గుడివాడ: ప్రేమించి మోసం చేశాడని, తనకు న్యాయం చేయాలని కోరుతూ ప్రియుడి ఇంటి వద్ద ఆందోళనకు దిగిన సంఘటన శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం.. గుడివాడ పట్టణం నాగవరప్పాడుకు చెందిన లీలాపుష్పానికి టీచర్స్ కాలనీకి చెందిన ఎరుకపాటి సుదర్శన్‌తో ఆరేళ్ల క్రితం ప్రేమాయణం నడిచింది. అయితే వీరు నాలుగేళ్ల క్రితమే విడిపోయినట్లు సమాచారం. కాగా సుదర్శన్‌కు ఈనెల 21న వేరొక యువతితో వివాహం జరుగుతుందని తెలిసిన లీలాపుష్పం శుక్రవారం ఉదయం సుదర్శన్ ఇంటికి వెళ్లి గొడవకు దిగింది.
అయితే సుదర్శన్‌కు వివాహం జరుగుతుందని ఈనెల 18నే ఒన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో లీలాపుష్పం ఫిర్యాదు చేసిందని సీఐ దుర్గారావు తెలిపారు. యువతితోపాటు యువతి తల్లి, యువతి చెల్లి అక్కడ గొడవకు దిగిన వారిలో ఉన్నారు. సుదర్శన్ ఇంటివద్ద ఎటువంటి వివాహం జరగడం లేదని, గృహ ప్రవేశానికి విందు ఏర్పాటు చేసుకున్నారని సీఐ దుర్గారావు తెలిపారు. అయితే సుదర్శన్ అతని కుటుంబ సభ్యులు అందుబాటులో లేరని, వారి కోసం వెతుకుతున్నామని సీఐ తెలిపారు.