తూర్పు గోదావరి జిల్లా తాళ్లరేవు మండలం ఉప్పంగల గ్రామ ఎస్సీ పేటకు చెందిన కౌలు రైతు గుత్తాల నారాయణమూర్తి (53) సోమవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. రెండెకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని నారాయణమూర్తి సాగు చేస్తున్నాడు. రుణమాఫీ అమలు కాకపోవడంతో రూ.3 లక్షల వరకూ ఉన్న అప్పు ఎలా తీర్చాలా అని ఆందోళనకు గురయ్యాడు.
అయితే, ఈ ఏడాది పంటలు బాగుండడంతో ఎంతో కొంత అప్పు తీరుద్దామనుకున్నాడు. కానీ, అకాల వర్షాలతో పంటకు నష్టం వాటిల్లింది. దీంతో నారాయణమూర్తి మరింత కుంగిపోయాడు. ఈ నేపథ్యంలో సోమవారం పొలంలో ఉండగా ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. స్థానికులు యానాం ప్రభుత్వాస్పత్రికి తీసుకువెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడ నుంచి కాకినాడ ప్రభుత్వాస్ప్రత్రికి తీసుకు వెళుతుండగా మార్గమధ్యంలోనే నారాయణమూర్తి మృతి చెందాడు.