గుంతకల్లు, న్యూస్‌లైన్: టపాసుల వ్యాపారం గుంతకల్లులోని అక్రమాలకు లక్షలు ఆర్జించి పెడుతోంది. రెండు దశాబ్దాలుగా ఈ వ్యాపారం నిర్విఘ్నంగా సాగుతున్నా పట్టించుకున్న నాథులే కేకుండా పోయారు. మామూళ్ల మత్తులో అధికారులు జోగుతుండడం, కొందరు పెద్దల అండతో ఈ వ్యాపారం మూడు చిచ్చుబుడ్లు.. ఆరు రాకెట్లుగా విస్తరిస్తోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టపాకాయలు నిలువ చేయాలన్నా, విక్రయించాలన్నా, ఒక చోటి నుంచి మరొక చోటికి తరలించాలన్నా, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా జాగ్రత్తలు, అనుమతులు తీసుకోవడం తప్పనిసరి. అయితే, ఇవేవీ పాటించకుండానే ఇక్కడ ప్రతి ఏటా కోట్లాది రూపాయల వ్యాపారం జరుగుతోంది. ఇక్కడి నుంచి వైఎస్‌ఆర్ జిల్లా, కర్నూలు, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, మెదక్, కర్ణాటకలోని బళ్లారి, రాయచూరు, కొప్పళ్ తదితర ప్రాంతాలకు టపాసులు ఎగుమతి అవుతున్నాయి. ఈ వ్యాపారమంతా నిబంధనలకు వ్యతిరేకంగానే నిర్వహిస్తుండడంతో, ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులకు గండి పడుతోంది. జీరో వ్యాపారం కారణంగా ఇక్కడి సరుకు తక్కువ ధరకే లభిస్తుండడంతో ఆయా ప్రాంతాల వ్యాపారులు టపాసుల కోసం గుంతకల్లును ఆశ్రయిస్తున్నారు. ఈ విషయాలను పర్యవేక్షించాల్సిన అధికారులకు భారీగా ముడుపులు ముడుతుండడంతో వారు కూడా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. రూ.10కి ఉత్పత్తయ్యే టపాసులపై రూ.100 ధర ముద్రించి విక్రయిస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. 2011లో గుంతకల్లులోని ఓ గోదాముపై విజిలెన్స్ బృందం దాడి చేసి పలు వివరాలు రాబట్టింది.
అయితే అప్పట్లో కొందరు పెద్దలు కలుగజేసుకుని రాత్రికిరాత్రే వ్యవహారాన్ని చక్కబెట్టేశారు. ఈ ఏడాది కూడా దాడులు నిర్వహించినా, వ్యాపారులు ముందస్తు ప్రణాళికలతో సిద్ధంగా ఉండడంతో పెద్దగా ఫలితం కనిపించలేదు. ఈ సారి దాదాపు కోటి రూపాయలకు పైగానే అధికారులకు మామూళ్ల రూపంలో అందినట్లు సమాచారం. కాగా, టపాసుల తరలింపులో అధికారుల నుంచి ఇబ్బందులు ఏర్పడకుండా గుంతకల్లు నుంచి జిల్లా కేంద్రం వరకు పోలీసు, ఫైర్ విభాగాల అధికారులు, సిబ్బందికి మామూళ్లతోపాటు, వేల సంఖ్యలో గిఫ్ట్ ప్యాక్‌లను పంపిణీ చేస్తున్నారు.
జోరుగా టపాసుల ‘జీరో’ వ్యాపారం !
Published Thu, Oct 31 2013 2:58 AM | Last Updated on Sat, Sep 2 2017 12:08 AM
Advertisement