శ్రీకాకుళం:
అనూహ్యంగా తెరపైకి వచ్చిన మున్సిపల్ ఎన్నికలు జిల్లాలో సరికొత్త రాజకీయానికి తెరతీశాయి. సాధారణ ఎన్నికల వ్యూహ రచనలో నిమగ్నమైన ప్రధాన పార్టీలను మున్సిపల్ ఎన్నికలు కొంత ఇరకాటంలో పడేశాయి.
అయితే వెంటనే తెప్పరిల్లిన పార్టీలు మున్సిపల్ ఎన్నికల వ్యూహరచనకు ఉపక్రమించాయి. అధికార యం త్రాంగం ఆఘమేఘాలపై ఎన్నికల ప్రక్రియ చేపట్టడంతో రాజకీయ పార్టీలు స్పీడు పెంచక తప్పలేదు. రిజర్వేషన్ల ప్రాతిపదికన అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. ఒకటి రెండు రోజుల్లో ప్రధాన పార్టీల మున్సిపల్ వ్యూహాలు ఖరారు కానున్నాయి.
జోరు మీదున్న వైఎస్సార్‌సీపీ
మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని వైఎస్సార్‌కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు జిల్లా పార్టీ నేతలకు స్పష్టమైన మార్గనిర్దేశం చేసింది. అందుకు అనుగుణంగా జిల్లా నేతలు కార్యాచరణకు ఉపక్రమించారు. మున్సిపాలిటీలవారీగా సన్నాహక సమావేశాలు కొనసాగిస్తున్నారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా వ్యూహరచన చేయాలని నిర్ణయించారు. ముందుగా పలాస మున్సిపాలిటీలో సోమవారం సన్నాహక సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే జుత్తు జగన్నాయకులు, నియోజకవర్గ సమన్వయకర్త వజ్జ బాబూరావు, మున్సిపాలిటీలో పార్టీ ముఖ్య నేత దువ్వాడ శ్రీకాంత్‌లతోపాటు ప్రధాన నేతలు పాల్గొని చర్చించారు.
పలాస మున్సిపల్ చైర్మన్ పదవి ఓసీ జనరల్‌కు కేటాయించడంతో దాంతో సహజంగానే పోటీ ఆసక్తికరంగా మారింది. రానున్న అసెంబ్లీ ఎన్నికలను కూడా దృష్టిలో పెట్టుకుని అభ్యర్థులను ఖరారు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. వార్డుల రిజర్వేషన్ల ప్రకారం కౌన్సిలర్ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేశారు. దీనిపై మరింత నిశితంగా చర్చించేందుకు మంగళవారం మరోసారి సమావేశం కానున్నారు. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొలిక్కి వచ్చిన తర్వాత ప్రచార వ్యూహాన్ని ఖరారు చేస్తారు. ఇచ్ఛాఫురం మున్సిపాలిటీలో వైఎస్సార్‌సీపీ నేతలు ఈ నెల 6న సమావేశం కానున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలోని ముఖ్యనేతలు సంప్రదింపుల ప్రక్రియ కొనసాగిస్తున్నారు. కౌన్సిలర్ అభ్యర్థులపై ప్రాథమికంగా ఓ అంచనాకు వచ్చిన అనంతరం ఈ నెల 6న నిర్వహించే సమావేశంలో తుది వ్యూహాన్ని ఖరారు చేస్తారు. ఆమదాలవసలో పార్టీ నేతలు సంప్రదింపులు జరుపుతున్నారు. ఒకటి రెండు రోజుల్లో సమన్వయకర్త తమ్మినేని సీతారాం, ఇతర ముఖ్యనేతలు ఎన్నికల వ్యూహాన్ని ఖరారు చేయనున్నారు. పాలకొండలో కూడా పార్టీ నేతలు ప్రాథమిక చర్చలు జరుపుతున్నారు.
టీడీపీలో మంతనాల పర్వం
మున్సిపల్ ఎన్నికల మంతనాలకు టీడీపీ తెరతీసింది. పలాసలో సోమవారం ఆ పార్టీ నేతలు గౌతు శివాజీ, ఆయన అల్లుడు వెంకన్న చౌదరి తదితరులు సమావేశమయ్యారు. చైర్మన్ అభ్యర్థి ఎవరన్న కోణంలో చర్చలు జరిపారు. కింజరాపు కుటుంబ సభ్యులతో సంప్రదించి తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. ఇచ్ఛాపురం మున్సిపాలిటీలో టీడీపీలో రెండు ప్రధాన సామాజికవర్గాల మధ్య విభేదాలు పొడచూపాయి. అసలే నియోజకవర్గానికి పెద్దదిక్కులేని తరుణంలో మున్సిపల్ ఎన్నికలు రావడం పార్టీ నేతలను గందరగోళానికి గురిచేసింది. దాంతో ఎన్నికల బాధ్యతను పూర్తిగా ఎంపీ అభ్యర్థి కింజరాపు రామ్మోహన్‌నాయుడుకు అప్పగించేయాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఆమదాలవలస మున్సిపాలిటీలో కూడా టీడీపీ పరిస్థితి అలాగే ఉంది. మున్సిపాలిటీకి బాధ్యత వహించే నేత లేక పార్టీ కొట్టుమిట్టాడుతోంది. కొత్తగా నగర పంచాయతీగా ఆవిర్భవించిన పాలకొండలో మాజీ సర్పంచ్ కొండలరావు రంగంలోకి దిగారు. కానీ ఆయన్ను వైరివర్గం వ్యతిరేకిస్తుండటంతో వర్గవిభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి.
గందరగోళంలో కాంగ్రెస్
మున్సిపల్ ఎన్నికలతో కాంగ్రెస్ పరిస్థితి మరింత దిగజారింది. సాధారణ ఎన్నికలను ఎలా గట్టెక్కాలా అని సతమతమవుతున్న తరుణంలో మున్సిపల్ ఎన్నికలు రావడంతో వారు పూర్తిగా చతికిలపడ్డారు. పలాస, ఇచ్ఛాపురం, పాలకొండ మున్సిపాలిటీల్లో ఆ పార్టీ పరిస్థితి దయనీయంగా ఉంది. ఆ మున్సిపాలిటీల్లో పార్టీ బాధ్యతను నెత్తికెత్తుకునే ఒక్క నేత కూడా లేరు. ఆమదాలవలసలో గత పాలకమండలి వ్యవహార శైలి తీవ్ర వివాదాస్పదమైంది. దీని ప్రభావాన్ని తగ్గిం చేందుకు ఎమ్మెల్యే సత్యవతి చేసిన యత్నాలు ఫలించలేదనే చెప్పాలి. దాంతో మున్సిపల్ ఎన్నికల గండాన్ని ఎలా గట్టెక్కాలా అని ఆ పార్టీ నేతలు తలలు పట్టుకుం టున్నారు. కాగా డీసీసీ అధ్యక్షుడు డోల జగన్ మంగళవారం నుంచి మున్సిపాలిటీల్లో పర్యటించాలని నిర్ణయించారు. ఎన్నికల భారాన్ని కేంద్రమంత్రి కృపారాణి కి పూర్తిగా అప్పగించేయాలని ఆయన భావిస్తున్నారు.