీ పట్టణాధ్యక్షుడు నూతక్కి వేణు పాల్గొన్నారు. విజేతలుగా నిలిచిన జట్లకు కప్, షీల్డులను అందజేశారు.
సీనియర్ క్రీడాకారులకు సన్మానం
బాస్కెట్‌బాల్ క్రీడలను నూజివీడులో ప్రారంభించిన సమయంలో నూజివీడు జట్టుకు ఆడి అనేక కప్‌లు సాధించిన వెటర్నర్ క్రీడాకారులు పలగాని పిచ్చయ్య, జి.ఇందిర, బాలాజీసింగ్‌ను మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కన్వీనర్ మేకా వెంకటప్రతాప్‌అప్పారావు, పార్టీ నాయకుడు లాకా వెంగళరావుయాదవ్, టీడీపీ నాయకులు కాపా శ్రీనివాసరావు, నూతక్కి వేణు ఘనంగా సన్మానించారు.