crackers business
-
జోరందుకున్న టపాసుల కొనుగోళ్లు!
సాక్షి, సిటీబ్యూరో: దీపావళికి టపాసులు కాల్చాలా.. వద్దా..? అనే సందేహానికి తెరపడింది. దేశ సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో నగరవ్యాప్తంగా టపాసుల కొనుగోళ్లు జోరందుకున్నాయి. రాత్రి 8 నుంచి 10 గంటల వరకు మాత్రమే బాణాసంచా కాల్చుకునేందుకు అనుమతి లభించడంతో అన్ని వర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. నగరంలోని బేగంబజార్, మోండా మార్కెట్, సికింద్రాబాద్, మెహిదీపట్నం, దిల్సుఖ్నగర్, కూకట్పల్లి తదితర ప్రాంతాల్లోని టపాసుల దుకాణాలు వినియోగదారులతో కిటకిటలాడాయి. తక్కువ కాలుష్యం ఉండే టపాసుల కొనుగోలుకే నగరవాసులు ఆసక్తి కనబరుస్తున్నారు. అధిక శబ్దం లేని ఎక్కువ వెలుగులు విరజిమ్మే వాటినే కొనుగోలుచేస్తున్నారు.రెండు గంటల నిబంధన ఎలా అమలవుతుందన్నఅంశం సస్పెన్స్‌గా మారింది. కాలుష్యం లేకుండాజాగ్రత్తలు తీసుకుంటామని గ్రేటర్ వాసులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే కొందరు ఇళ్లను విద్యుత్ కాంతులతో అందంగా ముస్తాబు చేశారు. కోవిడ్ సెకండ్‌వేవ్ ముప్పుతో ఈసారి సర్వత్రా పర్యావరణ స్పృహ, టపాసుల కాలుష్యంపై అవగాహన పెరిగిందని పర్యావరణ వేత్తలు పేర్కొంటున్నారు. ఏ రంగు బాణసంచాలో.. ఏ కాలుష్యకారకాలంటే..? తెలుపు: అల్యూమినియం, మెగ్నీషియం, టైటానియం ఆరెంజ్: కార్బన్, ఐరన్ పసుపు: సోడియం కాంపౌండ్లు నీలం: కాపర్ కాంపౌండ్లు ఎరుపు: స్ట్రాన్షియం కార్బోనేట్ గ్రీన్: బేరియం మోనో క్లోరైడ్స్ సాల్ట్స్ కాల్చుకోవచ్చు.. సుప్రీం మధ్యంతర ఉత్తర్వుల నేపథ్యంలో గ్రేటర్ సిటిజన్లు ఇంటిల్లిపాదీ క్రాకర్స్ కాల్చుకునేందుకు 2 గంటల పాటు అనుమతి లభించింది. రాత్రి 8–10 గంటల మధ్య కాకుండా మిగతా సమయాల్లో.. సాయంత్రం 6 నుంచి అర్ధరాత్రి వరకు పెద్ద ఎత్తున టపాసులు కాల్చే వారి విషయంలో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనే అంశంపై మరికొన్ని గంటల్లో స్పష్టతరానుంది. కాలుష్యంతో జాగ్రత్త.. టపాసుల కాలుష్యంతో పెద్ద ఎత్తున వెలువడే సూక్ష్మ, స్థూల ధూళికణాలు గాల్లో చేరి సిటిజన్ల ఊపిరితిత్తులకు చేటుచేస్తాయని పర్యావరణ వేత్తలు, వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇక నైట్రేట్లు, సల్ఫర్‌డయాక్సైడ్ తదితర విషవాయువులు కోవిడ్ రోగులు, ఇటీవలే కోలుకున్నవారు ఇతర ఆరోగ్య సమస్యలున్నవారు, చిన్నారులు, వృద్ధులను ఉక్కిరిబిక్కిరి చేస్తాయని, ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలంటున్నారు. అప్రమత్తతే రక్ష దీపావళి టపాసులు కాల్చే సమయంలో ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా కంటి చూపు శాశ్వతంగా కోల్పోయే ప్రమాదం ఉంది. పిల్లలు టపాసులు కాల్చే సమయంలో తల్లిదండ్రులు వారి దగ్గరే ఉంటూ జాగ్రత్తలు చెబుతుండాలి. ఇళ్లలో పెంపుడు జంతువులు, పక్షులు ఉంటే మరింత అప్రమత్తంగా ఉండాలి. ప్రతి సంవత్సరం గ్రేటర్లో వందల సంఖ్యలో మూగజీవాలు గాయపడుతున్నాయి. అందరూ పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడుతూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు, పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు. కోవిడ్ బాధితులపై ప్రభావం బాణసంచా కాల్చడంతో హానికర రసాయనాలు వెలువడతాయి. ఇవి ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. హోం ఐసోలేషన్‌లో ఉన్న కోవిడ్–19 బాధితులపై మరింత ప్రభావం చూపుతుంది. ఆస్తమా బాధితులు, చిన్నారులు, వృద్ధులు, ఇతర వ్యాధిగ్రస్తులు చలికాలంలో అప్రమత్తంగా ఉండాలి. బర్నాల్, దూది, అయోడిన్, డెట్టాల్‌తో కూడిన ఫస్ట్ ఎయిడ్ కిట్‌ను అందుబాటులో ఉంచుకోవాలి. – ప్రశాంత్, పల్మొనాలజిస్ట్, రెనోవా ఆస్పత్రి కళ్లద్దాలు ధరించాలి వంటగదిలోని గ్యాస్ సిలిండర్, ఆయిల్ డబ్బాలకు దూరంగా టపాసులను ఉంచాలి. ఒకసారి ఒక్కరే టపాకాయలు కాల్చాలి. మిగిలిన వారు దూరంగా ఉండేలా చూడాలి. పక్కనే రెండు బకెట్లలో నీళ్లు ఉంచుకోవాలి. ప్రమాదవశాత్తు మిణుగురులు చర్మంపై పడితే కాలిన చోట నీళ్లు పోయాలి. బాణసంచా కాల్చే సమయంలో కళ్లద్దాలు ధరించాలి. కళ్లకు గాయాలైతే వెంటనే ఆస్పత్రికి వెళ్లాలి. – డాక్టర్ మురళీధర్ రామప్ప, కంటివైద్య నిపుణుడు, ఎలీ్వప్రసాద్ ఆస్పత్రి విద్యుత్ లైన్ల కింద వద్దు బాణసంచా గోదాములు, దుకాణాలు, ఇళ్లు, జనం రద్దీంగా ఉంటే ప్రాంతాలు, పెట్రోల్ బంకులకు దూరంగా టపాసులు కాల్చాలి. కాలుతున్న కొవ్వొత్తులు, దీపాల పక్కన టపాసులు పెట్టవద్దు. సీసా, రేకు డబ్బా, బోర్లించిన కుండ వంటి పాత్రల్లో టపాసులు కాల్చడం వల్ల ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. తారా జువ్వలను విద్యుత్ లైన్ల కింద కాలిస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. – నక్క యాదగిరి, సభ్యుడు, తెలంగాణ ఎలక్ట్రికల్ లైసెన్సింగ్ బోర్డు -
‘శివకాశి’తుస్!
సాక్షి, చెన్నై : తమిళనాట బాణ సంచాల తయారీలో ప్రసిద్ధి చెందిన జిల్లా విరుదునగర్. ఈ జిల్లాలో ఉన్న శివకాశి పట్టణాన్ని మినీ జపాన్‌గా పిలుస్తుంటారు. ఈ పట్టణ, శివారుల్లోని గ్రా మాలలో ప్రజల ప్రధాన జీవనాధారం బాణ సంచా తయారీ. కుటీర పరిశ్రమల తరహాలో ఒకప్పుడు ప్రతి ఇంట్లోనూ బాణ సంచాల్ని త యారు చేసేవారు. అనేక కుటుంబాలు వంశపారంపర్యంగా ఈ తయారీ సాగిస్తూ వచ్చేవారు. అందుకే ఇక్కడ ప్రతి ఏటా దీపావళి వస్తుంటే ప్రజల గుండెల్లో దడ తప్పదు. నిత్యం ప్రమాదాలు, మరణాలు, క్షతగ్రాతులతో ఆస్పత్రుల్లో ఆర్తనాలు మిన్నంటేవి. ప్రమాదాల నివారణ లక్ష్యంగా పాలకులు తీసుకున్న నిర్ణయాలు, కొ రడా ఝుళిపించడంతో కుటీర, వంశపారంపర్య పరిశ్రమలన్నీ కనుమరుగయ్యాయి. వేలల్లో ఉ న్నపరిశ్రమలు, వందలకు పరిమితమయ్యాయి. ఆంక్షల కొరడా శివకాశి పరిసరాల్లో ఏడేళ్ల క్రితం వరకు సుమా రు ఎనిమిది వేల వరకు చిన్న తరహా కుటీర పరిశ్రమలుండేవి. మరో 400 వరకు పెద్ద పరిశ్రమలు ఉండేవి. గతంలో జరిగిన సర్వే మేరకు ఈ వివరాలు బయట పడ్డాయి. ఇక్కడి ప్రజల బతుకులు బాణసంచా మందుగుండు సామగ్రి కి బుగ్గి పాలు అవుతున్నట్టు ఆ సర్వే తేటతెల్లం చేసింది. ఇక్కడి ప్రజల జీవన స్థితిని మెరుగు పరచడం, బాణ సంచా పరిశ్రమల్లో బతుకు నాశనం చేసుకుంటున్న చిన్న పిల్లల్ని విద్యాపరంగా ప్రోత్సహించేందుకు పాలకులు చర్యలు చేపట్టారు. ఇదిలావుండగా ఇక్కడ ప్రతి కుటుం బంలోనూ తల్లిదండ్రులతో పాటుగా యుక్త వయస్సుకు వచ్చిన యువతీ, యువకులు ఏదో ఒక పరిశ్రమలో పనిచేయక తప్పదు. వీరికి రోజు వారీగా పీస్ రేట్(ఎన్ని బాణ సంచాలు తయారు చేస్తారో) దాని ఆధారంగా వారానికి లేదా నెలకో వేతనాలు ఇవ్వడం జరిగేది. ఈ పరిశ్రమల్లో దినదిన గండంతో కాలాన్ని నెటుకొస్తూ, ప్రమాదాలతో ఛిద్రం అవుతున్న కార్మిక బతుకుల్ని పరిగణలోకి తీసుకున్న పాలకులు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ఆంక్షలు, కొరడా ఝుళిపించారు. రెండేళ్లుగా ప్రమాదాల సంఖ్య తగ్గించారు. తగ్గిన ఉత్పత్తి ఒకప్పుడు నిత్యం బాణసంచా తయారీ సాగితే, ఆంక్షలు కొరడాల రూపంలో జూన్ లేదా జూలైలో మొదలెట్టి దీపావళి నాటికి ముగించే పనిలో పడ్డారు. ఈ పరిస్థితుల్లో గత ఏడాది నుంచి బాణసంచా ఉత్పత్తి అన్నది క్రమంగా తగ్గించుకోవాల్సిన వచ్చింది. గత ఏడాది 20 శాతం ఉత్పత్తి తగ్గగా, ఈ సారి 40 శాతం ఉత్పత్తి తగ్గడంతో పనులు లేక కార్మికులు కష్టాలు పడాల్సిన పరిస్థితి. గతంలో జరిగిన ఉత్పత్తి, డిమాండ్ మేరకు ఉత్తరాది నుంచి సైతం ఇక్కడికి వచ్చి పనుల్లో నిమగ్నమైన వాళ్లూ ఉన్నారు. ప్రస్తుతం ఉత్పత్తి తగ్గడంతో ఆ కార్మికులకు మిగిలింది కన్నీళ్లే. ప్రస్తుతం పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణలో భాగంగా కోర్టు బాణ సంచాల తయారీకి కట్టుదిట్టమైన ఆంక్షలు, నిబంధలన్ని విధించింది. గ్రీన్ బాణ సంచాల ఉత్పత్తి మాత్రమే చేయాలన్న ఆదేశాలు జారీచేసింది. శివకాశిలో ఈ ఏడాది ఆ దిశగానే ముందుకు సాగాల్సిన పరిస్థితి ఎదురైంది. కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో అన్న ఎదురు చూపులతో ఈ ఏడాది ఉత్పత్తిని మరీ తగ్గించేశారు. ఆర్డర్లు మరీ తక్కువగానే ఉండడంతో ఈ ఏడాది 60 శాతం ఉత్పత్తిని మాత్రమే శివకాశిలోని కొన్ని పరిశ్రమలు పూర్తిచేశాయి. ప్రస్తుతం మార్కెట్లోకి ఈ బాణసంచాల్ని తరలించే పనిలో ఆయా పరిశ్రమలు, ఆర్డర్లు పొందిన వారు నిమగ్నమయ్యారు. బాణసంచాల దుకాణాల ఏర్పాటుకు సైతం ఆంక్షలు మరీ ఎక్కువగా ఉండడంతో ఎంపిక చేసిన ప్రాంతాల్లో వీటిని ఏర్పాటుచేస్తూ వస్తున్నారు. కోర్టులో ఉన్న పిటిషన్ మీద మంగళవారం తీర్పు వెలువడే అవకాశాలు ఉన్నాయన్న సంకేతాలతో ఎదురు చూపులు మరింతగా పెరిగాయి. అనుకూలంగా తీర్పు వస్తే సరి లేని పక్షంలో పరిశ్రమల్ని మూసి వేసి రానున్న కాలంలో ప్రత్యామ్నాయ మార్గాన్ని చూసుకోవడం మంచిదన్న భావనలో అనేక పరిశ్రమలు ఉన్నాయి. 40 శాతం తగ్గిన ఉత్పత్తి ఈ ఏడాది 40 శాతం ఉత్పత్తి తగ్గగా, రానున్న కాలంలో క్రమంగా తగ్గి, చివరకు ఒకప్పుడు మోత మోగిన మినీ జపాన్ మున్ముందు తుస్..మనే అవకాశాలు ఎక్కవే కనిపిస్తున్నాయి. ఇదే జరిగిన పక్షంలో బతుకు కోసం వలసలు తప్పవన్న ఆవేదనను వ్యక్తం చేసే లక్షలాది కుటుంబాలు ఇక్కడ కోర్టు తీర్పు కోసం వేచి చూస్తున్నాయి. సరికొత్త పేర్లు గ్రీన్బాణా సంచా ఉత్పత్తిలో భాగంగా ఈ ఏడా ది సరికొత్త పేర్లను అనేక పరిశ్రమలు ఆయా ప్యాకింగ్ మీద పొందు పరిచి ఉన్నాయి. ట్విట్ట ర్, ఫేస్ బుక్, టిక్ టాక్, వాట్సాప్, వీడియో గేమ్స్,బాహుబలి, జల్లికట్టు పేర్లతో గ్రీన్ బాణా సంచాలను మార్కెట్లోకి దించడం విశేషం. ఇక, ఈ ఏడాది బాణా సంచాల « ఉత్పత్తి తగ్గిన నేపథ్యంలో ధరలు అమాంతంగా పెరిగి ఉన్నాయి. పది నుంచి 20 శాతం మేరకు ధరలు పెరగడంతో విక్రయాలు ఏ మేరకు సా గుతాయో వేచి చూడాల్సిందే. అదే సమయంలో వర్షాలు ముంచుకొస్తుండటంతో వ్యాపారుల్లో టెన్షన్ అన్నది మరింతగా పెరిగి ఉన్నది. -
పేలని టపాసు!
సాక్షి, హైదరాబాద్: దీపావళి టపాసులపై వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) ప్రభావం పడింది. దీపావళికి మరో వారం రోజులు మాత్రమే సమయం ఉన్నప్పటికీ బాణసంచా వ్యాపారం ఇంకా జోరందుకోలేదు. కేంద్రం టపాసులపై 28 శాతం జీఎస్టీ విధించింది. దీంతో వాటి ధరలు గతేడాది కంటే బాగా పెరిగాయి. ఒకవైపు వరుసగా కురుస్తున వర్షాలు, మరోవైపు జీఎస్టీ విధింపుతో రిటైల్ వ్యాపారులు మందుకు రావడం లేదు. ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర తరహాలో టపాకాయలపై ఆంక్షలు విధిస్తే వ్యాపారంపై ప్రభావం పడుతుందని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. దీంతో హోల్‌సేల్ వ్యాపార కేంద్రాలు వెలవెలబోతున్నాయి. దీపావళి టపాసుల సీజనల్ బిజినెస్, హోల్‌సేల్ వ్యాపారులు మాత్రం శివకాశి నుంచి భారీగా టపాసుల దిగుమతి చేసుకుని నిల్వ చేసుకున్నారు. ఏటా రూ.20 కోట్ల వ్యాపారం.. గ్రేటర్ హైదరాబాద్‌లో దీపావళి వచ్చిందంటే కోట్ల విలువైన టపాసులు కాలి బూడిద కావాల్సిందే. మహానగరంలో 50 వేల మంది వరకు హోల్‌సేల్ వ్యాపారులు ఉండగా, 30 వేల మంది వరకు రిటైల్ వ్యాపారులు ఉంటారు. ఏటా సుమారు రూ.20 కోట్ల వరకు బాణసంచా వ్యాపారం సాగుతోంది. సాధారణంగా దసరా పండగ మరుసటి రోజు నుంచే దీపావళి వ్యాపారం మొదలవుతుంది. హోల్‌సేల్‌తో పాటు రిటైల్ వ్యాపారులు సైతం హోల్‌సేల్ అంటూ విక్రయాలు సాగిస్తుంటారు. అయితే ఈ సారి దీపావళి సమీపిస్తున్నా కనీసం వ్యాపారం సందడి లేకుండా పోయింది. దీంతో హోల్‌సేల్ వ్యాపారులు ఆందోళనకు గురవుతున్నారు. 30 శాతానికి పైగా పెరిగిన ధరలు.. దీపావళి టపాసుల ధరలకు రెక్కలు వచ్చాయి. గతేడాది కంటే 30 శాతంపైగా పెరిగాయి. జీఎస్టీ ప్రభావంతో హోల్‌సేల్ వ్యాపారులు ధరలు పెంచేశారు. వాస్తవానికి హోల్‌సేల్ వ్యాపారులు శివకాశిలో టపాసులు కొనుగోలు చేసినప్పుడే బిల్లులో 28 శాతం పన్ను పడింది. దీంతో హోల్‌సేల్ వ్యాపారులు జీఎస్టీ భారాన్ని రిటైల్ వ్యాపారులపై వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక రిటైల్ వ్యాపారులు దానిని వినియోగదారులపై రుద్దే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
జోరుగా టపాసుల ‘జీరో’ వ్యాపారం !
గుంతకల్లు, న్యూస్‌లైన్: టపాసుల వ్యాపారం గుంతకల్లులోని అక్రమాలకు లక్షలు ఆర్జించి పెడుతోంది. రెండు దశాబ్దాలుగా ఈ వ్యాపారం నిర్విఘ్నంగా సాగుతున్నా పట్టించుకున్న నాథులే కేకుండా పోయారు. మామూళ్ల మత్తులో అధికారులు జోగుతుండడం, కొందరు పెద్దల అండతో ఈ వ్యాపారం మూడు చిచ్చుబుడ్లు.. ఆరు రాకెట్లుగా విస్తరిస్తోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టపాకాయలు నిలువ చేయాలన్నా, విక్రయించాలన్నా, ఒక చోటి నుంచి మరొక చోటికి తరలించాలన్నా, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా జాగ్రత్తలు, అనుమతులు తీసుకోవడం తప్పనిసరి. అయితే, ఇవేవీ పాటించకుండానే ఇక్కడ ప్రతి ఏటా కోట్లాది రూపాయల వ్యాపారం జరుగుతోంది. ఇక్కడి నుంచి వైఎస్ఆర్ జిల్లా, కర్నూలు, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, మెదక్, కర్ణాటకలోని బళ్లారి, రాయచూరు, కొప్పళ్ తదితర ప్రాంతాలకు టపాసులు ఎగుమతి అవుతున్నాయి. ఈ వ్యాపారమంతా నిబంధనలకు వ్యతిరేకంగానే నిర్వహిస్తుండడంతో, ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులకు గండి పడుతోంది. జీరో వ్యాపారం కారణంగా ఇక్కడి సరుకు తక్కువ ధరకే లభిస్తుండడంతో ఆయా ప్రాంతాల వ్యాపారులు టపాసుల కోసం గుంతకల్లును ఆశ్రయిస్తున్నారు. ఈ విషయాలను పర్యవేక్షించాల్సిన అధికారులకు భారీగా ముడుపులు ముడుతుండడంతో వారు కూడా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. రూ.10కి ఉత్పత్తయ్యే టపాసులపై రూ.100 ధర ముద్రించి విక్రయిస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. 2011లో గుంతకల్లులోని ఓ గోదాముపై విజిలెన్స్ బృందం దాడి చేసి పలు వివరాలు రాబట్టింది. అయితే అప్పట్లో కొందరు పెద్దలు కలుగజేసుకుని రాత్రికిరాత్రే వ్యవహారాన్ని చక్కబెట్టేశారు. ఈ ఏడాది కూడా దాడులు నిర్వహించినా, వ్యాపారులు ముందస్తు ప్రణాళికలతో సిద్ధంగా ఉండడంతో పెద్దగా ఫలితం కనిపించలేదు. ఈ సారి దాదాపు కోటి రూపాయలకు పైగానే అధికారులకు మామూళ్ల రూపంలో అందినట్లు సమాచారం. కాగా, టపాసుల తరలింపులో అధికారుల నుంచి ఇబ్బందులు ఏర్పడకుండా గుంతకల్లు నుంచి జిల్లా కేంద్రం వరకు పోలీసు, ఫైర్ విభాగాల అధికారులు, సిబ్బందికి మామూళ్లతోపాటు, వేల సంఖ్యలో గిఫ్ట్ ప్యాక్‌లను పంపిణీ చేస్తున్నారు. -
దీపావళి దందా !
అందరూ దీపావళికి పండుగ చేసుకుంటే...కొందరు అధికారులు మాత్రం దీపావళికి ముందే పండుగ చేసుకుంటున్నారు. బాణసంచా విక్రయాలకు సంబంధించిన లెసైన్స్‌ల జారీలో అందినకాడికి దండుకుంటున్నారు. వ్యాపారులు లెసైన్స్ కోసం అర్జీ ఇచ్చినప్పటి నుంచి లెసైన్స్ చేతికి వచ్చేదాకా ముడుపులు చెల్లించక తప్పడం లేదు. సాక్షి, కడప: దీపావళి పండుగ సందర్భంగా వ్యాపారులకు టపాసుల వ్యాపారం ఎలా జరుగుతుందో ఏమో కానీ అధికారులకు మాత్రం కాసుల వర్షం కురిపిస్తోంది. బాణసంచా అమ్మకాల కోసం ఏర్పాటు చేసే స్టాళ్లకు లెసైన్సులు మంజూరు చేసే విషయంలో అధికారులు అందినకాడికి దోచుకుంటున్నారు. నాలుగు ప్రధాన శాఖలు దోపిడీకి తెగబడ్డాయి. ఒక్కో లెసైన్స్‌కు 10వేల రూపాయలు ఖర్చవుతోందని వ్యాపారులే బాహాటంగా చెబుతున్నారు. ముడుపుల చెల్లింపులు ఇలా .. బాణసంచా దుకాణపు లెసైన్స్ కోసం మొదట కలెక్టర్‌కు అర్జీ పెట్టుకోవాలి. ఐదుసెట్లలో అర్జీ సమర్పించాలి. వీటిని అగ్నిమాపకశాఖ, విద్యుత్, పోలీస్, ఆర్డీవోకు కాపీలు పంపుతారు. ఎమ్మార్పీలకు సంబంధించి ఆర్డీఓ కార్యాలయం ఎన్ఓసీ(నో అబ్జక్షన్ సర్టిఫికెట్) జారీ చేయాలి. ఇక్కడ తొలుత ఫైలుకు 500-1000 రూపాయలు చెల్లించాలి. ఆపై అగ్నిమాపకశాఖ కార్యాలయం వారు ఎన్ఓసీ ఇవ్వాలి. ఇక్కడ 5-7వేల రూపాయల వరకూ వసూలు చేస్తున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఆ తర్వాత విద్యుత్ శాఖకు సంబంధించి ఎస్పీడీసీఎల్ కార్యాలయంలోనూ వెయ్యి రూపాయలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. చివర్లో పోలీసుశాఖకు సంబంధించి సీఐ, డీఎస్పీలు క్లియరెన్స్ ఇవ్వాలి. ఇక్కడ 1000-2వేల రూపాయల వరకూ వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఇలా మొత్తం మీద ఒక్కో లెసైన్స్‌కు వ్యాపారులకు 10వేల రూపాయలకుపైగానే ఖర్చవుతోంది. జిల్లా వ్యాప్తంగా 256 దరఖాస్తులు: బాణసంచా విక్రయాల దుకాణాల ఏర్పాటు కోసం జిల్లాలో బుధవారం సాయంత్రానికి 256 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో కడప నగర పరిధిలోనివే 82 దరఖాస్తులు ఉన్నాయి. వీటికి అగ్నిమాపకశాఖ క్లియరెన్స్ ఇచ్చి కలెక్టరుకు ఫైలు పంపాల్సి ఉంది. ముడుపుల చెల్లింపుల విషయం బాహాటంగా అందరికీ తెలుస్తున్నా ఎవ్వరూ తెలీనట్లే వ్యవహరిస్తున్నారు. విద్యుత్‌శాఖకు సంబంధించి ఎస్ఈ, అగ్నిమాపకశాఖ తరఫున డీఎఫ్ఓ( జిల్లా అగ్నిమాపకశాఖ అధికారి), రెవెన్యూకు సంబంధించి ఆర్డీవో క్లియరెన్స్ ఇవ్వాలి. వారం రోజులుగా ఈ ముడుపుల తతంగం జరుగుతున్నా ఏ ఒక్కశాఖ ఉన్నతాధికారి కూడా నివారణ చర్యలు చేపట్టలేదు. ఈ క్రమంలో స్టాళ్లు ఏర్పాటు చేసిన నిర్వాహకులు భారీ ధరలకు బాణసంచా విక్రయాలు జరిపే అవకాశం లేకపోలేదు. దీంతో చివరగా వినియోగదారుడిపైనే భారం పడనుంది. విచారించి చర్యలు తీసుకుంటాం: వీరభద్రయ్య, అగ్నిమాపకశాఖ జిల్లా అధికారి. లెసైన్స్‌ల జారీకి డబ్బులు తీసుకోవడం చాలా తప్పు. లెసైన్స్‌లకు డబ్బులు తీసుకోవడంపై విచారణ చేపడతాం. బాధ్యులైనవారిపై చర్యలు తీసుకుంటాం. ఎవ్వరైనా డబ్బులు అడిగితే వ్యాపారులు నన్ను సంప్రదించాలి. నేను లెసైన్స్ ఇచ్చేలా చూస్తా.