సాక్షి, సిటీబ్యూరో: దీపావళికి టపాసులు కాల్చాలా.. వద్దా..? అనే సందేహానికి తెరపడింది. దేశ సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో నగరవ్యాప్తంగా టపాసుల కొనుగోళ్లు జోరందుకున్నాయి. రాత్రి 8 నుంచి 10 గంటల వరకు మాత్రమే బాణాసంచా కాల్చుకునేందుకు అనుమతి లభించడంతో అన్ని వర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. నగరంలోని బేగంబజార్, మోండా మార్కెట్, సికింద్రాబాద్, మెహిదీపట్నం, దిల్‌సుఖ్‌నగర్, కూకట్‌పల్లి తదితర ప్రాంతాల్లోని టపాసుల దుకాణాలు వినియోగదారులతో కిటకిటలాడాయి. తక్కువ కాలుష్యం ఉండే టపాసుల కొనుగోలుకే నగరవాసులు ఆసక్తి కనబరుస్తున్నారు. అధిక శబ్దం లేని ఎక్కువ వెలుగులు విరజిమ్మే వాటినే కొనుగోలుచేస్తున్నారు.రెండు గంటల నిబంధన ఎలా అమలవుతుందన్నఅంశం సస్పెన్స్‌గా మారింది. కాలుష్యం లేకుండాజాగ్రత్తలు తీసుకుంటామని గ్రేటర్ వాసులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే కొందరు ఇళ్లను విద్యుత్ కాంతులతో అందంగా ముస్తాబు చేశారు. కోవిడ్ సెకండ్‌వేవ్ ముప్పుతో ఈసారి సర్వత్రా పర్యావరణ స్పృహ, టపాసుల కాలుష్యంపై అవగాహన పెరిగిందని పర్యావరణ వేత్తలు పేర్కొంటున్నారు.
ఏ రంగు బాణసంచాలో.. ఏ కాలుష్యకారకాలంటే..?
తెలుపు: అల్యూమినియం, మెగ్నీషియం, టైటానియం
ఆరెంజ్: కార్బన్, ఐరన్
పసుపు: సోడియం కాంపౌండ్లు
నీలం: కాపర్ కాంపౌండ్లు
ఎరుపు: స్ట్రాన్షియం కార్బోనేట్
గ్రీన్: బేరియం మోనో క్లోరైడ్స్ సాల్ట్స్
కాల్చుకోవచ్చు..
సుప్రీం మధ్యంతర ఉత్తర్వుల నేపథ్యంలో గ్రేటర్ సిటిజన్లు ఇంటిల్లిపాదీ క్రాకర్స్ కాల్చుకునేందుకు 2 గంటల పాటు అనుమతి లభించింది. రాత్రి 8–10 గంటల మధ్య కాకుండా మిగతా సమయాల్లో.. సాయంత్రం 6 నుంచి అర్ధరాత్రి వరకు పెద్ద ఎత్తున టపాసులు కాల్చే వారి విషయంలో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనే అంశంపై మరికొన్ని గంటల్లో స్పష్టతరానుంది.
కాలుష్యంతో జాగ్రత్త..
టపాసుల కాలుష్యంతో పెద్ద ఎత్తున వెలువడే సూక్ష్మ, స్థూల ధూళికణాలు గాల్లో చేరి సిటిజన్ల ఊపిరితిత్తులకు చేటుచేస్తాయని పర్యావరణ వేత్తలు, వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇక నైట్రేట్లు, సల్ఫర్‌డయాక్సైడ్ తదితర విషవాయువులు కోవిడ్ రోగులు, ఇటీవలే కోలుకున్నవారు ఇతర ఆరోగ్య సమస్యలున్నవారు, చిన్నారులు, వృద్ధులను ఉక్కిరిబిక్కిరి చేస్తాయని, ఈ విషయంలో అప్రమత్తంగా
ఉండాలంటున్నారు.
అప్రమత్తతే రక్ష
దీపావళి టపాసులు కాల్చే సమయంలో ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా కంటి చూపు శాశ్వతంగా కోల్పోయే ప్రమాదం ఉంది. పిల్లలు టపాసులు కాల్చే సమయంలో తల్లిదండ్రులు వారి దగ్గరే ఉంటూ జాగ్రత్తలు చెబుతుండాలి. ఇళ్లలో పెంపుడు జంతువులు, పక్షులు ఉంటే మరింత అప్రమత్తంగా ఉండాలి. ప్రతి సంవత్సరం గ్రేటర్‌లో వందల సంఖ్యలో మూగజీవాలు గాయపడుతున్నాయి. అందరూ పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడుతూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు, పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు.
కోవిడ్ బాధితులపై ప్రభావం
బాణసంచా కాల్చడంతో హానికర రసాయనాలు వెలువడతాయి. ఇవి ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. హోం ఐసోలేషన్‌లో ఉన్న కోవిడ్–19 బాధితులపై మరింత ప్రభావం చూపుతుంది. ఆస్తమా బాధితులు, చిన్నారులు, వృద్ధులు, ఇతర వ్యాధిగ్రస్తులు చలికాలంలో అప్రమత్తంగా ఉండాలి. బర్నాల్, దూది, అయోడిన్, డెట్టాల్‌తో కూడిన ఫస్ట్ ఎయిడ్ కిట్‌ను అందుబాటులో ఉంచుకోవాలి.
– ప్రశాంత్, పల్మొనాలజిస్ట్, రెనోవా ఆస్పత్రి
కళ్లద్దాలు ధరించాలి
వంటగదిలోని గ్యాస్ సిలిండర్, ఆయిల్ డబ్బాలకు దూరంగా టపాసులను ఉంచాలి. ఒకసారి ఒక్కరే టపాకాయలు కాల్చాలి. మిగిలిన వారు దూరంగా ఉండేలా చూడాలి. పక్కనే రెండు బకెట్లలో నీళ్లు ఉంచుకోవాలి. ప్రమాదవశాత్తు మిణుగురులు చర్మంపై పడితే కాలిన చోట నీళ్లు పోయాలి. బాణసంచా కాల్చే సమయంలో కళ్లద్దాలు ధరించాలి. కళ్లకు గాయాలైతే వెంటనే ఆస్పత్రికి వెళ్లాలి.
– డాక్టర్ మురళీధర్ రామప్ప, కంటివైద్య నిపుణుడు, ఎలీ్వప్రసాద్ ఆస్పత్రి
విద్యుత్ లైన్ల కింద వద్దు
బాణసంచా గోదాములు, దుకాణాలు, ఇళ్లు, జనం రద్దీంగా ఉంటే ప్రాంతాలు, పెట్రోల్ బంకులకు దూరంగా టపాసులు కాల్చాలి. కాలుతున్న కొవ్వొత్తులు, దీపాల పక్కన టపాసులు పెట్టవద్దు. సీసా, రేకు డబ్బా, బోర్లించిన కుండ వంటి పాత్రల్లో టపాసులు కాల్చడం వల్ల ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. తారా జువ్వలను విద్యుత్ లైన్ల కింద కాలిస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.
– నక్క యాదగిరి, సభ్యుడు, తెలంగాణ ఎలక్ట్రికల్ లైసెన్సింగ్ బోర్డు
Comments
Please login to add a commentAdd a comment