జ్వరం.. భయం
జిల్లాను వణికిస్తున్న విష జ్వరాలు
రోగులతో కిటకిటలాడుతున్న ఆసుపత్రులు
ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం కరువు
ప్రైవేటు వైద్యుల వద్దకు పరుగులు తీస్తున్న జనం
నివారణ చర్యలు చేపట్టడంలో అధికారులు విఫలం
జ్వరం.. జ్వరం.. .జిల్లాలో ఎవరి నోట విన్నా ఇదే మాట. ప్రతి చోటా జనం విషజ్వరాలతో అల్లాడిపోతున్నారు. ఇక్కడ సరైన వైద్యసౌకర్యం లేకపోవడంతో ప్రధాన నగ రాలకు పరుగులు తీస్తున్నారు. పసిపిల్లల మొదలుకుని పండు ముదుసలి వరకు ప్రతి ఒక్కరూ జ్వరాలతో వణికిపోతున్నారు. పలువురి ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నా జిల్లా యంత్రాంగంలో చలనం లేదు.
మలేరియా, టైఫాయిడ్, సాధారణ జ్వరాలతో అందరూ బాధపడుతున్నారు. మురికి నీళ్లలో నివసించే ఫ్యూరెక్స్ దోమకంటే మంచినీళ్లలో నివసించే ఎడిస్ (టైగర్) దోమతోనే అనర్థాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి.
వైద్యానికి ఇబ్బందులు
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో 72 పీహెచ్‌సీలు, 448 సబ్ సెంటర్లు, 8 పట్టణ ప్రాంత ఆస్పత్రులు, ఏపీ వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో 5 ఆస్పత్రులు నడుస్తున్నాయి. వీటిల్లో సిబ్బంది కొరత అధికంగా ఉంది. అలాగే పట్టణ ప్రాంతాల్లో ప్రాథమిక వైద్యం కింద జ్వరాాలకు యాంటీబయాటిక్ మాత్రలు అమాక్సలిన్, జ్వరానికి ప్యారాసిటమాల్, నొప్పులకు డైక్లోఫినాట్, ఓఆర్‌ఎస్ తదితర మందులను వాడాలి. అయితే, అమాక్సలిన్ ట్యాబెట్లు అందుబాటులో లేవు. ప్యారాసిటమాల్ కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. మరో యాంటీబయాటిక్ మందు డ్యాస్కి, డైకోఫినాట్ మందులు కూడా లేవు. గత ఏప్రిల్ నుంచి సరిగా మందులు అందడం లేదని సిబ్బంది వాపోతున్నారు.
ఫలితంగా గ్రామీణ, పట్టణ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ప్రధాన పట్టణాల్లోని వైద్యుల వద్దకు పరుగులు తీస్తున్నారు. ఏ జ్వరం వచ్చినా డాక్టర్ రక్త పరీక్షలు చేసి నిర్ధారించాల్సిందే. దీంతో కేవలం రక్త పరీక్షలకే వందల్లో ఖర్చవుతోంది. దోమల నిర్మూలనకు ప్రభుత్వం నామమాత్రంగా బడ్జెట్‌ను కేటాయించడంతో జిల్లాలోని 26 పీహెచ్‌సీ కేంద్రాల పరిధిలోని 80 గ్రామాల్లో డీడీటీని స్ప్రే చేశారు. అలాగే 216 గ్రామాల్లో అబెట్ పౌడర్‌ను చల్లారు.
పైరత్రం ద్రావకాన్ని కిరోసిన్‌తో కలిపి 105 గ్రామాల్లో రాత్రి పూట ఇళ్లల్లో స్ప్రే చేశామని అధికారులు అంటున్నారు. మందుల కొరత లేదని వైద్యాధికారులు అంటున్నప్పటికీ చాలా కేంద్రాల్లో వైద్యుల కొరత స్పష్టంగా కనబడుతోంది. ఫలితంగా సామాన్యులు ఎలాంటి జ్వరం వచ్చినా పట్టణాలకు పరుగులు తీస్తున్నారు. ఒకసారి వందల్లో, కొన్ని సందర్భాల్లో వేలల్లో అప్పులు చేసి వైద్యానికి వెచ్చిస్తున్నారు. స్థానిక ఆస్పత్రుల్లో వైద్య సౌకర్యాలు ఉంటే ఇలాంటి పరిస్థితి దాపురించేది కాదని ప్రజలు వెల్లడిస్తున్నారు.