ముందుంది కరెంట్ కోతల కాలం | The first period of the current harvesting | Sakshi
Sakshi News home page

ముందుంది కరెంట్ కోతల కాలం

Published Mon, Mar 16 2015 1:50 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

ముందుంది కరెంట్ కోతల కాలం - Sakshi

ముందుంది కరెంట్ కోతల కాలం

  • విద్యుత్ పంపిణీ సంస్థల ఆర్థికలోటు భర్తీపై సర్కారు కోత వేసిన ఫలితం..
  • సాక్షి, హైదరాబాద్: విద్యుత్ పొదుపు లక్ష్యంగా ఇంధనశాఖ భారీ ప్రణాళికలు రూపొందిస్తోంది. విద్యుత్ పంపిణీ సంస్థల ఆర్థిక లోటు భర్తీపై ప్రభుత్వం కోత విధించిన నేపథ్యంలో అంతర్గత సంస్కరణలపై దృష్టి పెట్టింది. ఒకవైపు విద్యుత్ పొదుపునకు చర్యలు చేపట్టడంతోపాటు.. మరోవైపు పలు రంగాలకిస్తున్నవిద్యుత్‌లో కోతలు పెట్టాలని భావిస్తోంది. ఇందులో భాగంగా గృహాలు, వీధి దీపాలకు ఎల్‌ఈడీ బల్బులను అమర్చే ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్ణయించింది. అదే సమయంలో సబ్సిడీ ఇచ్చే గృహ, వ్యవసాయ విద్యుత్ పంపిణీలో దుర్వినియోగాన్ని అరికట్టాలని భావిస్తోంది. ఇందుకోసం కఠిన చర్యలు తీసుకోవాలని యోచిస్తోంది. ఈ విషయమై ఇంధనశాఖ కార్యదర్శి ఇటీవల జిల్లా డీఈలు, ఏఈలతో చర్చించారు కూడా.
     
    అంతర్గత సంస్కరణలకు సమాయత్తం..

    విద్యుత్ పంపిణీ సంస్థల ఆర్థిక లోటు భర్తీపై ప్రభుత్వం కోత విధించడంతో అంతర్గత సంస్కరణలపైనే విద్యుత్ సంస్థలు ఆశలు పెట్టుకున్నాయి. రూ.6,455 కోట్లు సబ్సిడీ కావాలని కోరితే, కేవలం రూ. 4,360 కోట్లు మాత్రమే అందిస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. దీంతో మిగిలిన మొత్తాన్ని పూడ్చుకునేందుకు అంతర్గత సంస్కరణలు చేపట్టడం తప్ప వాటికి మరోమార్గం కన్పించడం లేదు. దీంతో కొనుగోలు విద్యుత్‌ను కూడా కొంతమేరకు తగ్గించుకునేందుకు ఇంధనశాఖ కసరత్తు చేస్తోంది.

    ఈ సంవత్సరం 58,191 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ ఉంది. లభ్యత మాత్రం 54,884 మిలియన్ యూనిట్లే. ఫలితంగా 3,307 మిలియన్ యూనిట్ల మేర విద్యుత్ లోటు ఏర్పడే అవకాశముంది. ఫలితంగా ఈ ఏడాది 11,087 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొనుగోలుకు సిద్ధపడ్డారు. దీనివల్ల విద్యుత్ సంస్థలపై ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.7,200 కోట్ల భారం పడే వీలుంది. ఈ భారాన్ని సగానికిపైగా తగ్గించుకోవాలనేది లక్ష్యం.

    ఈ నేపథ్యంలో ఏపీ జెన్‌కో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, కేంద్ర సంస్థల నుంచి వచ్చే విద్యుత్‌తోపాటు గ్యాస్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలపై ఆధారపడాలని ఇంధనశాఖ నిర్ణయించింది. అదే సమయంలో విద్యుత్ పొదుపు చర్యలతోపాటు పలు కఠిన నిర్ణయాలు తీసుకోవాలని భావిస్తోంది. రంగాలవారీగా కఠిన నిర్ణయాలు ఇలా..
     
    వ్యవసాయం

    ఈ రంగంలో రోజుకు 30 మిలియన్ యూనిట్లున్న సగటు వాడకాన్ని 22 నుంచి 25 మిలియన్ యూనిట్లకు పరిమితం చేయాలని భావిస్తున్నారు. అధికారికంగా ఉన్న 2 లక్షల వ్యవసాయ కనెక్షన్లను కుదించడంతోపాటు ఐఎస్‌ఐ పంపుసెట్లు వాడాలనే నిబంధనను విధించే యోచనలో ఉన్నారు. పదివేల సోలార్ పంపుసెట్లను అందించడం మరో మార్గం. ఫీడర్లవారీగా టార్గెట్లు పెట్టడం, ఆశించిన ఫలితాలు రాని ప్రాంతాలపై కేంద్ర కార్యాలయం నుంచే ప్రత్యేక బృందాలను పంపే ఆలోచనలో ఉన్నారు.
     
    గృహాలు

    గృహ విద్యుత్ వినియోగంలో 20 శాతం పొదుపును లక్ష్యంగా పెట్టుకున్నారు. సాధారణ బల్బుల స్థానంలో ఎల్‌ఈడీలు అమర్చడం ఒక మార్గమైతే.. 12 శాతం పంపిణీ నష్టాలున్న ప్రాంతాల్లో విద్యుత్ చౌర్యాన్ని నివారించడం మరోమార్గం. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 12 వేల మీటర్లలో రీడింగ్ తక్కువగా వస్తోందనే విషయం ఉన్నతాధికారుల దృష్టికొచ్చింది. ఇక మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థలు, గ్రామపంచాయతీల్లోనూ పెద్ద ఎత్తున సంస్కరణలు చేపట్టడం పొదుపులో భాగం. ఇప్పటికే వీధి దీపాలకు ఎల్‌ఈడీ బల్బులు అమరుస్తున్నారు. దీనికితోడు తెల్లవారాక కూడా వీధి దీపాలు ఆపకుండా విద్యుత్‌ను దుర్వినియోగం చేయడాన్ని అడ్డుకునేందుకు వీలుగా టైమర్‌తో కూడిన స్విచ్‌లను అమర్చి, వాటంతటవే ఆగిపోయే విధానాన్ని ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నారు.
     
    వాణిజ్యం, పరిశ్రమలు

    మొత్తం విద్యుత్‌లో పారిశ్రామిక వాడకం 30 శాతంగా ఉంది. ఈ రంగంలో పెద్దఎత్తున విద్యుత్ చౌర్యం జరుగుతున్నట్టు అనుమానాలున్నాయి. ఇందులో కిందిస్థాయి సిబ్బంది అవినీతి ఒక కారణంగా భావిస్తున్నారు. దీన్నిదృష్టిలో ఉంచుకుని సిమ్‌కార్డుల ద్వారా ఆన్‌లైన్ విధానాన్ని ప్రవేశపెట్టబోతున్నారు. ఫీడర్లవారీగా వచ్చే రీడింగ్‌ను ఎప్పటికప్పుడు పరిశీలిస్తారు. ఇందుకోసం ఏ ఫీడర్ నుంచి ఏయే పరిశ్రమలకు విద్యుత్ వెళుతుంది? ఎంత వినియోగం జరుగుతోంది? అనే వివరాలు సేకరిస్తున్నారు. గృహావసరాలకు వినియోగించే విద్యుత్‌తోనూ వాణిజ్య కార్యకలాపాలు జరుగుతున్నాయనేది అంతర్గత నివేదికల సారాంశం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement