సాక్షి, హైదరాబాద్: దీపావళి టపాసులపై వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) ప్రభావం పడింది. దీపావళికి మరో వారం రోజులు మాత్రమే సమయం ఉన్నప్పటికీ బాణసంచా వ్యాపారం ఇంకా జోరందుకోలేదు. కేంద్రం టపాసులపై 28 శాతం జీఎస్టీ విధించింది. దీంతో వాటి ధరలు గతేడాది కంటే బాగా పెరిగాయి. ఒకవైపు వరుసగా కురుస్తున వర్షాలు, మరోవైపు జీఎస్టీ విధింపుతో రిటైల్ వ్యాపారులు మందుకు రావడం లేదు. ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర తరహాలో టపాకాయలపై ఆంక్షలు విధిస్తే వ్యాపారంపై ప్రభావం పడుతుందని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. దీంతో హోల్‌సేల్ వ్యాపార కేంద్రాలు వెలవెలబోతున్నాయి. దీపావళి టపాసుల సీజనల్ బిజినెస్, హోల్‌సేల్ వ్యాపారులు మాత్రం శివకాశి నుంచి భారీగా టపాసుల దిగుమతి చేసుకుని నిల్వ చేసుకున్నారు.
ఏటా రూ.20 కోట్ల వ్యాపారం..
గ్రేటర్ హైదరాబాద్‌లో దీపావళి వచ్చిందంటే కోట్ల విలువైన టపాసులు కాలి బూడిద కావాల్సిందే. మహానగరంలో 50 వేల మంది వరకు హోల్‌సేల్ వ్యాపారులు ఉండగా, 30 వేల మంది వరకు రిటైల్ వ్యాపారులు ఉంటారు. ఏటా సుమారు రూ.20 కోట్ల వరకు బాణసంచా వ్యాపారం సాగుతోంది. సాధారణంగా దసరా పండగ మరుసటి రోజు నుంచే దీపావళి వ్యాపారం మొదలవుతుంది. హోల్‌సేల్‌తో పాటు రిటైల్ వ్యాపారులు సైతం హోల్‌సేల్ అంటూ విక్రయాలు సాగిస్తుంటారు. అయితే ఈ సారి దీపావళి సమీపిస్తున్నా కనీసం వ్యాపారం సందడి లేకుండా పోయింది. దీంతో హోల్‌సేల్ వ్యాపారులు ఆందోళనకు గురవుతున్నారు.
30 శాతానికి పైగా పెరిగిన ధరలు..
దీపావళి టపాసుల ధరలకు రెక్కలు వచ్చాయి. గతేడాది కంటే 30 శాతంపైగా పెరిగాయి. జీఎస్టీ ప్రభావంతో హోల్‌సేల్ వ్యాపారులు ధరలు పెంచేశారు. వాస్తవానికి హోల్‌సేల్ వ్యాపారులు శివకాశిలో టపాసులు కొనుగోలు చేసినప్పుడే బిల్లులో 28 శాతం పన్ను పడింది. దీంతో హోల్‌సేల్ వ్యాపారులు జీఎస్టీ భారాన్ని రిటైల్ వ్యాపారులపై వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక రిటైల్ వ్యాపారులు దానిని వినియోగదారులపై రుద్దే అవకాశాలు కనిపిస్తున్నాయి.
పేలని టపాసు!
Published Thu, Oct 12 2017 4:07 AM | Last Updated on Thu, Oct 12 2017 5:20 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment