‘శివకాశి’తుస్‌! | 40 Percent Sivakasi Products Down in Tamil nadu | Sakshi
Sakshi News home page

‘శివకాశి’తుస్‌!

Published Tue, Oct 22 2019 7:36 AM | Last Updated on Tue, Oct 22 2019 11:46 AM

40 Percent Sivakasi Products Down in Tamil nadu - Sakshi

సాక్షి, చెన్నై : తమిళనాట బాణ సంచాల తయారీలో ప్రసిద్ధి చెందిన జిల్లా విరుదునగర్‌. ఈ జిల్లాలో ఉన్న  శివకాశి పట్టణాన్ని మినీ జపాన్‌గా పిలుస్తుంటారు. ఈ పట్టణ, శివారుల్లోని గ్రా మాలలో ప్రజల ప్రధాన జీవనాధారం బాణ సంచా తయారీ. కుటీర పరిశ్రమల తరహాలో ఒకప్పుడు ప్రతి ఇంట్లోనూ బాణ సంచాల్ని త యారు చేసేవారు. అనేక కుటుంబాలు వంశపారంపర్యంగా ఈ తయారీ సాగిస్తూ వచ్చేవారు. అందుకే ఇక్కడ ప్రతి ఏటా దీపావళి వస్తుంటే ప్రజల గుండెల్లో దడ తప్పదు. నిత్యం ప్రమాదాలు, మరణాలు, క్షతగ్రాతులతో ఆస్పత్రుల్లో ఆర్తనాలు మిన్నంటేవి. ప్రమాదాల నివారణ లక్ష్యంగా పాలకులు తీసుకున్న నిర్ణయాలు, కొ రడా ఝుళిపించడంతో కుటీర, వంశపారంపర్య పరిశ్రమలన్నీ కనుమరుగయ్యాయి. వేలల్లో ఉ న్నపరిశ్రమలు, వందలకు పరిమితమయ్యాయి.

ఆంక్షల కొరడా
శివకాశి పరిసరాల్లో ఏడేళ్ల క్రితం వరకు సుమా రు ఎనిమిది వేల వరకు చిన్న తరహా కుటీర పరిశ్రమలుండేవి. మరో 400 వరకు పెద్ద పరిశ్రమలు ఉండేవి. గతంలో జరిగిన సర్వే మేరకు ఈ వివరాలు బయట పడ్డాయి. ఇక్కడి ప్రజల బతుకులు బాణసంచా మందుగుండు సామగ్రి కి బుగ్గి పాలు అవుతున్నట్టు ఆ సర్వే తేటతెల్లం చేసింది. ఇక్కడి ప్రజల జీవన స్థితిని మెరుగు పరచడం, బాణ సంచా పరిశ్రమల్లో బతుకు నాశనం చేసుకుంటున్న చిన్న పిల్లల్ని విద్యాపరంగా ప్రోత్సహించేందుకు పాలకులు చర్యలు చేపట్టారు. ఇదిలావుండగా ఇక్కడ ప్రతి కుటుం బంలోనూ తల్లిదండ్రులతో పాటుగా యుక్త వయస్సుకు వచ్చిన యువతీ, యువకులు ఏదో ఒక పరిశ్రమలో పనిచేయక తప్పదు. వీరికి రోజు వారీగా పీస్‌ రేట్‌(ఎన్ని బాణ సంచాలు తయారు చేస్తారో) దాని ఆధారంగా వారానికి లేదా నెలకో వేతనాలు ఇవ్వడం జరిగేది. ఈ పరిశ్రమల్లో దినదిన గండంతో కాలాన్ని నెటుకొస్తూ, ప్రమాదాలతో ఛిద్రం అవుతున్న కార్మిక బతుకుల్ని పరిగణలోకి తీసుకున్న పాలకులు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ఆంక్షలు, కొరడా ఝుళిపించారు. రెండేళ్లుగా ప్రమాదాల సంఖ్య తగ్గించారు.

తగ్గిన ఉత్పత్తి
ఒకప్పుడు నిత్యం బాణసంచా తయారీ సాగితే, ఆంక్షలు కొరడాల రూపంలో జూన్‌ లేదా జూలైలో మొదలెట్టి దీపావళి నాటికి ముగించే పనిలో పడ్డారు. ఈ పరిస్థితుల్లో గత ఏడాది నుంచి బాణసంచా ఉత్పత్తి అన్నది క్రమంగా తగ్గించుకోవాల్సిన వచ్చింది. గత ఏడాది 20 శాతం ఉత్పత్తి తగ్గగా, ఈ సారి 40 శాతం ఉత్పత్తి తగ్గడంతో పనులు లేక కార్మికులు కష్టాలు పడాల్సిన పరిస్థితి. గతంలో జరిగిన ఉత్పత్తి, డిమాండ్‌ మేరకు ఉత్తరాది నుంచి సైతం ఇక్కడికి వచ్చి పనుల్లో నిమగ్నమైన వాళ్లూ ఉన్నారు. ప్రస్తుతం ఉత్పత్తి తగ్గడంతో ఆ కార్మికులకు మిగిలింది కన్నీళ్లే. ప్రస్తుతం పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణలో భాగంగా కోర్టు బాణ సంచాల తయారీకి కట్టుదిట్టమైన ఆంక్షలు, నిబంధలన్ని విధించింది. గ్రీన్‌ బాణ సంచాల ఉత్పత్తి మాత్రమే చేయాలన్న ఆదేశాలు జారీచేసింది. శివకాశిలో ఈ ఏడాది ఆ దిశగానే ముందుకు సాగాల్సిన పరిస్థితి ఎదురైంది. కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో అన్న ఎదురు చూపులతో ఈ ఏడాది ఉత్పత్తిని మరీ తగ్గించేశారు. ఆర్డర్లు మరీ తక్కువగానే ఉండడంతో ఈ ఏడాది 60 శాతం ఉత్పత్తిని మాత్రమే శివకాశిలోని కొన్ని పరిశ్రమలు పూర్తిచేశాయి. ప్రస్తుతం మార్కెట్లోకి ఈ బాణసంచాల్ని తరలించే పనిలో ఆయా పరిశ్రమలు, ఆర్డర్లు పొందిన వారు నిమగ్నమయ్యారు. బాణసంచాల దుకాణాల ఏర్పాటుకు సైతం ఆంక్షలు మరీ ఎక్కువగా ఉండడంతో ఎంపిక చేసిన ప్రాంతాల్లో వీటిని ఏర్పాటుచేస్తూ వస్తున్నారు. కోర్టులో ఉన్న పిటిషన్‌ మీద మంగళవారం తీర్పు వెలువడే అవకాశాలు ఉన్నాయన్న సంకేతాలతో ఎదురు చూపులు మరింతగా పెరిగాయి. అనుకూలంగా తీర్పు వస్తే సరి లేని పక్షంలో పరిశ్రమల్ని మూసి వేసి రానున్న కాలంలో ప్రత్యామ్నాయ మార్గాన్ని చూసుకోవడం మంచిదన్న భావనలో అనేక పరిశ్రమలు ఉన్నాయి.

40 శాతం తగ్గిన ఉత్పత్తి
ఈ ఏడాది 40 శాతం ఉత్పత్తి తగ్గగా, రానున్న కాలంలో క్రమంగా తగ్గి, చివరకు ఒకప్పుడు మోత మోగిన మినీ జపాన్‌ మున్ముందు తుస్‌..మనే అవకాశాలు ఎక్కవే కనిపిస్తున్నాయి. ఇదే జరిగిన పక్షంలో బతుకు కోసం వలసలు తప్పవన్న ఆవేదనను వ్యక్తం చేసే లక్షలాది కుటుంబాలు ఇక్కడ కోర్టు తీర్పు కోసం వేచి చూస్తున్నాయి.

సరికొత్త పేర్లు
గ్రీన్‌బాణా సంచా ఉత్పత్తిలో భాగంగా ఈ ఏడా ది సరికొత్త పేర్లను అనేక పరిశ్రమలు ఆయా ప్యాకింగ్‌ మీద పొందు పరిచి ఉన్నాయి. ట్విట్ట ర్, ఫేస్‌ బుక్, టిక్‌ టాక్, వాట్సాప్, వీడియో గేమ్స్,బాహుబలి, జల్లికట్టు పేర్లతో గ్రీన్‌ బాణా సంచాలను మార్కెట్లోకి దించడం విశేషం. ఇక, ఈ ఏడాది బాణా సంచాల « ఉత్పత్తి తగ్గిన నేపథ్యంలో ధరలు అమాంతంగా పెరిగి ఉన్నాయి. పది నుంచి 20 శాతం మేరకు ధరలు పెరగడంతో విక్రయాలు ఏ మేరకు సా గుతాయో వేచి చూడాల్సిందే. అదే సమయంలో వర్షాలు ముంచుకొస్తుండటంతో వ్యాపారుల్లో టెన్షన్‌ అన్నది మరింతగా పెరిగి ఉన్నది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement