అతివేగం.. నిద్రమత్తు | The fastest .. Drowse | Sakshi
Sakshi News home page

అతివేగం.. నిద్రమత్తు

Published Sun, Jan 19 2014 3:44 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM

The fastest .. Drowse

 నకిరేకల్, న్యూస్‌లైన్: అతివేగం..నిద్రమత్తు నలుగురి ప్రాణాలను బలిగొంది. వారంతా ఇంజినీరింగ్ వర్క్స్ షాపు నడుపుతూ వ్యాపారం సాగిస్తున్నారు. ప్రభుత్వం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో 50శాతం సబ్సిడీపై రైతులకు పంపిణీ చేసే యాంత్రీకరణ పరికరాలను తయారు చేస్తారు.
 
 దీనిలో భాగంగా నల్లగొండ వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశానికి సూర్యాపేట నుంచి ఆరుగురు ఇంజినీరింగ్ వర్క్స్‌షాప్ యజమానులు బొలెరో వాహనంలో వెళ్లి తిరిగి వస్తుండగా మృత్యువు వెంటాడింది. ఆగి ఉన్న లారీని వీరి వాహనం వెనకనుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో ఇద్దరు మృత్యువుతో పోరాడుతున్నారు. వాహనం అయితే నుజ్జునుజ్జయింది. ఈ ఘోరం నకిరేకల్ శివారు దేవి పెట్రోల్ బంక్ సమీపంలోని నగేష్ హోటల్ వద్ద జాతీయ రహదారిపై శనివారం మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో జరిగింది.  
 
 అతివేగంతో.... అదుపుతప్పి..  
 సూర్యాపేటకు అతివేగంతో బొలెరో వాహనం వెళ్తున్నది. నకిరేకల్ శివారులోని దేవి పెట్రోల్‌బంక్ సమీపంలో నగేష్ హోటల్ ముందు లారీ డ్రైవర్ భోజన నిమిత్తం రోడ్డు పక్కన దూరంగానే లారీని ఆపాడు. బొలెరో వాహనం అక్కడికిరాగానే అదుపుతప్పి ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఆ సమయంలో వాహనాన్ని బొడ్డు నాగయ్య నడుపుతున్నాడు. ఒక్కక్షణంలో అంతా తారుమారైంది. బొలెరో వాహనం 40 మీటర్ల దూరంలో ఎగిరి పడి డివైడర్‌పై పల్టీలు కొట్టింది. వాహనం పైకప్పు పూర్తిగా లేచిపోయి నుజ్జునుజ్జయింది.
 
 ఇరుక్కుపోయిన మృతదేహాలు
 నుజ్జునుజ్జయిన వాహనంలో నూకల నర్సిం హారెడ్డి(48), కోదాటి జగదీష్(30), వాసంపల్లి లింగారెడ్డి(50), వంగేటి నర్సింహారెడ్డి (45)  అక్కడికక్కడే మృతిచెందారు. మృతదేహాలు అందులో ఇరుక్కుపోయాయి.  వాహనం నడుపుతున్న  బొడ్డు నాగయ్యకు కాళ్లు, చేతులు విరిగాయి. మరో యజమాని కొండ శ్రీనివాస్ తల, కాళ్లు చేతులకు బలమైన దెబ్బలు తగిలాయి.
 
 విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి  చేరుకున్నారు. స్థానికుల సహకారంతో ఇరుక్కుపోయిన మృతదేహాల ను బయటికి తొలగించారు. క్రేన్  సాయంతో బొలెరో వాహనాన్ని పక్కకు తొలగించారు. కొండ శ్రీనివాస్, బొడ్డు నాగయ్యలను చికిత్స నిమిత్తం నకిరేకల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వీరిద్దరికి ప్రాథమిక చికిత్స చేశారు. శ్రీనివాస్ పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌కు తరలించారు. మృతుల్లో ఒకరైన నూకల నర్సింహారెడ్డి ఇంజినీరింగ్ వర్క్స్‌షాప్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. కాగా, ఇదే ప్రాంతంలో గతంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొని ఐదుగురు ప్రయాణికులు మృతిచెందారు.
 
 జేడీఏ సందర్శన..
 సంఘటన విషయం తెలుసుకున్న జేడీఏ నర్సింహారావు హుటాహుటిన నకిరేకల్‌కు చేరుకున్నారు. ప్రమాదం పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ‘ఇంజనీరింగ్ వర్క్స్ షాపు యజమానులంతా వారు పంపిణీ చేసే వ్యవసాయ యాంత్రీకరణ పరికరాల పనినిమిత్తం తనను కలిసేందుకు వచ్చారు. ఆ తరువాత వెళ్లిపోయారు. ఇది చాలా ఘోరమైన సంఘటన’ అని పేర్కొన్నారు.
 
 డీఎస్పీ పరిశీలన..
 నల్లగొండ డీఎస్పీ రామోహన్‌రావు ప్రమాద ఘటనను పరిశీలించారు. సీఐ శ్రీనివాసరావుతో ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నా రు. బొలెరో వాహనం నడుపుతున్న నాగయ్య అతివేగంగా నడుపుతూ నిద్ర మత్తులోకి జారుకోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు.  పూర్తి విచారణ చేస్తామని చెప్పారు.
 
 ఒక్క సారిగా కళ్లు మూతపడ్డాయి :  బొడ్డు నాగయ్య
 మధ్యాహ్నం నల్లగొండలోని ఓ హోటల్‌లో భోజనం చేసి సూర్యాపేటకు బయలుదేరాం. వాహనం కూడా చాలా స్పీడ్‌లోనే ఉంది. ఒక్కసారిగా కళ్లు మూత పడ్డాయి. ఎదో అడ్డువస్తున్నట్లు అనిపించింది. వాహనంలో ఉన్న వారు కూడా నన్ను కంగారు పెట్టారు. అప్పుడు ఎం జరిగిందో అర్థం కాలేదు. ఆ తరువాత స్టీరింగ్ కింద ఇరుక్కుపోయాను. కాళ్లు చేతులు పని చేయడంలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement