‘వ్యయ’సాయం చేయలేక రైతన్న చతికిలపడుతున్నాడు. రబీ.. ఖరీఫ్.. ఏదో ఒకటి కలసి రాకపోతుందా అనే ఆశే తప్పిస్తే.. నాలుగు రాళ్లు మిగలని దయనీయ పరిస్థితి. జూదంగా మారిన సాగులో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడంతోనే ఆయన జీవితం గడచిపోతోంది. ఆకాశాన్నంటిన ఉల్లి, టమాట ధరలు ఒక్కసారిగా నేలచూపులు చూడటంతో పెట్టుబడి
కూడా చేతికందక రైతాంగం ఉక్కిరిబిక్కిరవుతోంది.
కర్నూలు(అగ్రికల్చర్), న్యూస్‌లైన్: పది మందికి అన్నం పెట్టే చేతులు.. నేడు చేయి చాస్తే తప్ప పూటగడవని దైన్యం. మట్టినే నమ్ముకున్న రైతులకు చివరకు మట్టే తప్ప ఏమీ మిగలని రోజులివి. ప్రకృతే కాదు.. ప్రభుత్వం కూడా వీరి బాధలను పంచుకునే బాధ్యత విస్మరించింది. అప్పులు చేయడం.. ఆశల జూదంలోకి కాడి దింపడం.. ఆ తర్వాత షరా మామూలుగా అప్పుల ఊబిలో కూరుకుపోవడం అన్నదాతకు పరిపాటిగా మారింది. తాజాగా ఉల్లి,టమాట పంటలు రైతులను నిలువునా ముంచేశాయి.
గిట్టుబాటు ధర లేకపోవడంతో దళారీలు నిర్ణయించిన మొత్తానికే సంవత్సరం కష్టార్జితాన్ని తెగనమ్ముకుంటున్నారు. మూడు నెలల క్రితం వరకు ఉల్లి, టమాట ధరలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేశాయి. తాజాగా ధరలు పడిపోవడంతో రైతుల పరిస్థితి దారుణంగా తయారైంది. మూడు నెలల క్రితం కిలో టమాట ధర రూ.50లకు చేరుకోగా.. ప్రస్తుతం 25 కిలోల గంపకు రూ.25లు కూడా దక్కకపోవడం రైతుల దీనస్థితికి నిదర్శనం. రబీ సీజన్‌లో జిల్లా మొత్తం మీద 5వేల ఎకరాల్లో టమాట సాగయింది. మొత్తం పంట ఒకేసారి మార్కెట్‌లోకి రావడంతో డిమాండ్ తగ్గిపోయింది. దీనికి తోడు కర్ణాటక రాష్ట్రంలో పండిన టమాట రాష్ట్రంలోని అన్ని జిల్లాలను ముంచెత్తుతోంది. ఫలితంగా ధరలు అనూహ్యంగా పడిపోయాయి. నష్టాలను భరించలేక దేవనకొండ, పత్తికొండ, తుగ్గలి, మద్దికెర, ఆలూరు, ఆస్పరి ప్రాంతాల్లోని రైతులు పంటను పశువులకు వదిలేస్తున్నారు. టమాట ఆధారిత జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటు కలగా మారడంతో ఏటా రైతులు నష్టాలను మూటగట్టుకుంటున్నారు. అయితే రైతుల కష్టాలను ప్రభుత్వం ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఉల్లి రైతుల పరిస్థితీ ఇదేవిధంగా ఉంది. క్వింటా ఉల్లి ధర రూ.600లకు పడిపోయిందంటే ఏ స్థాయిలో నష్టాలు వస్తున్నాయో తెలియజేస్తోంది. రబీలో దాదాపు 18వేల ఎకరాల్లో ఉల్లి పంట సాగు చేశారు. దీనికి తోడు మహారాష్ట్రలో పండిన ఉల్లి రాష్ట్రాన్ని ముంచెత్తుతుండటంతో ధర ఆకాశం నుంచి నేలను తాకింది.
రబీలో ఉల్లి పండించిన రైతుల్లో 80 శాతం మంది నష్టాలతో కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. టమాట, ఉల్లి పంటలకు మద్దతు ధర లేకపోవడంతో రైతులు బతుకులు గాలివాటమయ్యాయి. జిల్లాలో ఉల్లి ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు ప్రయత్నాలు జరిగినా ఆచరణలో సాధించలేకపోయారు. మహారాష్ట్రకు వెళ్లి అధ్యయనం చేసినా.. ఆ తర్వాత పట్టించుకోకపోవడంతో రైతుల బతుకులు దర్భరంగా మారుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం ఉల్లి, టమాట రైతులను ఆదుకునే దిశగా చర్యలు చేపట్టాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
పెట్టుబడి కూడా చేతికందలేదు
రబీ సీజన్‌లో 4 ఎకరాల్లో ఉల్లి సాగు చేసి రూ.50 వేలు నష్టపోయాను. మూడు నెలల క్రితం గాలివాటంగా పెరిగిన ధర ఒక్కసారిగా పడిపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తింది. ఎకరాకు రూ.30వేల పెట్టుబడి పెట్టగా.. పంటను అమ్ముకుంటే రూ.70వేలు మాత్రమే చేతికందింది. పెట్టుబడి కూడా దక్కకపోతే ఎలా బతికేది. ప్రభుత్వం ఉల్లి దిగుబడులకూ మద్దతు ధర ప్రకటించాలి.
- రామనాయుడు, రైతు, పులకుర్తి, కోడుమూరు మండలం
పంటను పశువులకు వదిలేశాం
బోరు కింద ఎకరాకు రూ.15వేలకు పైగా ఖర్చు చేసి మూడెకరాల్లో టమాట పంట సాగు చేశాం. విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోయినా రాత్రి, పగలు కష్టించాం. దిగుబడి బాగున్నా గిట్టుబాటు ధర లేకపోవడంతో పెట్టుబడి కూడా దక్కలేదు. 25 కేజీల టమాట గంప రూ.10 నుంచి రూ.20లు పలుకుతోంది. కూలీకి రూ.100, మార్కెట్‌కు తరలించేందుకు ఆటో బాడుగ రూ.10, కమీషన్ రూ.10 చెల్లించాల్సి వస్తోంది. గిట్టుబాటు కాకపోవడంతో పంటను పశువులకు వదిలేశాం.
- హనుమంతమ్మ, మహిళా రైతు, జొన్నగిరి
బతుకు ముళ్లపాన్పు
Published Mon, Feb 10 2014 3:26 AM | Last Updated on Tue, Oct 30 2018 5:51 PM
Advertisement
Advertisement