అందరూ దీపావళికి పండుగ చేసుకుంటే...కొందరు అధికారులు మాత్రం దీపావళికి ముందే పండుగ చేసుకుంటున్నారు. బాణసంచా విక్రయాలకు సంబంధించిన లెసైన్స్‌ల జారీలో అందినకాడికి దండుకుంటున్నారు. వ్యాపారులు లెసైన్స్ కోసం అర్జీ ఇచ్చినప్పటి నుంచి లెసైన్స్ చేతికి వచ్చేదాకా ముడుపులు చెల్లించక తప్పడం లేదు.
సాక్షి, కడప: దీపావళి పండుగ సందర్భంగా వ్యాపారులకు టపాసుల వ్యాపారం ఎలా జరుగుతుందో ఏమో కానీ అధికారులకు మాత్రం కాసుల వర్షం కురిపిస్తోంది. బాణసంచా అమ్మకాల కోసం ఏర్పాటు చేసే స్టాళ్లకు లెసైన్సులు మంజూరు చేసే విషయంలో అధికారులు అందినకాడికి దోచుకుంటున్నారు. నాలుగు ప్రధాన శాఖలు దోపిడీకి తెగబడ్డాయి. ఒక్కో లెసైన్స్‌కు 10వేల రూపాయలు ఖర్చవుతోందని వ్యాపారులే బాహాటంగా చెబుతున్నారు.
ముడుపుల చెల్లింపులు ఇలా ..
బాణసంచా దుకాణపు లెసైన్స్ కోసం మొదట కలెక్టర్‌కు అర్జీ పెట్టుకోవాలి. ఐదుసెట్లలో అర్జీ సమర్పించాలి. వీటిని అగ్నిమాపకశాఖ, విద్యుత్, పోలీస్, ఆర్డీవోకు కాపీలు పంపుతారు. ఎమ్మార్పీలకు సంబంధించి ఆర్డీఓ కార్యాలయం ఎన్‌ఓసీ(నో అబ్జక్షన్ సర్టిఫికెట్) జారీ చేయాలి. ఇక్కడ తొలుత ఫైలుకు 500-1000 రూపాయలు చెల్లించాలి. ఆపై అగ్నిమాపకశాఖ కార్యాలయం వారు ఎన్‌ఓసీ ఇవ్వాలి. ఇక్కడ 5-7వేల రూపాయల వరకూ వసూలు చేస్తున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఆ తర్వాత విద్యుత్ శాఖకు సంబంధించి ఎస్‌పీడీసీఎల్ కార్యాలయంలోనూ వెయ్యి రూపాయలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. చివర్లో పోలీసుశాఖకు సంబంధించి సీఐ, డీఎస్పీలు క్లియరెన్స్ ఇవ్వాలి. ఇక్కడ 1000-2వేల రూపాయల వరకూ వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఇలా మొత్తం మీద ఒక్కో లెసైన్స్‌కు వ్యాపారులకు 10వేల రూపాయలకుపైగానే ఖర్చవుతోంది.
జిల్లా వ్యాప్తంగా 256 దరఖాస్తులు:
బాణసంచా విక్రయాల దుకాణాల ఏర్పాటు కోసం జిల్లాలో బుధవారం సాయంత్రానికి 256 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో కడప నగర పరిధిలోనివే 82 దరఖాస్తులు ఉన్నాయి. వీటికి అగ్నిమాపకశాఖ క్లియరెన్స్ ఇచ్చి కలెక్టరుకు ఫైలు పంపాల్సి ఉంది. ముడుపుల చెల్లింపుల విషయం బాహాటంగా అందరికీ తెలుస్తున్నా ఎవ్వరూ తెలీనట్లే వ్యవహరిస్తున్నారు. విద్యుత్‌శాఖకు సంబంధించి ఎస్‌ఈ, అగ్నిమాపకశాఖ తరఫున డీఎఫ్‌ఓ( జిల్లా అగ్నిమాపకశాఖ అధికారి), రెవెన్యూకు సంబంధించి ఆర్డీవో క్లియరెన్స్ ఇవ్వాలి. వారం రోజులుగా ఈ ముడుపుల తతంగం జరుగుతున్నా ఏ ఒక్కశాఖ ఉన్నతాధికారి కూడా నివారణ చర్యలు చేపట్టలేదు. ఈ క్రమంలో స్టాళ్లు ఏర్పాటు చేసిన నిర్వాహకులు భారీ ధరలకు బాణసంచా విక్రయాలు జరిపే అవకాశం లేకపోలేదు. దీంతో చివరగా వినియోగదారుడిపైనే భారం పడనుంది.
విచారించి చర్యలు తీసుకుంటాం: వీరభద్రయ్య, అగ్నిమాపకశాఖ జిల్లా అధికారి.
లెసైన్స్‌ల జారీకి డబ్బులు తీసుకోవడం చాలా తప్పు. లెసైన్స్‌లకు డబ్బులు తీసుకోవడంపై విచారణ చేపడతాం. బాధ్యులైనవారిపై చర్యలు తీసుకుంటాం. ఎవ్వరైనా డబ్బులు అడిగితే వ్యాపారులు నన్ను సంప్రదించాలి. నేను లెసైన్స్ ఇచ్చేలా చూస్తా.
దీపావళి దందా !
Published Thu, Oct 31 2013 2:29 AM | Last Updated on Sat, Sep 2 2017 12:08 AM
Advertisement
Advertisement