మెజారిటీ ఉంటే ఎమ్మెల్యేలను కొనడమెందుకు? | The fight to protect democrac:- ysrcp leaders | Sakshi
Sakshi News home page

మెజారిటీ ఉంటే ఎమ్మెల్యేలను కొనడమెందుకు?

Published Sun, Apr 24 2016 3:34 AM | Last Updated on Fri, Nov 9 2018 5:56 PM

మెజారిటీ ఉంటే ఎమ్మెల్యేలను కొనడమెందుకు? - Sakshi

మెజారిటీ ఉంటే ఎమ్మెల్యేలను కొనడమెందుకు?

టీడీపీ ప్రభుత్వం మైనారిటీలో ఉందా?
దమ్ముంటే ఫిరాయింపుదారులకు టీడీపీ టికెట్ ఇచ్చి ఎన్నికలు నిర్వహించాలి
సీఎంకు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీ సవాల్
చిత్తూరు, తిరుపతి, నగరిలో కొవ్వొత్తుల ర్యాలీలు

 
 చిత్తూరు (అర్బన్)/తిరుపతి మంగళం/నగరి/: రాష్ట్ర ప్రభుత్వం పూర్తి మెజారిటీలో ఉంది. మైనారిటీలో లేదు. అలాంటప్పుడు కోట్ల రూపాయలిచ్చి మా ఎమ్మెల్యేలను ఎందుకు కొంటున్నావ్’ అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సీఎం చంద్రబాబునాయుడుపై ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి అధికారపార్టీలో చేర్చుకోవడాన్ని నిరసిస్తూ శనివారం వైఎస్సా ర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ‘సేవ్‌డెమోక్రసీ’ కార్యక్రమాన్ని నిర్వహించారు. చిత్తూరు, తిరుపతి, నగరిలో జరిగిన కార్యక్రమాలకు పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. చిత్తూరులో జరిగిన కార్యక్రమానికి గంగాధరనెల్లూరు, పూతలపట్టు, పీలేరు ఎమ్మెల్యేలు కె.నారాయణస్వామి, డాక్టర్ ఎం.సునీల్‌కుమార్, చింతల రామచంద్రారెడ్డి హాజ రయ్యారు. చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త జంగాలపల్లె శ్రీనివాసులు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో తొలుత నగరంలోని గాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కొవ్వొత్తుల తో నగర వీధుల్లో శాంతి ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే లు సీఎం తీరును ఎండగట్టారు. మైండ్‌గేమ్ ఆడుతున్నారంటూ ధ్వజమెత్తారు. వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన 13 మంది ఎమ్మెల్యేలచేత రాజీనామా చేయించి, టీడీపీ టికెట్ ఇచ్చి ఎన్నికల్లో నిలబెట్టాలని సవాల్ విసిరారు. సత్యవేడు నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఆది మూలం, చిత్తూరు నగరఅధ్యక్షుడు ఆర్.చంద్రశేఖర్, జిల్లా ప్రధాన కార్యదర్శి సీ.పురుషోత్తంరెడ్డి, రాష్ట్ర లీగల్‌సెల్ ప్రధాన కార్యదర్శులు తోట పురుషోత్తం, త్రిమూర్తి పాల్గొన్నారు.


 తిరుపతిలో..
తిరుపతిలో జరిగిన సేవ్‌డెమోక్రసీ కార్యక్రమానికి ఎంపీ వెలగపల్లి వరప్రసాదరావు విచ్చేశారు. స్థానిక పార్టీ కార్యాలయం నుంచి పార్టీ నగర అధ్యక్షుడు పాలగిరి ప్రతాప్‌రెడ్డి, దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి ఆధ్వర్యంలో ఎంపీతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కొవ్వొత్తులతో  నగర వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. ఎంపీ మాట్లాడుతూ రాజకీయాల్లో 40 ఏళ్ల అనుభవం ఉందని గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబు ఆ అనుభవాన్ని రాష్ట్ర ప్రజల సంక్షేమానికి ఉపయోగిస్తే బాగుంటుందన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో జగనన్న, వైఎస్‌ఆర్ ఫొటోలతో గెలిచిన ఎమ్మెల్యేలు అవినీతి సొమ్ముకు కక్కుర్తిపడి టీడీపీలోకి వెళ్లడం సిగ్గుచేటన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి పోకల అశోక్‌కుమార్, సంయుక్త కార ్యదర్శి ఎస్‌కె.బాబు, యువజన విభాగం నగర అధ్యక్షుడు ఎస్‌కె.ఇమామ్, నాయకులు కేతం జయచంద్రారెడ్డి, దుద్దేల బాబు, టి.రాజేంద్ర, దొడ్డారెడ్డి రామకృష్ణారెడ్డి, పుల్లూరు అమరనాథ్‌రెడ్డి, శివకుమార్, పెరుగు బాబూయాదవ్, తాల్లూరు ప్రసాద్, చెలికం కుసుమ, పుష్పలత, పుణీత, పుష్పాచౌదరి, శారద, సాయికుమారి, ప్రమీల, కవితమ్మ పాల్గొన్నారు.


 నగరిలో..
 చంద్రబాబునాయుడు నుంచి ప్రజాస్వామాన్ని కాపాడుకోవల్సిన సమయం ఇదేనని, మేధావులు, విద్యార్థులు, జర్నలిస్టులు, మానవతావాదులందరూ ప్రజాస్వామ్యానికి అండగా నిలవాలని నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. సేవ్ డెమోక్రసీలో భాగంగా పట్టణంలోని కొత్తపేట నుంచి టవర్ క్లాక్ మీదుగా ఓంశక్తి ఆలయం వరకు బైక్, కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో చీకటి పాలన నెలకొందని, దీనికి నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీ చేపడున్నామని చెప్పారు. నాడు ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నేడు ప్రజాస్వామ్యాన్నీ అదే రీతిలో ఖూనీ చేస్తున్నారని విమర్శించారు. రాజకీయ కుర్చీ కోసం పిల్లనిచ్చిన మామనే చంపిన చంద్రబాబు నేడు ప్రతిపక్షం లేకుండా చేయాలని చూస్తున్నారని, ఇది అసాధ్యమన్నారు. నాడు వైస్రాయ్ హోటల్‌లో ఎమ్మెల్యేలను కొన్న చంద్రబాబు, నేడు లింగమనేని అక్రమ గెస్ట్‌హౌస్‌లో ఎమ్మెల్యేలను కొంటున్నాడని ధ్వజమెత్తారు. కొడుకు నారా లోకేష్ ఎమ్మెల్యేలకు కోట్లు ఇస్తుంటే, చంద్రబాబు కండువాలు కప్పి పార్టీకి ఆహ్వానిస్తున్నారని విమర్శించారు.

ఎన్టీఆర్ ఆశయాలను చంద్రబాబు, టీడీపీ నేతలు సమాధి చేస్తున్నారని ఎద్దేవా చేశారు. బాబు నిజమైన రాయలసీమ బిడ్డ అయితే ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాలని సవాల్ విసిరారు.  నియోజకవర్గ నాయకుడు రాష్ట్ర టీయూసీ ప్రధాన కార్యదర్శి కేజే.కుమార్, వైస్ చైర్మన్ పీజీ.నీలమేఘం, రాష్ట్ర నాయకుడు డి.లక్ష్మీపతిరాజు, రాష్ట్ర బీసీ కార్యదర్శి అములు, ఎంపీపీ మురళీధర్, జెడ్పీటీసీ సురేష్‌రాజు, రాష్ట్ర యూత్ కార్యదర్శి శ్యామ్‌లాల్, దిలీప్‌రెడ్డి, రవిశేఖర్‌రాజు పాల్గొన్నారు.
 
 బాబూ మచ్చలేని నాయకుడని నిరూపించుకో
 నువ్వు అసెంబ్లీలో మచ్చలేని నాయకుడం టూ ఊదరగొట్టేస్తుం టావ్. ఇప్పుడేమో కోట్ల రూపాయలు పెట్టి ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొంటున్నావు. ఇది ప్రజాస్వామ్యానికి మాయని మచ్చకాదా?. నీ నిజాయితీ ఇదేనా?. దమ్ముంటే నీ పార్టీలోకి వచ్చిన మా ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించు. టీడీపీ టికెట్ ఇచ్చి ఎన్నికలు నిర్వహించు. మచ్చలేని నాయకుడని నిరూపించుకో  - డాక్టర్ సునీల్‌కుమార్, పూతలపట్టు ఎమ్మెల్యే
 
 
 అవితి డబ్బుతో ఎమ్మెల్యేలను  కొంటున్నావ్
 పట్టిసీమతోపాటు అమరావతి రాజధాని పేరు తో సీఎం కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారు. ఆ డబ్బును ఎరజూపి ప్రతి పక్ష ఎమ్మెల్యేలను కొంటున్నారు. దేశంలో ఎక్కడికెళ్లినా ఇప్పు డు దీనిపైనే చర్చ. ఎమ్మెల్యేలు సైతం ఏ మాత్రం సంకోచించకుండా తాము నియోజకవర్గ అభివృద్ధికంటూ టీడీపీలో చేరుతున్నారు. ఇది చాలా దుర్మార్గం. సీఎం ఎన్నికల హామీలను నిలబెట్టుకోవాలి. చింతల రామచంద్రారెడ్డి, పీలేరు ఎమ్మెల్యే

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement