
వేటకు ఎసరు..!
► మత్స్యకారుల బతుకుల్లో చిచ్చు...
► కొండవీటివాగు పేరిట ‘గూడు’ కూల్చివేత
► నదీ గర్భాన్ని కబ్జా చేసి పొట్టకొట్టే యత్నం
► గంగపుత్రులపై ప్రభుత్వ పెద్దల ప్రతాపం
ప్రభుత్వ అండతో అక్రమార్కులు మత్స్యకారులపై ప్రతాపం చూపుతున్నారు. నదిని ఆక్రమించుకుని వారి పొట్టకొట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం కోసమంటూ మత్స్యకారులకు నిలువ నీడలేకుండా చేయటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
సాక్షి, అమరావతి బ్యూరో : కృష్ణా, గుంటూరు జిల్లాల్లో మత్స్యకారుల బతుకులు ప్రశ్నార్థకం కానున్నాయి. తాడేపల్లి çసమీపంలో కృష్ణా నదిని నమ్ముకుని సుమారు 500కుపైగా మత్స్యకార కుటుంబాలు జీవిస్తున్నాయి. వీరంతా నదీ తీరప్రాంతంలో నివాసాలు ఏర్పాటు చేసుకుని ఉంటున్నారు. అదే విధంగా గుంటుపల్లి, తుమ్మలపాలెం, తాళ్లాయపాలెం, ఉద్దండ్రాయునిపాలెం పరిధిలో మరో 500 కుటుంబాలు నదిలో చేపల వేటపై ఆధారపడి బతుకుతున్నాయి. అయితే రాజధానిలోని అక్రమార్కుల అరాచకం కారణంగా మత్స్యకారుల బతుకులు ప్రశ్నార్థకం కానున్నాయి.
కొండవీటి వాగు పేరిట...
రాజధాని నిర్మాణానికి కొండవీటి వాగు ముప్పుపొంచి ఉన్న విషయం తెలిసిందే. ఆ ముప్పును తప్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా తాడేపల్లి సమీపంలో ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకం పూర్తి కావాలంటే నదీతీర ప్రాంతంలో నివాసం ఉంటున్న సమారు 500 కుటుంబాల వారిని అక్కడి నుంచి తరిమివేయాలని నిర్ణయించారు.
ఇప్పటికే 140 నివాసాలను కూలదోశారు. మిగిలిన నివాసాలను సైతం తొలగించేందుకు ఒత్తిడి చేస్తున్నారు. ఖాళీ చేయించటానికి మత్స్యకారులకు రకరకాల హామీలు గుప్పిస్తున్నారు. అయితే ప్రభుత్వ చర్యలను మత్స్యకారులు వ్యతిరేకిస్తున్నారు. దీనిపై పలుమార్లు స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళనలు చేశారు. సంబంధిత అధికారులు, ప్రభుత్వ పెద్దలను కలసి న్యాయం చేయాలని విన్నవించారు. అయినా ప్రభుత్వం వారి గోడు పట్టించుకోవటం లేదు.
నదిని ఆక్రమించి పొట్టకొట్టే యత్నం ...
తాడేపల్లిలో మత్స్యకారుల నివాసాలకు ఎసరుపెట్టిన ప్రభుత్వం... గుంటుపల్లి సమీపంలో టీడీపీ పెద్దలు కొందరు ఏకంగా కృష్ణానదినే కబ్జా చేశారు. టీడీపీ పెద్దలు ప్రయత్నాలు ఫలిస్తే మత్స్యకారులు చేపల వేటపై ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి. గుంటుపల్లి, తుమ్మలపాలెం, తాళ్లాయపాలెం, ఉద్దండ్రాయునిపాలెం పరిధిలో 500 కుటుంబాల జీవనం ప్రశ్నార్థకంగా మారనుంది. ఇప్పటికే ఇసుక అక్రమ రవాణా, ప్రకృతి వైపరీత్యాలతో చేపల వేట ద్వారా జీవనం కష్టతరమైంది. ఇక నది కూడా ఆక్రమణకు గురైతే ఉన్న ఆ చిన్నపాటి ఆశ కూడా వదులుకోవాల్సిన పరిస్థితి.
నదిలో నిరసన...
కృష్ణానది ఆక్రమణ విషయం ‘సాక్షి’ వెలుగులోకి తీసుకురావటంతో మత్స్యకారులు స్పందించారు. కబ్జారాయుళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యారు. అందులో భాగంగా ఆదివారం సుమారు 500 మందికిపైగా మత్స్యకారులు 250 బోట్లతో నదిలో ధర్నా చేపట్టారు. కబ్జారాయుళ్లకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, ఆక్రమిత ప్రాంతం చుట్టూ తిరుగుతూ నిరసన తెలియజేశారు. ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం తప్పదని హెచ్చరించారు.