నమ్మించి..నట్టేట ముంచాడు!
ప్రియుడు పెళ్లాడే వరకూ దీక్ష విరమించేది లేదు..
♦ రెండో రోజుకు చేరిన యువతి వెంకట రమణ మౌనదీక్ష
♦ బాధితురాలికి అండగా మహిళా, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు
♦ చీరాలలో అర్ధరాత్రి మౌనదీక్ష శిబిరాన్ని పరిశీలించిన డీఎస్పీ జయరామరాజు
చీరాల : ‘ప్రేమించానన్నాడు.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి నట్టేట ముంచాడు.. నాకు న్యాయం జరిగే వరకూ మౌనదీక్ష విరమించేది లేదు’ అని ప్రియుని చేతిలో మోసపోయిన యువతి వెంకట రమణ తేల్చి చెప్పింది. ఓ ప్రైవేట్ కళాశాల లెక్చరర్ చేతిలో మోసపోయిన ఆమె.. చీరాలలోని అతడి ఇంటి ముందు శనివారం నుంచి చేపట్టిన మౌన దీక్ష ఆదివారానికి రెండో రోజుకు చేరుకుంది. ఆమెకు పలు రాజకీయ, మహిళా, ప్రజా సంఘాల నాయకులు అండగా నిలిచారు. బాధితురాలికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. వేటపాలెం మండలం చల్లారెడ్డిపాలేనికి చెందిన ఇంజిరింగ్ విద్యార్థిని గుమ్మా వెంకట రమణ.. చీరాల వీరరాఘవపేటలో నివసించే కూరపాటి వెంకట పూర్ణచంద్ర ప్రసాద్‌లు మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.
ప్రేమ పేరుతో నమ్మించి వెంకట రమణను లోబరుచుకుని పెళ్లి చేసుకుంటాటనని మోసగించాడు. ఈ నేపథ్యంలో బాధితురాలు మౌనదీక్షకు దిగింది. ఆమె ప్రియుడు, ఇతర కుటుంబ సభ్యులు శనివారం రాత్రి ఇంటికి తాళం వేసి ఎటో వెళ్లిపోయినా ఆమె అర్ధరాత్రి కూడా ప్రియుని ఇంటిముందే దీనంగా కూర్చుని దీక్ష కొనసాగించింది. ఆ సమయంలో చీరాల డీఎస్పీ జయరామరాజు సంఘటన స్థలానికి వెళ్లి బాధితురాలిని పరామర్శించి వివరాలు సేకరించారు. తనకు న్యాయం చేయాలని ఆమె డీఎస్పీని కోరింది. డీఎస్పీ ఆదేశాల మేరకు మౌనదీక్ష చేస్తున్న వెంకట రమణకు చీరాల ఒన్‌టౌన్ పోలీసులు రక్షణ కల్పించారు.
బాధితురాలికి సమాజ్ వాదీ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాబు, నాయకులు సుదర్శన్, హరికృష్ణ, మస్తానమ్మలతో పాటు ఏపీ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు ఐ.లక్ష్మీశేషు, సీఐటీయూ నాయకుడు బాబూరాావు, మహిళా మండలి ప్రతినిధులు, బీసీ సంఘాల నాయకులు, ఏఐఎస్‌ఎఫ్ ప్రతినిధులు పి.నందా మద్దతు పలికారు. బాధితురాలికి న్యాయం చేయాలని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
పెళ్లి చేసుకునే వరకూ దీక్ష విరమించను : వెంకట రమణ
నన్ను ప్రేమించి మోసం చేసి అన్యాయం చేసిన పూర్ణచంద్రప్రసాద్‌తో నా పెళ్లి జరగాలి. అప్పటి వరకూ మౌన పోరాటం ఆపను. ఈ సంఘటనలో పోలీసులు కూడా నిందితుని పక్షానే నిలిచి నాకు అన్యాయం చేశారు. నాకు మోసగించిన యువకునితో పది మందిలో పెళ్లి జరగాలి. లేకుంటే ఆందోళననను మరింత ఉధృతం చేస్తా.